నేడు 2వ వార్డుకు ఉపఎన్నిక
నేడు 2వ వార్డుకు ఉపఎన్నిక
Published Sat, Apr 8 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
- ఆత్మకూరులో భారీ బందోబస్తు
- ప్రతి 14మంది ఓటర్లకు ఓ పోలీస్
- పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఉప ఎన్నిక: ఆత్మకూరు రెండో వార్డు
కారణం: వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నబీ మృతి చెందడంతో
పోటీలో ఉన్న అభ్యర్థులు: యూనస్-వైఎస్‌ఆర్‌సీపీ
నబీరసూల్- టీడీపీ
సయ్యద్ మాబూ- కాంగ్రెస్
ఓటర్ల సంఖ్య: 1415
పోలింగ్ కేంద్రం: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల
బందోబస్తులో ఉన్న పోలీసులు: 105
ఆత్మకూరు రూరల్: నగర పంచాయతీ రెండో వార్డుకు ఆదివారం పోలింగ్ జరగనుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నబీ..గత ఎన్నికల్లో గెలిచి కొద్ది రోజుల్లోనే గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో ఉప ఎన్నిక అవసరమైంది. వార్డుకు త్రిముఖ పోటీ జరుగుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై మీర్ యూనస్ పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున నబీరసూల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సయ్యద్ మాబు పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నాటి నుంచే టీడీపీ దౌర్జన్య కాండకు పాల్పడింది. ప్రత్యర్థి అభ్యర్థులను ఉపసంహరణ చేయించి ఎన్నికను ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి యూనస్‌పై దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడింది. అయితే ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
విస్తృత బందోబస్తు
ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 1415 మంది ఓటర్లు..ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు 14 మంది ఓటర్లకు ఒక పోలీసు చొప్పున మొత్తం 105 మందిని బందోబస్తు కోసం నియమించారు.
వైస్‌ఆర్‌సీపీ అభ్యర్థి యూనిస్‌ను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నాయకులు విఫలయత్నం చేయడం.. ఆత్మకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కావడంతో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ స్పందించారు. ఆత్మకూరు వచ్చి రెండో వార్డులో పర్యటించి శాంతిభధ్రతల విషయంలో అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ కృష్ణయ్యల ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలు, ఏడుగురు ఏఎస్‌ఐలు, 32 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఇద్దురు మహిళా పోలీసులు, 16 మంది హోం గార్డులు, 40 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తు కోసం నియమించారు.
పోలింగ్ బూత్‌ల పరిశీలిన..
ఉప ఎన్నికల ప్రత్యేకాధికారి.. హంద్రినీవా సుజల స్రవంతి ప్రత్యేక కలెక్టర్ మల్లికార్జునుడు శనివారం పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు బూతులను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ బూతులకు చేరుకున్నాయి. వేసవి కాలం కావడంతో ఓటర్లు ఇబ్బందుల పడకుండా తగినన్ని షామియానాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక ఎన్నికల అధికారి వెంట మండల ప్రత్యేకాధికారి సత్యరాజు తహసీల్దార్ రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద కూడా ఉన్నారు.
Advertisement