nagara panchayat
-
పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ప్రజలకు సకాలంలో సేవలు అందించడంపై రాష్ట్ర మునిసిపల్ పాలనా విభాగం దృష్టి సారించింది. ఏ స్థాయిలోనూ ‘పెండింగ్’ అనేది లేకుండా నిబంధనల ప్రకారం వెంటనే సమస్యలను పరిష్కరించనుంది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందించాల్సిన సేవలపై పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మంగళ లేదా బుధవారాల్లో మునిసిపల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతినెలా మూడు లేదా నాలుగు మున్సిపాలిటీల్లో సీడీఎంఏ స్వయంగా పర్యటించనున్నారు. ఏ లోపం ఉన్నా కమిషనర్లదే బాధ్యత ప్రభుత్వ పథకాలు సకాలంలో ప్రజలకు అందుతున్నాయా? లేదా అనే అంశంపై మునిసిపల్ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో సిబ్బంది, కమిషనర్లపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఒక బృందాన్ని కూడా నియమిస్తోంది. మునిసిపాలిటీలో ఏ స్థాయిలో అవినీతి జరిగినా, ప్రజలకు అందించాల్సిన సేవల్లో లోపం కనిపించినా అందుకు స్థానిక కమిషనర్లనే బాధ్యులను చేయనుంది. 4,136 వార్డులపై ప్రత్యేక దృష్టి వార్డు సచివాలయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని మునిసిపల్ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉన్న 4,136 వార్డుల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి ఎప్పుడు ఏం ప్రశ్న వస్తుందోనని మునిసిపల్ కమిషనర్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తుల దుమ్ముదులిపే పనిలో నిమగ్నమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మునిసిపాలిటీలో ఇటీవల పర్యటించిన సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ కొత్తపేట–2 సచివాలయంలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారు యూనిఫామ్ ధరించకపోవడాన్ని గుర్తించారు. వార్డు కార్యాలయాల్లో సిబ్బంది పేర్లు, వారు అందించే సేవల బోర్డులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో సిబ్బంది పనితీరుని మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ పర్యటనలో ఆయన గుర్తించిన లోపాలను అన్ని మునిసిపాలిటీలు సరిచేసుకోవాలని 123 మంది కమిషనర్లకు నోటీసులు పంపించారు. కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో సకాలంలో సేవలు అందలేదని ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. కిందిస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి. కమిషనర్లు పట్టణంలో పర్యటిస్తుంటే సమస్యలు తెలుస్తాయి. ఫిర్యాదులు, పెండింగ్ సమస్యలు ఎక్కడా లేకుండా చర్యలు తీసుకోవాలి. మునిసిపాలిటీల్లో 4,136 వార్డులు ఉన్నాయి. వాటిలో 317 సేవలు అందించాలి. ఎవరు ఎలాంటి సేవలు అందిస్తారనేది వార్డు సచివాలయాల్లో బోర్డులు పెట్టాలి. కొన్ని వార్డుల్లో ఇప్పటిదాకా బోర్డులు పెట్టనిచోట చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చేలా ప్రవర్తించినా, ప్రభుత్వ సేవలు, పథకాలు సకాలంలో ప్రజలకు అందకున్నా బాధ్యులపై చర్యలు తప్పవు. – ప్రవీణ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ -
ఇక.. ధర్మపురి నగరపంచాయతీ!
ధర్మపురి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న నగరపంచాయతీల్లో ధర్మపురికి చోటు దక్కనుంది. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రెండు నెలల క్రితం నూతన పంచాయతీలు, నగరపంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు జగిత్యాల జిల్లా నుంచి మేజర్ పంచాయతీలైన ధర్మపురి, రాయికల్‌ను నగరపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. నిబంధనలు అనుకూలం గతంలో నగరపంచాయతీ హోదా దక్కాలంటే 20వేల జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 20 వేలు ఉన్న జనాభాను 15 వేలకు కుదించింది. పంచాయతీలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుబంధ గ్రామాలను విలీనం చేసి నగరపంచాయతీలుగా మార్చనుంది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మొదట 16,690 జనాభా ఉండగా సమీపంలోని కొరండ్లపల్లి, హరన్నపల్లి గ్రామాల విలీనంతో ధర్మపురి జనాభా 17,352కు చేరింది. రాయికల్ పంచాయతీలో గ్రామాల విలీనం ప్రతిపాదించకపోవడంతో జనాభా 16,985 ఉంది. ధర్మపురి, రాయికల్ పంచాయతీల్లో సంవత్సర ఆదాయం రూ.70లక్షలకు పైగా ఉంది. అన్ని అర్హతలున్న రెండు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చడానికి కలెక్టర్ శరత్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
నేడు 2వ వార్డుకు ఉపఎన్నిక
- ఆత్మకూరులో భారీ బందోబస్తు - ప్రతి 14మంది ఓటర్లకు ఓ పోలీస్ - పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉప ఎన్నిక: ఆత్మకూరు రెండో వార్డు కారణం: వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నబీ మృతి చెందడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు: యూనస్-వైఎస్ఆర్సీపీ నబీరసూల్- టీడీపీ సయ్యద్ మాబూ- కాంగ్రెస్ ఓటర్ల సంఖ్య: 1415 పోలింగ్ కేంద్రం: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల బందోబస్తులో ఉన్న పోలీసులు: 105 ఆత్మకూరు రూరల్: నగర పంచాయతీ రెండో వార్డుకు ఆదివారం పోలింగ్ జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నబీ..గత ఎన్నికల్లో గెలిచి కొద్ది రోజుల్లోనే గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో ఉప ఎన్నిక అవసరమైంది. వార్డుకు త్రిముఖ పోటీ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై మీర్ యూనస్ పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున నబీరసూల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సయ్యద్ మాబు పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం నాటి నుంచే టీడీపీ దౌర్జన్య కాండకు పాల్పడింది. ప్రత్యర్థి అభ్యర్థులను ఉపసంహరణ చేయించి ఎన్నికను ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యూనస్‌పై దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడింది. అయితే ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. విస్తృత బందోబస్తు ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 1415 మంది ఓటర్లు..ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు 14 మంది ఓటర్లకు ఒక పోలీసు చొప్పున మొత్తం 105 మందిని బందోబస్తు కోసం నియమించారు. వైస్ఆర్సీపీ అభ్యర్థి యూనిస్‌ను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నాయకులు విఫలయత్నం చేయడం.. ఆత్మకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కావడంతో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ స్పందించారు. ఆత్మకూరు వచ్చి రెండో వార్డులో పర్యటించి శాంతిభధ్రతల విషయంలో అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ కృష్ణయ్యల ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్ఐలు, ఏడుగురు ఏఎస్ఐలు, 32 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఇద్దురు మహిళా పోలీసులు, 16 మంది హోం గార్డులు, 40 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తు కోసం నియమించారు. పోలింగ్ బూత్‌ల పరిశీలిన.. ఉప ఎన్నికల ప్రత్యేకాధికారి.. హంద్రినీవా సుజల స్రవంతి ప్రత్యేక కలెక్టర్ మల్లికార్జునుడు శనివారం పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు బూతులను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ బూతులకు చేరుకున్నాయి. వేసవి కాలం కావడంతో ఓటర్లు ఇబ్బందుల పడకుండా తగినన్ని షామియానాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక ఎన్నికల అధికారి వెంట మండల ప్రత్యేకాధికారి సత్యరాజు తహసీల్దార్ రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద కూడా ఉన్నారు.