
ధర్మపురిలోని ముఖ్యమైన కూడలి
ధర్మపురి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న నగరపంచాయతీల్లో ధర్మపురికి చోటు దక్కనుంది. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రెండు నెలల క్రితం నూతన పంచాయతీలు, నగరపంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు జగిత్యాల జిల్లా నుంచి మేజర్ పంచాయతీలైన ధర్మపురి, రాయికల్‌ను నగరపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు.
నిబంధనలు అనుకూలం
గతంలో నగరపంచాయతీ హోదా దక్కాలంటే 20వేల జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 20 వేలు ఉన్న జనాభాను 15 వేలకు కుదించింది. పంచాయతీలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుబంధ గ్రామాలను విలీనం చేసి నగరపంచాయతీలుగా మార్చనుంది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మొదట 16,690 జనాభా ఉండగా సమీపంలోని కొరండ్లపల్లి, హరన్నపల్లి గ్రామాల విలీనంతో ధర్మపురి జనాభా 17,352కు చేరింది.
రాయికల్ పంచాయతీలో గ్రామాల విలీనం ప్రతిపాదించకపోవడంతో జనాభా 16,985 ఉంది. ధర్మపురి, రాయికల్ పంచాయతీల్లో సంవత్సర ఆదాయం రూ.70లక్షలకు పైగా ఉంది. అన్ని అర్హతలున్న రెండు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చడానికి కలెక్టర్ శరత్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.