
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత తెలిపారు. శనివారం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు.
క్యార్యకర్తలు, కంటోన్మెంట్ ప్రజల కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నాన్న సాయన్నను, చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు. త్వరలో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
కాగా, ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్‌సభ ఎన్నికలతో పాటే ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్వహించనుంది. ఉప ఎన్నికలో పోటీకి లాస్య నందిత సోదరి ముందుకు రావడంతో బీఆర్‌ఎస్ కూడా ఆమెకే టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నేను ఉంటా - దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత pic.twitter.com/M8Fm7gMlRK
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2024