contonment
-
HYD: సుచిత్రలో అక్రమ కట్టడాల కూల్చివేత
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.కంటోన్మెంట్ పరిధిలోని సుచిత్ర మార్గంలో నాలా ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ కొందరు దుకాణాలు నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాపిక్కు ఇబ్బందవుతోందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు దుకాణాలను నేలమట్టం చేశారు. కాగా, హైదరాబాద్ నగరంలో నాలాలు, చెరువులను ఎంతటివారు ఆక్రమించినా వదిలేది లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో కంటోన్మెంట్ కూడా అక్రమ కొట్టడాలపై చర్యలు ప్రారంభించడం గమనార్హంఇదీ చదవండి.. ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు: కేటీఆర్ -
కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుపు
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ విజయం సాధించారు. సమీప ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత నెల 13న జరిగిన ఉపఎన్నికలో 1,30,929 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ 53,651 ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్ 40,445 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి జి. నివేదిత కేవలం 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు. గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. లాస్య నందిత స్థానంలో ఆమె అక్క నివేదితకు బీఆర్ఎస్కు టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్, కాంగ్రెస్‌లో చేరి పార్టీ టికెట్ దక్కించుకున్నారు. 3.. 2.. 1 : తొలినాళ్లలో కాంగ్రెస్ యువనేతగా రాజకీయాల్లోకి వచి్చన నారాయణన్ శ్రీగణేశ్, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం శ్రీగణేశ్ ఫౌండేషన్ స్థాపించి కంటోన్మెంట్లో తన సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలో మరోసారి కాంగ్రెస్ టికెట్ కోసం యతి్నంచినా, దక్కలేదు. ఆఖరి నిమిషంలో బీజేపీ టికెట్ కేటాయించడంతో పోటీ చేసి 15వేల పైచిలుకు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ తరఫున పోటీ చేసి 41,888 ఓట్లతో రెండోస్థానం దక్కించుకున్నారు. ఉపఎన్నిక రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శ్రీగణేశ్ సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి ఎట్టలకేలకు విజయం అందుకున్నారు. దీంతో శ్రీగణేశ్‌ను 3.. 2.. 1గా ఆయన అభిమానులు అభివర్ణిస్తూ ఉండటం గమనార్హం. రేవంత్‌ను కలిసిన శ్రీగణేశ్: ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీగణేశ్ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనను అభినందించారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు పెరిగిన బలం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ బలం పెరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం మరింత తగ్గినట్లయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసిన శ్రీగణేశ్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్‌పై 13 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నందిత సోదరి నివేదిత మూడోస్థానానికి పరిమితమయ్యారు. కాగా, కంటోన్మెంట్లో విజయంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరగ్గా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ఆ సంఖ్య 68కి చేరింది. మిత్రపక్షం సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం. కంటోన్మెంట్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం, ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపుతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 39 నుంచి 35కి తగ్గింది. -
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నివేదిత
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్ -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆ ఫ్యామిలీకే ?
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశమై కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్ -
Hyd: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తా.. లాస్య నందిత సోదరి నివేదిత
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత తెలిపారు. శనివారం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. క్యార్యకర్తలు, కంటోన్మెంట్ ప్రజల కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నాన్న సాయన్నను, చెల్లి లాస్యనందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానన్నారు. త్వరలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్‌సభ ఎన్నికలతో పాటే ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్వహించనుంది. ఉప ఎన్నికలో పోటీకి లాస్య నందిత సోదరి ముందుకు రావడంతో బీఆర్ఎస్ కూడా ఆమెకే టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో నేను ఉంటా - దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత pic.twitter.com/M8Fm7gMlRK — Telugu Scribe (@TeluguScribe) March 16, 2024 -
లాస్య నందిత కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ..
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా, ఆదివారం ఉదయం మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని లాస్య నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా నందిత చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి, సోదరిని ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. pic.twitter.com/T5jPw2JV69 — BRS Party (@BRSparty) February 25, 2024 విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్య నందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని తెలిపారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/JTL25SzykP — BRS Party (@BRSparty) February 25, 2024 -
Updates: ఎమ్మెల్యే లాస్యకు నేతల నివాళులు
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి Updates.. ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య కొనసాగిన అంతిమయాత్ర హైదరాబాద్: లాస్య నందిత అంతిమ యాత్ర ప్రారంభం కాసేపట్లో మారేడుపల్లిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళులు లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాస్య భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికాయానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హారీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు లాస్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సోదరి, ఎమ్మెల్యే లాస్య మృతి ఆ కుటుంబానికి, కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. లాస్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చే ప్రయత్నం చేసినా ఆవేదనగా ఉంది. ఒకే ఏడాదిలో సాయన్నను, లాస్యను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కూడా సాయన్న కుటుంబానికి అండగా ఉంటుంది. ఆత్మీయ సోదరి, ఎమ్మెల్యే లాస్య నందిత గారి మృతి ఆ కుటుంబానికి, కంటోన్మెంట్ ప్రజలకు, బీఆరెస్ పార్టీకి తీరని లోటు. లాస్య కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చే ప్రయత్నం చేసిన. కానీ ఒకే ఏడాదిలో సాయన్నను, లాస్యను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుడు ఆ… pic.twitter.com/bAP3A0udlz — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 23, 2024 ►లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులర్పించిన కేసీఆర్ ►కార్ఖానాలో లాస్య ఇంటికి చేరుకున్న కేసీఆర్ ►లాస్య ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. పూర్తిస్థాయి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తాం: పోలీసులు ►సంగారెడ్డి పటాన్చెరు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద లాస్య నందిత కారుకు ప్రమాదం ►ప్రమాదానికి గురైన కారును పరిశీలించిన ఏఎస్పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు ►ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై ASP సంజీవ రావు ►ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చింది ►కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి ►అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు ►మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ►ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం ఆ విషయంపై రాని స్పష్టత! ►నిన్న రాత్రి సదాశివపేట (మం) కొనపూర్ లోని మీస్కిన్ బాబా దర్గాకి వచ్చిన లాస్య నందిత కుటుంబ సభ్యులు ►కాసేపటికి దర్గాకి పీఏ ఆకాష్ తో కలిసి వచ్చిన ఎమ్మెల్యే లాస్య నందిత ►రాత్రి 12.30 గంటలకు ఇక్కడికి వచ్చి పూజలు చేశారని చెబుతున్న దర్గా నిర్వాహకులు ►అర్ధరాత్రిరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్లిన లాస్య నందిత కుటుంబం ►తిరిగి పటాన్ చెరు వైపు ఎందుకు వెళ్లారు? అన్నదానిపై నో క్లారిటీ తండ్రీ సమాధి పక్కనే.. ►ఇవాళే లాస్య నందిత అంత్యక్రియలు ►మారేడ్ పల్లి లోని స్మశాన వాటిక లో లాస్య నందిత అంత్యక్రియలు ►లాస్యనందిత తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ఆమె అంత్యక్రియలు చేయనున్న కుటుంబ సభ్యులు ►లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ►ఈరోజు సాయంత్రం లాస్య నందిత పార్ధీవ దేహానికి నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్ ►మేడారం జాతరకు వెళ్లి వచ్చిన తర్వాత లాస్య నందిత ఇంటికి వెళ్లనున్న సీఎం రేవంత్ ►కాసేపట్లో లాస్య నివాసానికి కేసీఆర్ ►లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్న కేసీఆర్ ►కార్ఖానాలోని తన నివాసానికి చేరుకున్న లాస్య నందిత పార్థివ దేహం ►ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు ►అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు ►లాస్యకు పోస్టుమార్టం పూర్తి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించిన గాంధీ వైద్యులు. ►లాస్య నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం ►గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ► గాంధీ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం పూర్తయ్యాక నేరుగా కార్ఖానాలోని తన నివాసానికి లాస్య నందిత భౌతిక కాయం ►లాస్య నందిత అంత్యక్రియలు ముగిసే వరకు ఇక్కడే ఉండనున్న ఎమ్మెల్సీ కవిత ►లాస్య నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులకు పరామర్శ. ►గాంధీలో లాస్య మృతదేహానికి పోస్టుమార్గం, భారీగా తరలివచ్చిన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ► లాస్య నందిత నివాసానికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. ►పటాన్చెరు నుంచి గాంధీ ఆసుపత్రికి లాస్య మృతదేహం తరలింపు, ►గాంధీలో లాస్య మృతదేహానికి పోస్టుమార్టం, అనంతరం ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. ►అమేధా ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహాం. ఆసుపత్రికి వెళ్తున్న కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు.. ►అమేధా ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు.. ►లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్‌రావు. ►పటాన్చెరు వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. ఇక, ఆమె మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ►ఈ క్రమంలో లాస్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. లాస్య మరణం బాధాకరమన్నారు. లాస్య కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్ సంతాపం.. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా… pic.twitter.com/Y44sF8Jvi9 — Revanth Reddy (@revanth_anumula) February 23, 2024 కేటీఆర్ సంతాపం.. ఇది దాదాపు వారం క్రితం లాస్యను పరామర్శించిన ఫోటోలు లాస్య ఇక లేరు అనే అత్యంత విషాదకరమైన, షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను చాలా మంచి నేతగా ఉన్న యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీవ్ర నష్టం ఈ భయంకరమైన, క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని నా హృదయపూర్వక ప్రార్థనలు This was about a week ago. Just now heard the absolutely tragic & shocking news that Lasya is no more !! Woke up to the devastating loss of the young legislator who was a very good leader in the making My heartfelt prayers for strength to her family and friends in this terrible… https://t.co/CqpfrxMweU — KTR (@KTRBRS) February 23, 2024 హరీష్‌రావు సంతాపం.. ►ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గవర్నర్ తమిళిసై సంతాపం.. లాస్య దుర్మరణం చెందడం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని తెలిపిన గవర్నర్ కిషన్‌రెడ్డి సంతాపం.. లాస్య అకాల మరణంపై కిషన్ రెడ్డి సంతాపం. చిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్య మరణం ఎంతో కలచివేసింది. గతంలో కార్పొరేటర్‌గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే లాస్య మంచి భవిష్యత్తున్న నాయకురాలు. ఆమె తండ్రి, నా మిత్రుడైన ఎమ్మెల్యే సాయన్న గతేడాదే అనారోగ్యంతో చనిపోయారు. ఏడాది తిరిగేలోపే లాస్య రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడవటం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ కవిత సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య నందిత అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య నందిత అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని… — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 23, 2024 బీఆర్ఎస్ పార్టీ సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా… pic.twitter.com/PZKVykFubA — BRS Party (@BRSparty) February 23, 2024 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అత్యంత బాధాకరం.. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్ ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.. గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం.. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతి ఎంతో బాధను కలిగించింది. ఆమె తండ్రి సాయన్న ఆశయాల సాధన కోసం ప్రజా సేవలోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజుల్లోనే స్వర్గస్థులవడం చాలా బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని ప్రార్ధిస్తున్నాను. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంతాపం.. ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను తలసాని సంతాపం.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరం. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతుందనుకోలేదు. లాస్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం ►సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ►ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. నల్గొండలో భారాస బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ►దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. -
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వేకువ ఝామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆమె పీఏ, స్నేహితుడు ఆకాష్‌కు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురైన కారు నిద్రమత్తులోనే? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద ఈ తెల్లవారు ఝామున దుర్ఘటన చోటు చేసుకుంది. మొక్కులు తీర్చుకునే క్రమంలో లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులంతా గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వెళ్లారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య కారు బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి.. రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురైన కారు తల్లడిల్లిన తల్లి గుండె ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆకాశ్‌ను మియాపూర్ మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు అమెథా ఆస్పత్రికి తరలించారు. కూతురి మరణవార్త విని తల్లి స్పృహ తప్పి పడిపోయారు. మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. సోదరి నివేదితా రోదన పలువురిని కంటతడి పెట్టించింది. బీఆర్ఎస్ సీనియర్ హరీష్‌రావు ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అందజేస్తారు. ఇక.. యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లాస్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన హరీష్‌రావు సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం లాస్య మృతిపై సంతాపం ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి గాంధీ ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. లాస్య మృతి బాధాకరమని.. ఎమ్మెల్యేగా ఆమె ప్రజలకు ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారాయన. బీఆర్ఎస్ నేతలు తలసాని, హరీష్‌రావు, కేటీఆర్, మల్లారెడ్డి.. తదితరులు లాస్య మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. లాస్య అంత్యక్రియలు అయ్యేదాకా ఆమె కుటుంబ సభ్యులతోనే ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం కవితకు సూచించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసుల దర్యాప్తు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరగ్గా.. ప్రాథమికంగా వచ్చిన అంచనాతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలించాయి. త్వరలో కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. @KTRBRS @TelanganaCMO @BRSparty pic.twitter.com/r3ZBt5SiAz — G Lasya Nanditha (@glasyananditha) December 9, 2023 10 రోజుల కిందటే ప్రమాదం.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన నల్లగొండలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్‌పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది కూడా. అయితే ఆ సమయంలోనూ ఆకాషే(25) కారు నడిపినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. కిందటి ఏడాది డిసెంబర్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె మూడు గంటలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సిబ్బంది అతికష్టం మీద లిఫ్ట్‌ను బద్ధలు కొట్టి ఆమెను, ఆమెతో పాటు ఉన్నవాళ్లను బయటకు తీశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదికే.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందడం గమనార్హం. నార్కట్‌పల్లి వద్ద లాస్య కారుకు ప్రమాదం కుటుంబ నేపథ్యం.. సాయన్న, గీతలకు లాస్య నందిత జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు.. నమ్రతా, నివేదితా. లాస్య కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్‌గానూ పని చేశారు. తండ్రి మరణంతో ఆమెకు బీఆర్ఎస్ సీటు ఇవ్వగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గణేష్‌పై 17 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలుపొందారు. ఏడాదికే.. ప్రజాప్రతినిధుల హోదాలోనే ఈ తండ్రీకూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి సాయన్నతో లాస్య నందిత -
Cantonment MLA: కంటోన్మెంట్‌పై చెరగని ముద్ర వేసిన సాయన్న..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ఇక్కడ తనదైన ముద్ర వేశారు. అందరికీ తలలో నాలుకలా.. అజాత శత్రువుగా.. వివాద రహితుడిగా ఆయనకు ఎంతో పేరుంది. ఆదివారం మధ్యాహ్నం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారనే వార్తతో నియోజకవర్గ పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులు అరి్పంచారు. బ్యాంక్ క్లర్కు ఉద్యోగం నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా సాగిన సాయన్న రాజకీయ ప్రస్థానం ఇలా సాగింది.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వాల్వాపూర్లో జన్మించిన సాయన్న.. నగరంలోని న్యూసైన్స్ కాలేజీలో బీఎస్సీ, అనంతరం ఎల్ఎల్బీ చేశారు. 1978లో సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు 1986లోనే రాజకీయాల్లోకి వచి్చన ఆయన.. 1986 బల్దియా ఎన్నికల్లో దోమలగూడ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని సిండికేట్ బ్యాంకులో చేరారు. 1994లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి టీడీపీ అభ్యరి్థగా టికెట్ దక్కడంతో చివరి నిమిషంలో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునరి్వభజనతో కంటోన్మెంట్ పరిధిలోని మల్కాజిగిరి, అల్వాల్, ఓల్డ్ బోయిన్పల్లి వంటి ప్రాంతాలు వేరే నియోజకవర్గాల్లోకి మారిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.శంకర్రావు చేతిలో 4,183 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, సాయన్న తన విలక్షణ నైజంతో కంటోన్మెంట్ ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులెవరూ తనకు అండగా నిలవకపోయినప్పటికీ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో ఆయన వ్యక్తిత్వం కీలకమైంది. 2018లో టీఆర్ఎస్ అభ్యరి్థగా భారీ మెజారిటీతో గెలిచి అయిదోసారి ఎమ్మెల్యే అయ్యారు. సాయన్నకు మంత్రి పదవి లభిస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. నిరాడంబరుడు.. వివాద రహితుడు.. మొదటిసారిగా 1986లో ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యరి్థగా పోటీ చేసిన సాయన్న ఓడిపోయారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. దోమలగూడ డివిజన్ అనంతరం కవాడిగూడ డివిజన్‌గా రూపాంతరం చెందింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి కవాడిగూడ కార్పొరేటర్‌గా సాయన్న కుమార్తె లాస్య నందిత గెలుపొందారు. అయిదు పర్యాయాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సాయన్న సౌమ్యుడు, నిరాడంబరుడు, వివాదరహితుడు మాత్రమే కాక స్నేహశీలి, హాస్యచతురుడు. అందరితో కలుపుగోలుగా ఉండే సాయన్న మంచి భోజన ప్రియుడు. వెరైటీ వంటకాలంటే ఇష్టం. సినిమాలు, వినోదకార్యక్రమాలపై ఆసక్తి. సినిమాల గురించి చర్చించేవారు. రాజకీయాల్లో ఉన్నా అజాత శత్రువుగా పేరుపొందారు. అన్నా అని వస్తే.. నేనున్నా అనేవారు.. అయిదు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన సాయన్న విలక్షణమైన వ్యక్తిత్వంతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన సాయన్న రాజకీయాల్లోనూ పక్కా లెక్కలతో ఉండేవారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నియోజకవర్గంలోని ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్నారు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండేవారు. నియోజకవర్గం పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో దాదాపు ప్రతిసారీ సాయన్న వ్యతిరేక పారీ్టల అభ్యర్థులే గెలిచే వారు. 1997 బోర్డు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఒక్కరు మాత్రమే గెలిచినప్పటికీ, 1999 ఎన్నికల్లో సాయన్న విజయం సాధించారు. తిరిగి 2004లో సాయన్న ఎమ్మెల్యేగా ఉండగానే 2006, 2008లోనూ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవలేదు. 2015లోనూ టీడీపీ అభ్యర్థులకు బోర్డులో ప్రాతినిధ్యమే దక్కలేదు. బోర్డు సభ్యులు తాము వేరే పారీ్టల్లో కొనసాగుతున్నప్పటికీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే సాయన్న గెలుపు కోసం పనిచేసే వారని తెలుస్తోంది. ప్రత్యర్థి పారీ్టల్లోని నేతలతోనూ సాయన్న సన్నిహితంగా ఉండే వారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్నా అంటూ తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహకారం అందించే వారు. ఇక మిలిటరీ అధికారుల పెత్తనం మితిమీరి ఉండే కంటోన్మెంట్లో కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలకు అండగా నిలిచేవారు. ప్రతి కాలనీ, బస్తీ పెద్దలతో నిత్యం టచ్‌లో ఉండేవారు. ఎన్నికల్లో ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీ ప్రతినిధులు పారీ్టలకు అతీతంగా సాయన్న గెలుపు కోసం పనిచేసే వారు. ఈ నేపథ్యంలోనే సాయన్న అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ముఠా గోపాల్‌తో ఎంతో అనుబంధం ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాయన్న చిరకాల మిత్రులు. ఇద్దరూ ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 1986 కార్పొరేటర్ ఎన్నికల్లో అప్పటి జవహర్‌నగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన ముఠా గోపాల్ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నంత కాలం ముఠాగోపాల్ ఆశించిన ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ మిత్రపక్షాలకు కేటాయించేవారు. దీంతో టీడీపీలో ఉన్నంతకాలం గోపాల్‌కు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్లో చేరాక 2018 ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ముషీరాబాద్ నియోజకవర్గంతో సాయన్న, గోపాల్‌కు ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ముఠాగోపాల్ మూడుసార్లు, సాయన్న ఒక పర్యాయం పనిచేశారు. సాయన్న హయాంలోనే ప్రస్తుత జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగింది. హుడా డైరెక్టర్‌గానూ ఆయన పని చేశారు. చదవండి: ఆ నిబంధన వర్తించదు.. కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక లేనట్టే! -
ఆ నిబంధన వర్తించదు.. కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: సాయన్న మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశాలు లేవు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవడమే దీనికి కారణం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151ఏ నిబంధన ప్రకారం.. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, చనిపోయిన/రాజీనామా చేసిన/అనర్హత వేటు పడిన సభ్యుడి పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఈ నిబంధన వర్తించదు. శాసనసభ గడువు వచ్చే డిసెంబర్ 11తో ముగియనుంది. అంటే మరో 10 నెలలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. చదవండి: హైదరాబాద్‌లో ఈస్ట్‌జోన్‌వైపే మధ్యతరగతి ప్రజల ఆసక్తి -
సాయన్న బౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
కంటోన్మెంట్ ను ghmcలో విలీనం చేసే అవకాశం ఉందా ?
-
మళ్లీ తెరపైకి ‘విలీనం’!
సాక్షి, హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేసి..సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారులకు రక్షణశాఖ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బోర్డు విలీనంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఇప్పటికే మనుగడలో ఉన్న కంటోన్మెంట్ల చట్టం–2006లోనూ పలు మార్పులు, చేర్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ముసాయిదా చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. ఈ చట్టంలో బోర్డుల రద్దుపై ముందుకెళ్లకుండా..కీలక సంస్కరణలు, సవరణలకే మొగ్గు చూపుతున్నట్లు రక్షణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చదవండి: అయ్యో.. ఐఫోన్ అందకపాయె..! రక్షణశాఖ ప్రతిపాదనలతో.. 2018 జులైలో దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్లలోని జనావాసాలను వేరుచేస్తూ ఎక్స్‌క్లూజివ్ మిలటరీ స్టేషన్లు మార్చాలంటూ ఆర్మీ ఉన్నతాధికారులు రక్షణ మంత్రిత్వ శాఖను కోరారు. కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం (వర్కింగ్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డ్స్) కోసం 2018 ఆగస్టు 31న విశ్రాంత ఐఏఎస్ అధికారి సుమిత్ బోస్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఇది భాగస్వామ్య పక్షాలనుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆపై రద్దు అంశం తెరపైకి రావడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైస్ 2019 ఫిబ్రవరిలో పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ బమ్రే స్పందిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను ఎక్స్‌క్లూజివ్ మిలటరీ స్టేషన్లుగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని ప్రకటించారు. నిపుణుల కమిటీ నివేదిక మేరకు చర్యలు ఉంటాయన్నారు. 2109 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో మే నెలలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యలోనే ఎక్స్పర్ట్ కమిటీ ‘కంటోన్మెంట్ల చట్టం–2006’లో భారీ మార్పులు చేస్తూ నివేదికను సమర్పించింది. తదనుగుణంగా కంటోన్మెంట్ ముసాయిదా చట్టం– 2020 రూపొందించారు. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, బిల్లులో కేవలం సవరణలు మాత్రమే ఉంటాయని, కంటోన్మెంట్ల రద్దు ప్రతిపాదనలు ఉండే అవకాశం లేదని డీజీడీఈ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. 1999లోనే ప్రయత్నించా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపాల్సిందిగా 1999లోనే అప్పటి సీఎం చంద్రబాబు ద్వారా కేంద్ర రక్షణ శాఖకు విన్నవించా. ఈ ప్రతిపాదనపై అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్‌ఫెర్నాండెజ్ సానుకూలంగా స్పందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ స్థానిక కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేయడంతో విలీన ప్రతిపాదన అటకెక్కింది. – సాయన్న ఎమ్మెల్యే -
కృష్ణా జిల్లాలో 519 కంటైన్మెంట్ జోన్లు: కలెక్టర్
సాక్షి, కృష్ణా: కొత్తగా కరోనా పొజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లాలో 6 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహమ్మారి పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు అవుతున్నందున విజయవాడ రూరల్‌లోని కొత్తూరు, తాడేపల్లి గ్రామాలు, నూజివీడు మండలంలో యనమదల గ్రామం మోపిదేవి మండలంలో బొబ్బర్లంక, మొవ్వ మండలంలో పెదముక్టేవి, అవురుపూడి గ్రామాలను, ఘంటసాల మండలంలో వి.రుద్రవరం ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 519 కంటైన్మెంట్ జోన్లో 2460 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కోరారు. 28 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాని 5 ప్రాంతాల్లో కంటైన్మేంట్ జోన్ల నిబంధనలను తొలగించామని చెప్పారు. అవి: జి.కొండూరు మండలంలో చెగిరెడ్డిపాడు గ్రామం, వీరుల్లపాడు మండలంలో చౌటపల్లి గ్రామం, మచిలీపట్నం మండలంలో నేలకుర్రు గ్రామం, పామర్రు మండలంలో జుజ్జవరం గ్రామం, కోడూరు మండలంలో లింగారెడ్డిపాలెం గ్రామంగా కలెక్టర్ పేర్కొన్నారు. -
కంటోన్మెంట్లో ఆంక్షలు ఎత్తేయండి
కంటోన్మెంట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్ల మూసివేత ఆంక్షల్ని ఎత్తివేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో పదే పదే రోడ్ల మూసివేత వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విధి విధానాలు పాటించకుండా స్థానిక మిలటరీ అధికారులు (ఎల్ఎంఏ) ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల మూసివేతకు సంబంధించి 2018లో కేంద్ర రక్షణ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సైతం మిలటరీ అధికారులు పాటించడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్లో ఏవేని రోడ్లు మూసివేయాలంటే స్థానిక పత్రికల్లో ప్రకటన ఇచ్చి, కంటోన్మెంట్ వెబ్సైట్లో వివరాలు వెల్లడిస్తూ, అక్కడి ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాతే మూసివేయాల్సి ఉందన్నారు. ఇవే మీ పాటించకుండానే జూలైలో పది రోజుల పాటు పలు రోడ్ల ను మూసేశారని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనల సాకుతో రోడ్లు మూసివేయ డం తగదన్నారు. స్థానిక మిలటరీ అధికారుల చర్యల వల్ల రాజధానికి ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని సుమారు 10 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్కెట్లకూ వెళ్లనివ్వరా? కంటోన్మెంట్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న రిసాల బజార్, బొల్లారం బజార్, లాల్‌బజార్ వంటి మార్కెట్ ప్రాంతాలకు తమ వస్తువులను తీసుకెళ్లేందుకు ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఈ రోడ్లను వినియోగించే వారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటితో పాటు రాజీవ్ రహదారిని కలిపే పలు రోడ్లను సైతం మూసేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఏఓసీ రోడ్లు సహా మిలటరీ అధికారులు మూసేసిన పలు రోడ్లు 100 ఏళ్లకు పైగా స్థానిక ప్రజలు వినియోగిస్తున్నవేనని గుర్తుచేశారు. కంటోన్మెంట్ చట్టంలో ‘వీధులు’గా పేర్కొన్న రోడ్లను మూసి వేయాలంటే సెక్షన్ 258 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
‘కంటోన్మెంట్’ ఖరారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కీలకమైన ఓటరు లిస్టు తుదిజాబితాను గత వారమే విడుదల చేశారు. అక్టోబర్ మొదటి వారంలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ తొలి పక్షంలో నోటిషికేషన్ వెలువడే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. 2015 జనవరి 11 ఎన్నికలు జరగ్గా, ఫిబ్రవరిలో కొత్త బోర్డు కొలువు తీరింది. ఈ ప్రకారం 2020 ఫిబ్రవరిలోపు బోర్డు ఎన్నికల ప్రక్రియ ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల తీరుపై ప్రత్యేక కథనం.. సాక్షి, కంటోన్మెంట్: ప్రత్యేక ఓటరు జాబితా సాధారణంగా దేశ వ్యాప్తంగా ఏ ఎన్నికలైనా ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటరు లిస్టే ప్రామాణికం. చట్ట సభలైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల్లోనూ ఇదే లిస్టు ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే కంటోన్మెంట్లలో మాత్రం ప్రత్యేక ఓటరు లిస్టు ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించిన ‘ది కంటోన్మెంట్స్ యాక్ట్–2006’కు లోబడి రూపొందించిన ‘కంటోన్మెంట్ ఎలక్టోరల్ రోల్స్–2007’ ఆధారంగా ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కంటోన్మెంట్ ఓటర్లలో చాలామందికి వివిధ కారణల వల్ల బోర్డు ఎన్నికల జాబితాలో అవకాశం కల్పించలేదు. రిజర్వేషన్లు ఇలా.. కేటగిరి–ఏకు చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులున్నాయి. 2006 వరకు ఏడు వార్డులే ఉండగా, 2006లో కొత్త చట్టం అమల్లోకి రావడంతో తొలిసారిగా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు మూడు వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఒక వార్డు ఎస్సీ– జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక మిగిలిన నాలుగు జనరల్ వార్డులున్నాయి. అయితే ఎస్సీ రిజర్వ్డ్ వార్డు మినహా మిగిలిన ఏడు వార్డుల్లో మహిళా రిజర్వేషన్లను రోటేషన్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. 2008లో 1, 5, 6 వార్డుల నుంచి మహిళలు ప్రాతినిధ్యం వహించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఈ మూడు వార్డులను జనరల్ కేటగిరీకి మార్చగా, మిగిలిన నాలుగు జనరల్ స్థానాల్లో డ్రా పద్ధతిలో 3, 4, 7 వార్డులు మహిళా రిజర్వ్ అయ్యాయి. 2వ వార్డు గత రెండు పర్యాయాల నుంచి జనరల్ కేటగిరీలో ఉండగా, 8వ వార్డు ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. తాజా పరిస్థితి.. ప్రస్తుత బోర్డులో 3,4, 7 వార్డులు మహిళలకు కేటాయించగా, ఆయా వార్డుల నుంచి అనిత ప్రభాకర్, నళిని కిరణ్, పి. భాగ్యశ్రీ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ స్థానాలు జనరల్ కేటగిరీలోకి మారనున్నాయి. మిగిలిన 1, 2, 5, 6 వార్డుల్లో డ్రా పద్ధతిలో మూడింటిని మహిళలకు కేటాయించనున్నారు. ఆయా వార్డుల నుంచి జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాద కేశవరెడ్డి, రామకృష్ణ, పాండుయాదవ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ తమ స్థానాలు మహిళలకు కేటాయిస్తే, తమ కుటుంబ సభ్యులను నిలబెట్టేందుకు ఆయా నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక లోకనాథం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డు మళ్లీ ఎస్సీ–రిజర్వ్డ్గా ఉండనుంది. 2011 జనాభా లెక్కలు ప్రామాణికంగా ఎస్సీ స్థానాన్ని ఎంపిక చేస్తున్నందున ఈ సారి కూడా 8వ వార్డు ఎస్సీ కేటగిరీలోనే ఉండటం ఖాయం. ఇప్పటి దాకా ఏడుగురు ప్రాతినిధ్యం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో మహిళా బోర్డు సభ్యుల ప్రాతినిథ్యం పెరిగింది. 2008ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి జంపన విద్యావతి, ఐదో వార్డు నుంచి జే. అనూరాధ, ఆరోవార్డు నుంచి భానుక నర్మద బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. 2015లో ఆయా స్థానాలు జనరల్‌గా మారగా, వీరు పోటీ నుంచి తప్పుకుని కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అనిత ప్రభాకర్, నళినికిరణ్, పి.భాగ్యశ్రీ బోర్డు సభ్యులు ఎన్నికయ్యారు. అయితే ఎలాంటి మహిళా రిజర్వేషన్లు అమల్లో లేని 2006లోనూ ఏ. మంజుల రెడ్డి బోర్డు సభ్యురాలిగా ఎన్నికై, తొలి మహిళా బోర్డు సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. ఆమె కంటోన్మెంట్ బోర్డు మాజీ సానిటరీ ఇన్స్పెక్టర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి. ఇదిలా ఉండగా మిగిలిన ఆరుగురు మహిళా బోర్డు సభ్యుల్లో భానుక నర్మద మినహా మిగిలిన వారంతా, మాజీ బోర్డు సభ్యుల వారసులిగానే బోర్డులో అడుపెట్టారు. -
అల్లుడొచ్చాడు!
కంటోన్మెంట్: సికింద్రాబాద్–కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు ఎట్టకేలకు ఇంటిపోరు తప్పింది. ఎన్నికల వేళ టికెట్ ఆశించి భంగపడిన సొంత అల్లుడు, పీసీసీ అధికార ప్రతినిధి క్రిషాంక్ మామపైనే పోటీకి సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు సమయంలో, ప్రచారానికి క్రిషాంక్ దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో సహజంగానే సర్వే సత్యనారాయణకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే ఆదివారం నాటి ఎన్నికల ప్రచారంలో క్రిషాంక్ పాల్గొనడం సర్వే వర్గీయుల్లో ఆనందం నింపింది. ఇక మరో అసమ్మతి నేత శ్రీగణేశ్ బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. దీంతో సర్వే సత్యనారాయణకు నియోజకవర్గంలో అసమ్మతి లేకుండా పోయింది. -
‘కేసీఆర్‌కు జబ్బు చేసినట్టుంది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల పైన దుర్మార్గంగా మాటల దాడి చేస్తున్న కేసీఆర్‌కు ఏదో మానసిక జబ్బు సోకిందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా బూతు పురాణం మాట్లాడడని అన్నారు. అహంకారంతో కళ్లుమూసుకుపోయిన కేసీఆర్ భారత రత్న నెహ్రు పైన కూడా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారని పేర్కొంటూ కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల విలీన సమయంలో.. ఒకవేళ ప్రజలకు పొసగక పోతే ఆంధ్రప్రదేశ్ విడిపోవచ్చని నెహ్రూ చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఎందుకు మరచిపోయాడని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చక, ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో నాడు యువజన నాయకుడిగా ఎందుకు కొనసాగాడని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ఎలా పెంచాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని గతంలో పేర్కొన్న కేసీఆర్.. ఇప్పుడు ‘తూ’ అంటున్నాడని విమర్శించారు. ‘నోటీ దూల ఉంటే మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నాయకులపై బూతు పురాణం మొదలు పెట్టు.. మా పార్టీ నాయకులపై నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదు’ అని శ్రవణ్ హెచ్చరించారు. వైఎస్సార్ సేవలు కనిపించడం లేదా.. రాష్ట్ర బడ్జెట్ 60వేల కోట్ల రూపాయలుగా ఉన్న రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని టీపీసీసీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ రోజు 2లక్షల రూపాయల రాష్ట్ర బడ్జెట్‌తో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఏ ఏపాటిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 108,104, ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చినందుకా.. రింగ్ రోడ్డు వేయించినందుకా.. అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చినందుకా.. ట్రిపుల్ ఐటీ, ఆరోగ్యశ్రీ, లక్షల ఎకరాలకు నీళ్లు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకా .. ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నావని కేసీఆర్‌ను దుయ్యబట్టారు. ‘ఓటర్ల నమోదులో జరిగిన అవకతవకలు కోసం ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. దొంగ ఓట్లను ఇంతవరకు సరిదిద్దలేదు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ఇద్దరు కూతుర్లలో ఒకరి ఓటు కంటోన్మెంట్లో.. మరొకరి ఓటు ముషీరాబాద్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా పరిస్థితికి ఇదే తార్కాణం’అని ఎద్దేవా చేశారు. -
‘హీరో ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్’
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): రోల్కాల్పై ఉన్నతాధికారులు చేసిన సూచనలను తిరుమలగిరి పోలీసులు పక్కాగా పాటించినందునే సీరియల్ రేపిస్టు బ్రిజేష్ కుమార్ యాదవ్ చిక్కాడు. 2012 డిసెంబర్లో ఓ మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న అతను సోమవారం మరో యువతిపై అఘాయిత్యానికి యత్నించి పట్టుబడ్డాడు. బుధవారం ఇతడి అరెస్టును ప్రకటించిన నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ ‘హీరో ఆఫ్ సిటీ పోలీస్’ అని కితాబిచ్చారు. సిబ్బందికి ఆయన ప్రత్యేక రివార్డులు ప్రకటించారు. తిరుమలగిరి ఠాణా పరిధిలోని అమ్ముగూడ రైల్వేట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గతేడాది డిసెంబర్ 21న ఓ గుర్తుతెలియని వ్యక్తి ఓ యువకుడిపై దాడి చేయడంతో పాటు మాజీ సైనికాధికారి కుమార్తెపై (మైనర్) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసును కొలిక్కితేవడానికి తిరుమలగిరి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. బాధితురాలి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నార్త్‌జోన్ డీసీపీ సుమతి, బేగంపేట ఏసీపీ రంగారావు నిందితుడిని పట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ముగూడ రైల్వేట్రాక్ సమీపంలో రాత్రి వేళల్లో గస్తీ పెంచాలనిఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ప్రతి రోజూ రోల్‌కాల్ సమయంలో సిబ్బందికి స్పష్టం చేస్తూనే ఉన్నారు. సోమవారం తిరుమలగిరి ఠాణా రక్షక్ గస్తీ విధుల్లో కానిస్టేబుల్ చంద్రశేఖర్ (పీసీ 4691) ఉండగా ఆ వాహనానికి ఆర్మీ మాజీ అధికారి, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ హరిరామ్ శర్మ డ్రైవర్‌గా వ్యవహరించారు. రాత్రి 8.30 గంటల ప్రాతంలో ఆమ్ముగూడ రైల్వేట్రాక్ ఖో–ఇ–ఇమామ్ దర్గా సమీపంలో వాహనం దిగి నడుస్తున్న చంద్రశేఖర్ దూరంగా ముగ్గురు వ్యక్తుల మధ్య పెనుగులాట జరుగుతున్నట్లు గుర్తించాడు. సమీపంలో ఉన్న బ్లూకోల్ట్స్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ బ్రిజేష్‌ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. తీవ్ర పెనుగులాట అనంతరం సీరియల్ రేపిస్ట్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నడిపించి వీడియో తీసి... బ్రిజేష్‌ను తిరుమలగిరి ఠాణాకు తీసుకువచ్చి ప్రశ్నించగా గతేడాది ఘటనతో తనకు సంబంధం లేదని వాదించాడు. అయితే అనేక సారూప్యతలు ఉన్న నేపథ్యంలో అప్పటి బాధితురాలి నుంచి సేకరించిన డీఎన్ఏతో ఇతడి డీఎన్ఏ మ్యాచ్ చేసే ప్రయత్నాలు చేశారు. అప్పుడు చీకట్లో బాధితురాలు బ్రిజేష్ ముఖం చూపకపోయినా అతడి కదలికలు, నడక గమనించినట్లు పోలీసులకు చెప్పింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న డీసీపీ ఆమెను రప్పించాలని భావించారు. అయితే ఆ కుటుంబం కొన్నాళ్ల క్రితమే ఒడిశా వెళ్లిపోయినట్లు తెలియడంతో అతికష్టమ్మీద బాధితురాలి తండ్రి సెల్‌ఫోన్ నెంబర్ సేకరించారు. బ్రిజేష్‌ను మసక వెలుతురులో నడిపిస్తూ ముందు వైపు, వెనుక వైపు నుంచి వీడియోలు తీయించి వాట్సాప్‌లో ఆమె తండ్రికి పంపారు. వాటిని చూసిన బాధితురాలు నాడు తనపై అఘాయిత్యం చేసిన బ్రిజేషేనంటూ గుర్తించింది. ఇదే విషయాన్ని డీఎన్ఏ రిపోర్టు సైతం నిర్ధారించింది. దాడి చేసి తప్పించుకోజూశాడు ఆ ప్రాంతంలో ముగ్గురు కనిపించడంతో పాటు మహిళ అరుపులు, ఏడుపులు వినిపించడంతో అక్కడకు వెళ్ళా. అప్పటికే బ్రిజేష్ ఓ యువకుడిపై దాడి చేయడంతో పాటు యువతిని సమీపంలోని పొదల్లో లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించగా నా పై దాడి చేసి పారిపోయే ప్రయత్నంలో 20 అడుగుల గోతిలోకి దూకేశాడు. వెనుకే నేనూ దూకి ఒడిసిపట్టుకున్నా. హరిరామ్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ నరేంద్ర సాయంతో అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించాం. – చంద్రశేఖర్, కానిస్టేబుల్ -
కంటోన్మెంట్‌కు 5 ప్రతిపాదనలు: సీఎస్ ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: ఏవోసీ కంటోన్మెంట్ ఏరియా గఫ్ రోడ్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మించేందుకు 5 ప్రతిపాదనలు రూపొందించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. శనివారం సచివాలయంలో గఫ్ రోడ్, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, మిలటరీ భూ సమస్యలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతిపాదిత రోడ్లకు అయ్యే వ్యయం, భూసేకరణ అంశాలపై చర్చించారు. మిలటరీ సెక్యూరిటీకి సంబంధించి లెన్సింగ్, మెడికల్, వాచ్ టవర్స్ శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సీఎస్ నివేదిక కోరారు. సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓ ఎస్వి.ఆర్ చంద్రశేఖర్, బ్రిగేడియర్ యం.డి ఉపాధ్యాయ్, బ్రిగేడియర్ ప్రమోద్‌కుమార్ శర్మలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
కొత్త సచివాలయం కట్టి తీరుతం
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లేది లేదని, సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని చెప్పారు. దానికి పునాదిరాయిని ప్రధానితోనే వేయించి, తెలంగాణకు చారిత్రక కట్టడంగా అందించి తీరుతామన్నారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త సచివాలయం అంశంపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఇప్పుడున్న రాష్ట్ర సచివాలయం దేశంలోనే చెత్త సచివాలయమని, గత ప్రభుత్వాలు సరైన ఆలోచనతో కట్టలేదని వ్యాఖ్యానించారు. బైసన్‌పోలో గ్రౌండ్స్‌లోని 151 ఎకరాల స్థలంలో కొత్త సచివాలయంతో పాటు అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ అధిపతుల కార్యాలయాలు, తెలంగాణ కళాభారతిని నిర్మిస్తామని.. రూ.500 కోట్లలో వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. కొత్త సచివాలయం అవసరమా? కొత్త సచివాలయం అంశంపై బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై తొలుత మంత్రి తుమ్మల సమాధానమిచ్చారు. ప్రస్తుత సచివాలయ భవనాలు పాతవని, హరిత, అగ్నిమాపక ప్రమాణాలు లేకుండా ఉన్నాయని చెప్పారు. కొత్త సచివాలయ ప్రణాళికలన్నీ ఖరారైన తర్వాత అంచనా సమయాన్ని, వ్యయాన్ని నిర్ణయిస్తామన్నారు. దీంతో బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు కొత్త సచివాలయం ఎందుకు? ఉన్న సచివాలయంలోనే మార్పులు చేసి ఆధునీకరించవచ్చు కదా? అయినా బైసన్‌పోలో గ్రౌండ్ ఇచ్చేందుకు కేంద్రం పెట్టిన షరతులను ఎలా ఒప్పిస్తారు? ఇదేమీ ప్రాధాన్యతాంశం కాదు కదా?’’అని ప్రశ్నించారు. వాస్తు ప్రకారం చూస్తే ఇప్పుడున్న సచివాలయంలోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ మరో సభ్యుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయ్యారని, కాంగ్రెస్ ఓడిపోయిందని.. అన్నింటికీ అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని సూచించారు. దీంతో సీఎం కేసీఆర్ కల్పించుకుని బీజేపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కంటోన్మెంట్‌కు ఓ చరిత్ర ఉంది దేశంలోని 54 కంటోన్మెంట్లలో బొల్లారం కంటోన్మెంట్‌కు ఓ చరిత్ర ఉందని కేసీఆర్ చెప్పారు. ‘‘గతంలో లంగర్‌హౌజ్ కంటోన్మెంట్‌గా ఉండేది. అయితే బ్రిటిష్ వాళ్లు నిజాం రాజ్యంపై దండెత్తే పరిస్థితి ఉన్నప్పుడు అప్పటి నిజాం రాజు వారితో చర్చలు జరిపిండు. చర్చల్లో భాగంగా నిజాం రాజ్యంలో తమ కమిషనర్ ఉంటాడని, అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తాడని బ్రిటిష్ వాళ్లు చెప్పారు. అప్పుడు లంగర్‌హౌజ్‌లో ఉన్న కంటోన్మెంట్‌ను బొల్లారానికి మార్చారు. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగినప్పుడు కంటోన్మెంట్ భూహక్కుల బదలాయింపు జరగలేదు. ఇప్పుడది రక్షణ శాఖ పరిధిలో ఉందని గౌరవిస్తున్నం. నేను ఈ విషయాన్ని ప్రధానికి, కేంద్ర మంత్రులకు చెప్పిన. కేంద్రం ఎక్కువ తమాషా చేస్తే కోర్టుకెళతాం. సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటాం..’’అని స్పష్టం చేశారు. ఇంత చెత్తగా ఎక్కడా లేదు దేశంలోని 29 రాష్ట్రాల్లో ఇంతకన్నా చెత్త సచివాలయం ఇంకోటి లేదని, ఏ ఒక్క భవనం కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ‘సాక్షాత్తు సీఎం ఉండే సీబ్లాక్ ఘోరంగా ఉంది. సీఎం, సీఎస్ చాంబర్లు, కేబినెట్ రూం, వీడియో కాన్ఫరెన్స్ రూం అన్నీ ఒక్క భవనంలోనే ఉన్నాయి. ఎక్కడా ఫైరింజన్ నడిపే పరిస్థితి ఉండదు. గత ప్రభుత్వాలు మైండ్ ఓపెన్ చేసి పని చేయలేదు. మన సచివాలయానికి వచ్చిన ఇతర దేశాల వాళ్లు కొత్త సెక్రటేరియట్ కట్టుకోవచ్చు కదా అని మొహం మీదే అన్నారు. సచివాలయాలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకలు. కర్ణాటక, తమిళనాడుల్లో ఇదే తరహాలో సచివాలయాలు ఉంటాయి. అయినా కొత్త సచివాలయం కట్టంగనే ఏదో అయిపోతదని అంటున్నరు. సెక్రటేరియట్ కట్టంగనే హైదరాబాద్ ఆగమైపోతదా? హైదరాబాద్‌లో అసలు భవనాల నిర్మాణమే జరగడం లేదా? సచివాలయంతోపాటు అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాలు ఒక్కచోట కట్టాలన్నదే మా అభిప్రాయం’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో క్రీడాస్థలాలు లేనట్టు, ఉన్నవాటిని తాము చెడగొడుతున్నట్లు మాట్లాడుతున్నారని విపక్షాల తీరును తప్పుబట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో దత్తాత్రేయ కుమార్తె పెళ్లి చేశారని వ్యాఖ్యానించారు. బైసన్‌పోలో గ్రౌండ్ క్రీడా మైదానమే కాదని గుర్తు చేశారు. కొత్త సచివాలయం కోసం చాలా స్థలాలు పరిశీలించి, బైసన్‌పోలో గ్రౌండ్‌ను ఖరారు చేశామని చెప్పారు. అన్నీ ఒక్క చోటే నిర్మిస్తాం.. ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని ఎప్పుడో నిజాం కట్టించాడని, చెన్నారెడ్డి హయాంలో మార్పులు చేసి కొత్తది కట్టారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘మీరు, నేను వెళ్లే పోర్టికోలు చూశారా స్పీకర్ గారూ? నా బండి వచ్చే వరకు మీ బండి ఎండలో ఉండాలి. ఇది గొప్పగా కనపడుతోందా వాళ్లకు (విపక్షాలకు). దేశంలోని 6 మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇది అంతర్జాతీయ నగరం. మనకు కనీసం కల్చరల్ సెంటర్ ఉందా? ఎప్పడిదో రవీంద్రభారతి. హైదరాబాద్‌లో చలన చిత్రోత్సవాలు ఎలా జరుగుతాయో చూశాం. ఒక మ్యూజిక్ కన్సర్ట్ ఉందా? ఇవన్నీ 6 లక్షల చదరపు గజాల్లో కట్టినా.. చదరపు గజానికి రూ.3వేల చొప్పున వేసుకుంటే రూ.180 కోట్లు. అదే రూ.4వేల చొప్పున వేసినా రూ.240 కోట్లు అవుతాయి. ఈ మాత్రం పెట్టలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నామా? వృథా ఖర్చు అంటున్నరు’ అని మండిపడ్డా రు. రక్షణ శాఖ నుంచి తీసుకునే 151 ఎకరాల్లోనే రాజీవ్ రహదారి విస్తరణ, ఎక్స్‌ప్రెస్‌వే, స్కైవేలు వస్తాయన్నారు. కొత్త సచివాలయం ఏర్పాటైన తర్వాత పాత భవనా లను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటామన్నారు. సచివాలయం మార్పు తన ఆలోచన మాత్రమే కాదని, గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రయత్నం చేశారన్నారు. చారిత్రక కట్టడాన్ని ప్రజలకు అందించి తీరుతామని తేల్చి చెప్పారు. ఇది మంచిదా కాదా అన్నది ప్రజా కోర్టు నిర్ణయిస్తుందన్నారు. సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు కొత్త సచివాలయ అంశంపై సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. బైసన్‌పోలో గ్రౌండ్ నుంచి క్రీడా కార్యకలాపాలను తప్పించాలంటే ప్రధాని కార్యాలయ అనుమతి కావాలని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు. అసలు బైసన్ పోలో క్రీడా మైదానమే కాదంటున్నారని.. ప్రస్తుతమున్న మైదానాలను వినియోగించుకోకపోవడం ఎవరి నిర్వాకమని నిలదీశారు. ప్రజల మనోభావాలు గుర్తించి, గౌరవించి ముందుకెళ్లాలని సూచించారు. దీంతో లక్ష్మణ్‌పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘అయినా మీరు చెప్పింది చేయడానికి మేమిక్కడ లేము. మాకు మా ఆలోచన ఉంది. మా ప్రతిపాదన విరమించుకునే ప్రసక్తే లేదు. అందరినీ సంతృప్తిపర్చి సచివాలయం కట్టి తీరుతం..’’అని పేర్కొన్నారు. -
ఆ రోడ్లను మూసివేయొద్దు..
కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి జైట్లీని కోరిన టీఆర్ఎస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను డిఫెన్స్ సిబ్బంది మరోమారు మూసివేయడాన్ని టీఆర్ఎస్ ఎంపీలు రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకొచ్చారు. గురువారం ఈ మేరకు జైట్లీని ఆయన కార్యాలయంలో ఎంపీలు జితేందర్ రెడ్డి, బి.వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ కలుసుకున్నారు. 35 వేల మంది జనాభా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతంలో డిఫెన్స్ సిబ్బంది అకస్మాత్తుగా రోడ్లను మూసివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే వరకు రహదారులను మూసివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరా రు. దీనిపై జైట్లీ సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం జితేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. జేబీఎస్– కరీంనగర్ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన 100 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఎయిమ్స్‌కు నిధుల్విండి: తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను జితేందర్ రెడ్డి, వినోద్ కోరారు. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు పేరు మార్చండి.. తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరును తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మార్చాలని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌ను ఎంపీ వినోద్ కోరారు. గంగ్వార్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్న వినోద్.. రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ మొత్తానికి ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. -
పేకాట శిబిరాలపై పోలీసుల దాడి
హైదరాబాద్: నగర శివార్లలోని పేకాట శిబిరాలపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ నాయకుడు జయప్రకాష్తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరు మార్పు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరు మారింది. ఆంధ్రా సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్‌ను ‘తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా’ గా పిలవనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉత్తర్వులు అందాయి. తక్షణమే ఈ మార్పు అమల్లోకి వస్తుందని స్థానిక మిలటరీ పీఆర్ఓ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రా తమిళనాడు, కర్ణాటక- కేరళ (ఏటీఎన్కె అండ్ కే)గా వ్యవహరించే ఆర్మీ దక్షిణాది కేంద్రాన్ని ఇకపై ‘హెడ్‌క్వార్టర్స్ ఆఫ్ దక్షిణ్ భారత్ ఏరియా’గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. -
కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం
-
తెలంగాణ అభ్యర్థులను మార్చిన ఏఐసిసి
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంతకు ముందు ప్రకటించిన శాసనసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను ఏఐసిసి మార్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, తుంగతుర్తి, నర్సంపేట స్థానాలకు అభ్యర్థులను మార్చినట్లు ఏఐసీసీ ప్రకటించింది. తుంగతుర్తిని అద్దంకి దయాకర్‌కు, నర్సంపేటను కత్తి వెంకటస్వామికి, కంటోన్మెంట్ గజ్జెల కాంతంకు కేటాయించారు. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలో కంటోన్మెంట్ (ఎస్సీ)ను క్రిషాంక్‌కు, నర్సంపేటను డి.మాధవరెడ్డికి, తుంగతుర్తి(ఎస్సీ) ని గుడిపాటి నర్సయ్యకు కేటాయించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు స్వయంగా కలుగజేసుకొని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ జేఏసీ నేతలు కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సినీ దర్శకుడు శంకర్, గజ్జెల కాంతం తదితరులు ఈ ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. జేఏసీ నేతలకు పోటీ చేసే అవకాశం కల్పించేందుకు అవకాశం కల్పిస్తామని సోనియా వారికి హామీ ఇచ్చారు. ఆ మేరకు జాబితాలో మార్పులు చేశారు. రాజేందర్ రెడ్డి, శంకర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కంటోన్మెంట్ నుంచి గజ్జెల కాంతం
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో జేఏసీ నేతలకు చోటు దక్కింది. ఈమేరకు అభ్యర్థుల జాబితాలో మార్పులకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అంతకు ముందు తెలంగాణ జేఏసీ నేతలు కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సినీ దర్శకుడు శంకర్, గజ్జెల కాంతం తదితరులు మంగళవారం సోనియాగాంధీని కలిశారు. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంటు - గజ్జెల కాంతం, తుంగతుర్తి- అద్దంకి దయాకర్, నర్సంపేట- కత్తి వెంకటస్వామి పేర్లు ఖరారు కాగా, రాజేందర్ రెడ్డి, శంకర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక గెలుపే ప్రధానంగా గెలుపే ప్రధానంగా, సామాజిక కోణం ఆధారంగా తెలంగాణలో అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ జేఏసీని కాంగ్రెస్ పార్టీ విస్మరించలేదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులతో గన్ పార్క్ వద్ద పొన్నాల ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ...బంగారు తెలంగాణ సాధించుకుందామని ప్రతిన బూనారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టికెట్ రాని నేతలు అసంతృప్తితో ఉన్నారని... వారితో చర్చలు జరిపి అసంతృప్తిని తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుంది కాబట్టి వారికి పదవులు ఇచ్చి అసంతృప్తి తొలగిస్తామన్నారు. కోదాడ అసెంబ్లీ సీటుపై ఇంకా స్పష్టత లేదని, ఆ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత తనదని తెలిపారు.