సాక్షి, హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేసి..సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసే అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారులకు రక్షణశాఖ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బోర్డు విలీనంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో అజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఇప్పటికే మనుగడలో ఉన్న కంటోన్మెంట్ల చట్టం–2006లోనూ పలు మార్పులు, చేర్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ముసాయిదా చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోంది. ఈ చట్టంలో బోర్డుల రద్దుపై ముందుకెళ్లకుండా..కీలక సంస్కరణలు, సవరణలకే మొగ్గు చూపుతున్నట్లు రక్షణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చదవండి: అయ్యో.. ఐఫోన్ అందకపాయె..!
రక్షణశాఖ ప్రతిపాదనలతో..
- 2018 జులైలో దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్లలోని జనావాసాలను వేరుచేస్తూ ఎక్స్‌క్లూజివ్ మిలటరీ స్టేషన్లు మార్చాలంటూ ఆర్మీ ఉన్నతాధికారులు రక్షణ మంత్రిత్వ శాఖను కోరారు.
- కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం (వర్కింగ్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డ్స్) కోసం 2018 ఆగస్టు 31న విశ్రాంత ఐఏఎస్ అధికారి సుమిత్ బోస్ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఇది భాగస్వామ్య పక్షాలనుంచి అభిప్రాయాలు సేకరించింది.
- ఆపై రద్దు అంశం తెరపైకి రావడంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైస్ 2019 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు.
- దీనికి అప్పటి రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ బమ్రే స్పందిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను ఎక్స్‌క్లూజివ్ మిలటరీ స్టేషన్‌లుగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని ప్రకటించారు. నిపుణుల కమిటీ నివేదిక మేరకు చర్యలు ఉంటాయన్నారు.
- 2109 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో మే నెలలో నూతన ప్రభుత్వం ఏర్పడింది.
- ఈ మధ్యలోనే ఎక్స్‌పర్ట్ కమిటీ ‘కంటోన్మెంట్ల చట్టం–2006’లో భారీ మార్పులు చేస్తూ నివేదికను సమర్పించింది. తదనుగుణంగా కంటోన్మెంట్ ముసాయిదా చట్టం– 2020 రూపొందించారు.
- ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, బిల్లులో కేవలం సవరణలు మాత్రమే ఉంటాయని, కంటోన్మెంట్ల రద్దు ప్రతిపాదనలు ఉండే అవకాశం లేదని డీజీడీఈ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
1999లోనే ప్రయత్నించా
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాల్సిందిగా 1999లోనే అప్పటి సీఎం చంద్రబాబు ద్వారా కేంద్ర రక్షణ శాఖకు విన్నవించా. ఈ ప్రతిపాదనపై అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్‌ఫెర్నాండెజ్ సానుకూలంగా స్పందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ స్థానిక కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేయడంతో విలీన ప్రతిపాదన అటకెక్కింది.
– సాయన్న ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment