తెలంగాణలో ఇంతకు ముందు ప్రకటించిన శాసనసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను ఏఐసిసి మార్చింది.
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంతకు ముందు ప్రకటించిన శాసనసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను ఏఐసిసి మార్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, తుంగతుర్తి, నర్సంపేట స్థానాలకు అభ్యర్థులను మార్చినట్లు ఏఐసీసీ ప్రకటించింది. తుంగతుర్తిని అద్దంకి దయాకర్కు, నర్సంపేటను కత్తి వెంకటస్వామికి, కంటోన్మెంట్ గజ్జెల కాంతంకు కేటాయించారు. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలో కంటోన్మెంట్ (ఎస్సీ)ను క్రిషాంక్కు, నర్సంపేటను డి.మాధవరెడ్డికి, తుంగతుర్తి(ఎస్సీ) ని గుడిపాటి నర్సయ్యకు కేటాయించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు స్వయంగా కలుగజేసుకొని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ జేఏసీ నేతలు కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సినీ దర్శకుడు శంకర్, గజ్జెల కాంతం తదితరులు ఈ ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. జేఏసీ నేతలకు పోటీ చేసే అవకాశం కల్పించేందుకు అవకాశం కల్పిస్తామని సోనియా వారికి హామీ ఇచ్చారు. ఆ మేరకు జాబితాలో మార్పులు చేశారు. రాజేందర్ రెడ్డి, శంకర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.