tungaturti
-
మరో పెళ్లికి అడ్డువస్తున్నాడని.. హత్య చేశాడు
సాక్షి, తుంగతుర్తి : అనుమాన్పాద స్థితిలో మృతిచెందిన నాలుగేళ్ల బాలుడిది హత్యేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యపై కోపం, వివాహానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. శనివారం నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి సీఐ క్యాస్ట్రో కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడేనికి చెందిన చింతల కనకయ్యకు ఇప్పటికే రెండు సార్లు వివాహం జరిగింది. మూడో వివాహం చేసుకోవడానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడన్న కారణంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామానికి చెందిన ఓ యువతితో కనకయ్యకు మొదట వివాహం జరిగింది. కుటుంబ గొడవల కారణంగా వివాహం జరిగిన ఆరు నెలలకే కనకయ్యతో విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కనకయ్య హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో ఉంటూ రోజువారి కూలిపనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో జనగాంకు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కనకయ్య–స్వప్న దంపతులకు కుమార్తె, కుమారుడు అక్షయ్(4) ఉన్నారు. కొంతకాలంగా వీరు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు అధికం కావడంతో కొన్ని రోజులుగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు. నెలన్నర క్రితం కనకయ్య బిడ్డను తల్లి దగ్గరే ఉంచి కొడుకు అక్షయ్‌ను తీసుకొని తిరుమలరాయినిగూడెంలో ఉంటున్న పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం అనంతరం కనకయ్య అక్షయ్‌ను తనవద్దనే పడుకోబెట్టుకున్నాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో కన్నకొడుకు అక్షయ్‌ను మెడలు విరిచి హత్య చేశాడు. అనంతరం ఇంటిముందు మంచంలో కొడుకు మృతదేహాన్ని ఉంచి గుట్టు చప్పుడు కాకుండా పరారయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన చింతల రాములు కుటుంబీకులు మంచంలో నిర్జీవంగా పడి ఉన్న అక్షయ్‌ను దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చింది ఉండడంతో పోలీసులకు సమాచారమందించారు. భార్య దూరం కావడంతో మరో పెళ్లికి యత్నిస్తూ... ఆదినుంచి గొడవలు పడుతూ సైకో మనస్తత్వం కలిగిన కనకయ్యకు మొదటి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోవడం, రెండవ భార్య ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత కుటుంబ గొడవలతో దూరంగా ఉండటంతో మూడవ పెళ్లి చేసుకునేందుకు కనకయ్య సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో మూడవ పెళ్లి చేసుకునేందుకు కుమారుడు అక్షయ్ తండ్రి వద్దనే ఉండటంతో పెళ్లికి అడ్డుగా మారాడు. దీంతో అక్షయ్ ఉంటే తనకు మరో పెళ్లి కాదని భావించిన కనకయ్య, పథకం ప్రకారమే అర్ధరాత్రి సమయంలో అక్షయ్ మెడలు విరిచి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు సీఐ తెలిపారు. కన్నకొడుకును హత్య చేసి పారిపోతున్న కనకయ్యను స్థానికుల సమాచారంతో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కనకయ్యపై ఐపీసీ–302 సెక్షన్ కింద హత్యానేరం కేసును నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని నకిరేకల్‌లోని జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా ఇంచార్జి మెజిస్ట్రేట్ కె.రాణి ఆదేశానుసారం కనకయ్యను రిమాండు నిమిత్తం నల్లగొండ జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
టీజేఏసీకి ఎన్నికల తలనొప్పి
* ఎవరికి మద్దతివ్వాలనే అంశంలో ఎటూ తేల్చుకోలేని వైనం * పలు స్థానాల్లో జేఏసీ నేతల మధ్యే పరస్పరం పోటీ * ఎవరినీ కాదనకుండా.. మౌనం పాటిస్తున్న ముఖ్య నేతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాధన ఉద్యమంలో కదం కదం కలిపి పోరాడిన తెలంగాణ జేఏసీ నేతలు... రాజకీయ చదరంగంలోకి దిగాక ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారిపోతున్నారు.. ఒక్కొక్కరు ఒక్కోపార్టీ నుంచి బరిలోకి దిగి సై అంటే సై అంటున్నారు. 30వ తేదీన తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పలుచోట్ల జేఏసీలో కీలకంగా పనిచేసిన నేతల మధ్యే పోటీ నెలకొని ఉంది. పలువురు జేఏసీ నేతలు వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉన్నారు. ఎవరికి వారు తమకే మద్దతివ్వాలంటూ టీజేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కరవమంటే కప్పకు కోపం.. వదల మంటే పాముకు కోపం అన్నట్లుగా జేఏసీ పరిస్థితి తయారైంది. ఆయా చోట్ల ఎవరికి మద్దతివ్వాలనేదానిపై తెలంగాణ జేఏసీకి పాలుపోవడం లేదు. దీంతో మౌనాన్ని ఆశ్రయించడమే మేలని జేఏసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘తలనొప్పి’ నియోజకవర్గాలివే.. * నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, టీఆర్ఎస్ నుంచి గాదారి కిషోర్ పోటీపడుతున్నారు. దయాకర్ జేఏసీ అధికార ప్రతినిధిగా పనిచేయగా.. కిషోర్ ఓయూ జేఏసీలో కీలకంగా వ్యవహరించారు. * మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్.. టీఆర్ఎస్ రెబెల్‌గా మరో జేఏసీ నేత అమరేందర్ బరిలో ఉన్నారు. * కంటోన్మెంట్ స్థానం నుంచి గజ్జెల కాంతం కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయగా.. మొదట సీటు పొంది, పోగొట్టుకున్న విద్యార్థి జేఏసీ నేత కృశాంక్ కూడా పోటీకి దిగారు. * మరోవైపు పలువురు జేఏసీ నేతలు కూడా వివిధ అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి (టీఆర్ఎస్), అంబర్‌పేట నుంచి నలిగంటి శరత్ (ఎంఐఎం), కరీంనగర్ జిల్లా మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్), వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి కత్తి వెంకటస్వామి (కాంగ్రెస్) బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతిచ్చిన ఇతర పార్టీల నాయకుల నుంచి పోటీ ఉంది. దాంతో ఇక్కడ కూడా ఎవరికి మద్దతివ్వాలో కూడా జేఏసీకి అంతుపట్టడం లేదు. అదేవిధంగా భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్స్ జేఏసీ నేత బూర నర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) పోటీలో ఉన్నారు. మౌనమే సమాధానమా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజకీయ పార్టీలకు దీటుగా పోరాడిన జేఏసీ... ఎన్నికల రాజకీయాలకు వచ్చే సరికి మౌనాన్నే ఆశ్రయిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒకవైపు టీడీపీని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ.. బీజేపీతో టీడీపీ పొత్తు అనంతరం ఆ కూటమిపై ఎటువంటి వైఖరి తీసుకుందనే విషయాన్ని వెల్లడించ లేదు. రాష్ట్రాన్ని తెచ్చింది తామేనంటున్న టీఆర్ఎస్, ఇచ్చింది తామేనంటున్న కాంగ్రెస్ పార్టీల విషయంలోనూ కచ్చితమైన నిర్ణయాన్ని జేఏసీ ప్రకటించలేదు. కనీసం జేఏసీ నేతలకైనా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిద్దామంటే పరస్పరం పోటీతో కొత్త సమస్య వచ్చి పడింది. -
తెలంగాణ అభ్యర్థులను మార్చిన ఏఐసిసి
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంతకు ముందు ప్రకటించిన శాసనసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను ఏఐసిసి మార్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, తుంగతుర్తి, నర్సంపేట స్థానాలకు అభ్యర్థులను మార్చినట్లు ఏఐసీసీ ప్రకటించింది. తుంగతుర్తిని అద్దంకి దయాకర్‌కు, నర్సంపేటను కత్తి వెంకటస్వామికి, కంటోన్మెంట్ గజ్జెల కాంతంకు కేటాయించారు. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలో కంటోన్మెంట్ (ఎస్సీ)ను క్రిషాంక్‌కు, నర్సంపేటను డి.మాధవరెడ్డికి, తుంగతుర్తి(ఎస్సీ) ని గుడిపాటి నర్సయ్యకు కేటాయించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు స్వయంగా కలుగజేసుకొని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ జేఏసీ నేతలు కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సినీ దర్శకుడు శంకర్, గజ్జెల కాంతం తదితరులు ఈ ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. జేఏసీ నేతలకు పోటీ చేసే అవకాశం కల్పించేందుకు అవకాశం కల్పిస్తామని సోనియా వారికి హామీ ఇచ్చారు. ఆ మేరకు జాబితాలో మార్పులు చేశారు. రాజేందర్ రెడ్డి, శంకర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.