
కంటోన్మెంట్ నుంచి గజ్జెల కాంతం
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో జేఏసీ నేతలకు చోటు దక్కింది. ఈమేరకు అభ్యర్థుల జాబితాలో మార్పులకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అంతకు ముందు తెలంగాణ జేఏసీ నేతలు కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సినీ దర్శకుడు శంకర్, గజ్జెల కాంతం తదితరులు మంగళవారం సోనియాగాంధీని కలిశారు. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంటు - గజ్జెల కాంతం, తుంగతుర్తి- అద్దంకి దయాకర్, నర్సంపేట- కత్తి వెంకటస్వామి పేర్లు ఖరారు కాగా, రాజేందర్ రెడ్డి, శంకర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సోనియాగాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇక గెలుపే ప్రధానంగా గెలుపే ప్రధానంగా, సామాజిక కోణం ఆధారంగా తెలంగాణలో అభ్యర్ధులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ జేఏసీని కాంగ్రెస్ పార్టీ విస్మరించలేదని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులతో గన్ పార్క్ వద్ద పొన్నాల ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ...బంగారు తెలంగాణ సాధించుకుందామని ప్రతిన బూనారు.
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టికెట్ రాని నేతలు అసంతృప్తితో ఉన్నారని... వారితో చర్చలు జరిపి అసంతృప్తిని తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుంది కాబట్టి వారికి పదవులు ఇచ్చి అసంతృప్తి తొలగిస్తామన్నారు. కోదాడ అసెంబ్లీ సీటుపై ఇంకా స్పష్టత లేదని, ఆ టికెట్ను ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత తనదని తెలిపారు.