సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల పైన దుర్మార్గంగా మాటల దాడి చేస్తున్న కేసీఆర్‌కు ఏదో మానసిక జబ్బు సోకిందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా బూతు పురాణం మాట్లాడడని అన్నారు. అహంకారంతో కళ్లుమూసుకుపోయిన కేసీఆర్ భారత రత్న నెహ్రు పైన కూడా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారని పేర్కొంటూ కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల విలీన సమయంలో.. ఒకవేళ ప్రజలకు పొసగక పోతే ఆంధ్రప్రదేశ్ విడిపోవచ్చని నెహ్రూ చెప్పిన విషయాన్ని కేసీఆర్ ఎందుకు మరచిపోయాడని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చక, ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నాయకులపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో నాడు యువజన నాయకుడిగా ఎందుకు కొనసాగాడని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ఎలా పెంచాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని గతంలో పేర్కొన్న కేసీఆర్.. ఇప్పుడు ‘తూ’ అంటున్నాడని విమర్శించారు. ‘నోటీ దూల ఉంటే మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నాయకులపై బూతు పురాణం మొదలు పెట్టు.. మా పార్టీ నాయకులపై నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదు’ అని శ్రవణ్ హెచ్చరించారు.
వైఎస్సార్ సేవలు కనిపించడం లేదా..
రాష్ట్ర బడ్జెట్ 60వేల కోట్ల రూపాయలుగా ఉన్న రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని టీపీసీసీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ రోజు 2లక్షల రూపాయల రాష్ట్ర బడ్జెట్‌తో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ఏ ఏపాటిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 108,104, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇచ్చినందుకా.. రింగ్ రోడ్డు వేయించినందుకా.. అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చినందుకా.. ట్రిపుల్ ఐటీ, ఆరోగ్యశ్రీ, లక్షల ఎకరాలకు నీళ్లు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకా .. ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నావని కేసీఆర్‌ను దుయ్యబట్టారు.
‘ఓటర్ల నమోదులో జరిగిన అవకతవకలు కోసం ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. దొంగ ఓట్లను ఇంతవరకు సరిదిద్దలేదు. కంటోన్మెంట్ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ఇద్దరు కూతుర్లలో ఒకరి ఓటు కంటోన్మెంట్‌లో.. మరొకరి ఓటు ముషీరాబాద్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా పరిస్థితికి ఇదే తార్కాణం’అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment