ఖేడ్‌తో కొత్త సంప్రదాయానికి శ్రీకారం | narayankhed byelection creates new Tradition | Sakshi
Sakshi News home page

ఖేడ్‌తో కొత్త సంప్రదాయానికి శ్రీకారం

Published Tue, Feb 16 2016 3:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

ఖేడ్‌తో కొత్త సంప్రదాయానికి శ్రీకారం

ఖేడ్‌తో కొత్త సంప్రదాయానికి శ్రీకారం

మెదక్ జిల్లా: నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అకాల మరణం చెందితే అన్నిపార్టీలు వారి వారసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.. లేదా ప్రధాన పార్టీలు పోటీకి దిగకపోవడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణ ఎన్నికల్లో నారాయణ్ఖేడ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అన్ని పార్టీలు బరిలోకి దిగాయి. ఏకగ్రీవం అనే మాటకు తావులేకుండా పోయింది.

కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పేరును అన్నిపార్టీల కంటే ముందుగా ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో పాటు.. ఎమ్మెల్యే మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికలు కావడంతో సానుభూతి పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ధీమాగా ఉంది. కానీ, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నాయకులు ఓటమిని ముందుగానే అంగీకరించే పరిస్థితి నెలకొంది. దానికి తోడు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మెజార్టీ 50 వేలను దాటింది. గ్రేటర్లో పూర్తి బాధ్యతలను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అన్నితానై చేపట్టగా.. ఖేడ్ బాధ్యతలను కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు తీసుకున్నాడు. ఇద్దరూ టీఆర్స్ పార్టీకి భారీ విజయాలు అందించారు.

మంత్రి హరీశ్ రావు 20 రోజుల పాటు ఖేడ్లోనే ఉంటూ ప్రతి గ్రామాన్ని చుట్టేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సిద్దిపేట తరహాలోనే అభివృద్ధికి కృషి చేస్తామన్న హరీశ్ వాగ్దానాలకు ప్రజలు మెజార్టీ రూపంలో పట్టం కట్టారని చెప్పాలి. అన్ని పార్టీల కంటే ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోయింది. ఖేడ్లో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందిస్తే కృష్ణాజలాలను తెస్తామని హరీశ్రావు చెప్పారు.

నారాయణ్ఖేడ్ ఉపఎన్నిక పోలింగ్ శాతం కూడా అనూహ్యంగా నమోదైంది. సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని మించి ఓటర్లు బారులు తీరారు. ఉప ఎన్నికల పోలింగ్ అంటే ప్రజల్లో కొంత ఆసక్తి తక్కువగా ఉండడంతో పాటు సిట్టింగ్ పార్టీలకే పట్టం కడతారన్న సంప్రదాయాన్ని ఖేడ్ ప్రజలు తిరగరాశారు. ఖేడ్లో ఎక్కువ మంది ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తారు.

కానీ, అధికార పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు ఉప ఎన్నికల పోలింగ్తో పాటు భారీ మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్ రెడ్డి నారాయణ్ఖేడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ఖేడ్లో 13 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది. మిగిలిన మూడుసార్లు ఎస్డబ్యూఏపీ, ఇందిరా కాంగ్రెస్, టీడీపీ గెలుపొందాయి.

ఇప్పటివరకు టీడీపీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జరిగాయి. ఇక నారాయణ్ఖేడ్ ఘన విజయంతో కాంగ్రెస్ నుంచి భారీ వలసలు ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులు కూడా త్వరలోనే కారెక్కడం ఖాయమని తెలుస్తుంది. ఇన్నాళ్లూ టీడీపీ వంతు కాగా.. ఇప్పుడు తమకు ఆ బాధ తప్పదేమోనని కాంగ్రెస్ నాయకులు మధనపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement