ఎంత ఘాటు ప్రేమో!
ఎంత ఘాటు ప్రేమో!
Published Thu, Jun 29 2017 11:36 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
- నంద్యాలలో అభివృద్ధి పేరిట హడావుడి
- కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలంటూ తాయిలాలు
- సీఎం కార్యాలయానికి ఆగమేఘాలపై ప్రతిపాదనలు
- ప్రజలను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ ఎత్తుగడ
కర్నూలు (అగ్రికల్చర్)/ సిటీ: ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై సర్కారుకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. అభివృద్ధి, సంక్షేమం అంటూ హడావుడి చేస్తోంది. ఇటీవల జరిగిన శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల ఎన్నికల్లో విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఓటమి పాలైతే పరువు పోతుందనే భయంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని ప్రకటించడంతోనే అధికార పార్టీలో వణుకు మొదలైంది. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అవకాశమున్న అన్ని దారులనూ వెతుకుతోంది. ఒకవైపు రేషన్ కార్డులు, పింఛన్లు, పక్కాగృహాలు వంటి తాయిలాలను ఎర వేస్తూనే.. మరోవైపు అభివృద్ధి పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నంద్యాలలో పర్యటించారు. మంత్రులు కూడా క్యూ కడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఆలోపే నిధుల వరద పారించి..ప్రజలను మభ్యపెట్టాలని అధికార పార్టీ చూస్తోంది.
ఈ క్రమంలోనే నంద్యాల నియోజకవర్గానికి ఏమేమి కావాలో ప్రతిపాదనలు పంపాలంటూ గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్న జిల్లా ఉన్నతాధికారి హడావుడిగా ఆ సమావేశాన్ని ముగించుకొని ఒకరిద్దరు ముఖ్య అధికారులతో కలిసి అధికార పార్టీ నేతల సూచన మేరకు గంట వ్యవధిలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం రూ.298.21 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల రూరల్ మండలం, గోస్పాడు మండలం ఉన్నాయి. నియోజకవర్గంలో 2,09,612 మంది ఓటర్లు ఉన్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని ఉప ఎన్నికలో లబ్ధి పొందడానికి అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నియోజకవర్గానికి 2,131 రేషన్ కార్డులు, 980 పింఛన్లు మంజూరు చేసింది. పక్కాగృహాలు కూడా మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది.
తెరపైకి చామకాలువ పూడికతీత
ఉప ఎన్నికలో ప్రజలను మభ్యపెట్టేందుకు, తమకు అనుకూలంగా ఉన్న వారికి నిధులను దోచిపెట్టేందుకు చామ కాలువలో పూడికతీత పనులకు రాత్రికి రాత్రే అంచనాలు వేయించారు. వాస్తవానికి ఆ కాలువ వరద నీటి నుంచి నంద్యాల పట్టణవాసులను కాపాడేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ రద్దు కాలేదు. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు నీరు–చెట్టు పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా పూడికతీత పనులకు రూ.3 కోట్లతో అంచనాలు వేయించారు. పైగా ఈ పనులకు వచ్చే నెల 3వ తేదీనే టెండర్ పిలిచేందుకు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ.. జల వనరుల శాఖ ఎస్‌ఈ ఎస్.చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇదే మంత్రిని కర్నూలు నగరం మధ్యలో వెళ్లే హంద్రీ, వక్కెరువాగుల్లో పూడికతీసేందుకు అనుమతులు ఇవ్వాలని, నీరు–చెట్టు కింద నిధులు మంజూరు చేయాలని కోరినా ఏ మాత్రమూ పట్టించుకోలేదు. కేవలం నంద్యాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కోట్లాది రూపాయలను ఖర్చు చేయడానికి అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది.
చామ కాలువ మొత్తం 5.9 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. దీనికి వెడల్పు సుమారు 45 మీటర్లు ఉంటుంది. ప్రతియేటా వర్షపు నీరు సమీప కాలనీల్లోకి వస్తుండడంలో రక్షణ గోడ నిర్మించేందుకు రూ.97.51 కోట్లకు 2008 మార్చి 12న అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్యాకేజీ–1 కింద రూ.20.44 కోట్లతో కాలువ ఇరువైపులా కాంక్రీట్ గోడ నిర్మించేందుకు సిద్ధపడ్డారు. అయితే.. భూసేకరణ సమస్య, కరెంట్, టెలిఫోన్ స్తంభాలు తొలగించక పోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీనికి తోడు డిజైన్స్ ఇవ్వడంలో అధికారులు చేసిన తీవ్రమైన జాప్యం వల్ల కూడా ఆ పనులు ఆగిపోయాయి. కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ అంగీకారానికి వచ్చారు. అయితే.. ఇంత వరకు ఆ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రస్తుతం అధికార పార్టీ నేతలు కాలువ పూడికతీతకు నీరు–చెట్టు కింద అంచనాలు వేయించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే అంచనాలు వేశాం
– ఎస్.చంద్రశేఖర్‌రావు, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్
చామకాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు నీరు–చెట్టు కింద అంచనాలు వేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అంచనాలు రూపొందించా. రూ.3 కోట్లతో సుమారు 3 కి.మీ మేర పూడిక తీయనున్నాం. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడతాం.
Advertisement