Orphans service
-
అంతిమయాత్రలో.. ఆ నలుగురు
ఇద్దరి వల్ల ‘జన్మ’.. నలుగురి వల్ల ‘కర్మ’ సంపదలుంటేనే సమాజంలో గౌరవం లేనివారిని చూస్తే అగౌరవం.. అయిన వాళ్లందరూ ఉంటే ఆ బతుక్కు అర్థం అన్నీ ఉంటేనే జీవితానికి.. అందం ఆస్తిపాస్తులు, అష్టైశ్వర్యాలుంటేనే ‘బంధం’ ఏమీ లేదని, ఎవరూ లేరని ‘అనాథ’లుగా చూస్తాం ప్రాణమున్నంత వరకూ పలకరిస్తారు.. ప్రాణం వదిలినంక వెంట ఎవరూ రారు ఆమెకు అయిన వాళ్లెవరూ లేరు.. ఆదరించేవారు లేరు.. పెళ్లిలేదు..ఇల్లూ లేదు.. పాడె మోసే దిక్కూ లేక.. అనాథ శవం ఆ ‘నలుగురు’ కలిశారు.. అనంత లోకాలకు సాగనంపారు అనంతపురం / యాడికి: అనాథ శవానికి ఆ నలుగురే దిక్కయ్యారు. అయినవాళ్లు ఎవరూ తిరిగి చూడకపోవడంతో వారే ముందుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాల్లోకెళ్తే.. యాడికిలోని నాగులకట్టవీధికి చెందిన కొర్రపాటి వెంకటసుబ్బమ్మ (68) అవివాహిత. వృద్ధాప్య పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్న ఈమెకు సొంతిల్లు లేదు. అద్దె ఇంటిలోనే ఉండేది. అద్దె కట్టలేని పరిస్థితిలో ఉండటంతో ఇటీవలే ఇల్లు ఖాళీ చేయించారు. పది రోజుల నుంచి ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బస్టాప్‌లోనే ఆమె ఉంటోంది. సోమవారం ఉదయమంతా హుషారుగానే తిరిగిన ఈమె రాత్రి భోజనం చేసి పడుకుంది. రెండు రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరుగుతూ వస్తుండటంతో కొంత నలతగానే కనిపించేది. చలికి తట్టుకోలేకపోయిన వెంకటసుబ్బమ్మ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిచింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమెలో చలనం కనిపించలేదు. ఈగలు వాలుతుండటంతో ప్రయాణికులు, చుట్టుపక్కల వారు పలకరించినా ఆమె నుంచి స్పందన రాలేదు. నిశితంగా పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించింది. స్థానిక చింతవనం ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన తమ్ముడు నివాసం ఉంటున్నప్పటికీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తిరునాంపల్లెలో చెల్లెలు కుమారుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు చివరకు పోలీసులకు విషయం చేరవేశారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, విలేకరులు పెద్దపప్పూరు మండలంలోని రామకోటిలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ పద్మనాభ భట్రాజ్కు సమాచారం అందించారు. భట్రాజ్ యాడికికి వచ్చి వృద్ధురాలి మృతదేహానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి, పూలలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్ డెన్నీ, గ్రామ తలారి సుబ్బరాయుడు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు అబ్దుల్ రజాక్‌లు మృతురాలిని ఆటోలోకి చేర్చారు. హిందూ శ్మశానవాటికలో వెంకటసుబ్బమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు. భట్రాజుకు కృతజ్ఞతలు ఆటో రవాణా ఖర్చుల కోసం డబ్బు ఇవ్వబోతే భట్రాజ్ సున్నితంగా తిరస్కరించాడు. తాను స్వంత ఖర్చులతో ఇప్పటి వరకు 150 అనాథల మృతదేహాలను శ్మశానాలకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించానన్నారు. అనాథలు ఎవరైనా మృతి చెందితే తన నంబరు 94900 70655కు తెలిపితే ఎంత దూరమైనా సరే వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి వస్తానని తెలపగా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మృతురాలి వద్ద ఉన్న సంచిలో రూ.1600 నగదు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛన్ కార్డు మాత్రమే ఉందని పోలీసులు చెప్పారు. -
సిటీలో స్పైడర్‌మ్యాన్..!
విశాఖసిటీ: మీరు చూస్తున్నది నిజమే.. సాహసాల స్పైడర్ మ్యాన్ విశాఖ వీధుల్లో విహరించాడు. సినిమాల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే స్పైడర్ మ్యాన్..నగరంలో నిరాశ్రయుల చెంతకు వచ్చాడు.వారి బాగోగుల గురించి ఆరా తీశాడు.సినిమా క్యారెక్టర్లో కనిపించే స్పైడర్ మ్యాన్.. నిజ జీవితంలోకి ఎలా వచ్చాడా అని ఆలోచిస్తున్నారా.? ఇదంతా.. స్ట్రీట్ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారం. బిగ్ స్కౌట్ పేరుతో ఈ నెల 16 నుంచి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో 100 మందికి పైగా వలంటీర్లు హాజరుకానున్నారు. నగరాన్ని 6 భాగాలుగా విడదీసి ఈ 100 మంది టీమ్స్‌గా ఏర్పడతారు. గాజువాక నుంచి మధురవాడ వరకూ ఉన్న నిరాశ్రయుల్ని ఈ బృందాలు కలిసి వారి వివరాలు తీసుకుంటుంది. వారికి ఆహారపదార్థాలు, దుస్తుల్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరిస్థితి బాగులేకపోతే వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో పాటు మందులు పంపిణీ చేస్తామని స్ట్రీట్ ప్రతినిధులు తెలిపారు. అదే విధంగా ఉపాధి కోసం ఎదురు చూసేవారికి వెంటనే ఉపాధి అవకాశాలు కల్పిం చనున్నట్లు స్ట్రీట్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగానే స్పైడర్ మ్యాన్ నగరంలో సందడి చేశాడు. ఈ సంస్థలో వలంటీర్‌గా చేరి సేవలందించానుకునేవారు 6305182805 నం బర్లో సంప్రదించాలని సూచించారు. -
అనాథలు, అభాగ్యులకు కట్టింగ్, గడ్డాలు చేస్తారు..
బంజారాహిల్స్: ముగ్గురితో మొదలైన ఓ సేవా ఉద్యమం.. దాదాపు మూడు వేల మంది యువతరాన్ని కదిలించేలా చేసింది.. తమ కళ్ల ముందు జరిగిన ఘటనకు చలించిన యువ హృదయాలు ఆపన్నులు, అనాథలు, వికలాంగులు, రోగులను ఇలా సేవ కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొనేలా చేసింది.. నాలుగు రోజుల ఉద్యోగం.. మూడు రోజుల సేవా ఉద్యమం.. అదే ఆ యువతరం చేసే సామాజిక కార్యక్రమం.. ప్రమాదంలో గాయపడితే వైద్యం అందజేస్తారు. మృత్యువాతపడితే ముందుకొచ్చి మంచి మనసుతో సాయం చేస్తారు.. రోడ్డు పక్కన చెరిగిన జుత్తు, పెరిగిన గడ్డంతో ఎవరైనా కనిపిస్తే వారి రూపాన్ని మార్చేస్తారు.. ఆకలి అంటూ కనిపిస్తే వారి ఆకలి బాధను తీరుస్తారు.. యువతరాన్ని, విద్యార్థిలోకాన్ని సమాజసేవ వైపు నడిపించేందుకు వారంలో ఒకరోజు చైతన్య తరగతులు నిర్వహిస్తారు.. శ్రీరాజమాత సేవా సొసైటీ పేరుతో నగరంలోని చాలా మేర ప్రాంతాల్లో ఈ సామాజిక చైతన్య ఉద్యమం వేదిక ద్వారా ఆదుకుంటున్నారు. చెంగిచర్ల ప్రాంతానికి చెందిన ఆర్జే ఉదయ్‌రెడ్డి(ఒకప్పుడు రేడియో జాకీ) ఇంటర్ చదువుతున్న సమయంలో తనతోపాటు చదివే ముగ్గురు స్నేహితుల తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఆ ముగ్గురు స్నేహితుల ఆర్థిక స్థోమత బాగోలేక చదువుకు దూరం కావల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు అంతా కలిసి చదవుకున్న వారు ఒక్కసారిగా జరిగిన పరిణామంతో తమ స్నేహానికి, చదువుకు దూరం కావడంతో ఉదయ్‌రెడ్డి తట్టుకోలేకపోయారు. ఎలాగైనా కలిసి చదువుకోవాలని భావించారు. అదే తపన అతని స్నేహితులను కదిలించేలా చేసింది. అంతా కలిసి ముందుకొచ్చి వారి చదువుకు ఆర్థికంగా బాసటగా నిలిచారు. ‘తల్లిదండ్రులు లేకుంటే ఎంత కష్టం.. వారి పరిస్థితి ఎంత దుర్భరం.. ముగ్గురిని చదివిస్తేనే ఇంత ఆనందం.. ఇలాంటి వారికి సాయ పడితే...’ ఇదే ఆలోచన వారిని శ్రీరాజమాత సేవా సొసైటీ ఏర్పాటుకు ముందుకొచేలా చేసింది. మూడు వేల సైన్యం.. ఉదయ్‌రెడ్డి ఒక్కడే కాకుండా తన సోదరుడు మనోజ్‌రెడ్డితోపాటు మరికొంతమందితో కలిసి ఈ సేవా సంస్థను ప్రారంభించాడు. తన ఆలోచనలను తాను చేసిన సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేశాడు. తెలిసిన వారందరికి తెలియజేశారు. ఇలా తన సేవా కార్యక్రమంలో అనేక కళాశాలల విద్యార్థులను కలుపుకొని ముందుకు వెళ్లాడు. కస్తూర్భా ఉమెన్స్ కళాశాల, రెడ్డి ఉమెన్స్ కాలేజ్, మధర్‌థెరిస్సా కాలేజ్, సిద్దార్థ కాలేజ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలతోపాటు మరికొన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు, పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ఉద్యమంలో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. సేవకు ముందుంటారు.. తల్లిదండ్రులు లేని అనాథలను అక్కున చేర్చుకోవడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అనాథగా ఎవరూ మృతిచెందకుండా వారి ఖర్మకాండలు నిర్వహించడం, రోడ్డు పక్కన ఉన్న యాచకులకు, అనాథలకు, వికలాంగులకు, అవసరార్థులకు జుత్తు కత్తిరించడం, గడ్డం చేయడం, దేశంలో ఎక్కడ ఎవరికి అవసరమైనా రక్తం ఇవ్వడానికి నేరుగా తమ సొంత ఖర్చుతో వెళ్లడం, ప్రమాదాలలో గాయపడిన వారికి వైద్య సేవలందించడం ఇలా అనేక సేవా కార్యక్రమాలతో తమ సేవను విస్తృతం చేశారు. ఇలా ఇప్పటికీ రోడ్డు పక్కన ఉన్నవారికి దాదాపు 1500ల మందికి జుత్తు, గడ్డం కత్తిరించి అందంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి చేసి వదిలేయడమే కాదు.. ప్రతి నెల చేస్తుంటారు. నగరంలో సగం.. నగరంలోని సగం ప్రాంతాల్లో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ మదర్‌థెరిస్సా విగ్రహం, కిమ్స్ ఆసుపత్రి, రాణిగంజ్, బేగంపేట, ఉప్పల్‌క్రాస్ రోడ్, హబ్సీగూడ, మెట్టుగూడ, చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, పద్మారావునగర్, పారడైజ్, పాట్నీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట ఇలా నగరంలోని చాలా మేర ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ సేవను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాలన్నింటిలో అన్నదానం చేస్తుంటారు. రామ్‌లక్ష్మణ్‌లు మెచ్చారు. శ్రీరాజమాత సేవా సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న సినీ ఫైటర్స్ రామ్‌లక్ష్మణ్‌లు తమ వంతు సాయంగా వారు కూడా ముందుకొచ్చారు. సాయం చేయాలనే పెద్దమనసుతో అన్నదానానికి అవసరమైన మారుతీ ఓమ్నీ వాహనాన్ని కొనుగోలు చేసి వీరికి అందించారు. దీంతో ఈ సేవా సంస్థ సభ్యులు ఓమ్నీ వాహనం ద్వారా ప్రయాణించి అన్నదానం చేయడం, అనాథలకు, అభాగ్యులకు సేవ చేయడం చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా ఆధారంగా తమ సేవకు సహకరించే వారి సాయం తీసుకుంటారు. అలాగని వీరు ఎవరి వద్ద నుంచి డబ్బులు ముట్టుకోరు. సేవకు అవసరమైన సామగ్రినే తీసుకుంటారు. అనాథ శవాలకు వీరే బంధువులు ఒక్కోసారి ప్రమాదం జరిగితే అలాంటి ఘటనలో తీవ్రంగా గాయపడిన వారుంటారు. కొందరు మృత్యువాత పడతారు. మరికొన్ని అగ్నిమాపక ఘటనల్లో బాధితులు మంటలకు తీవ్రంగా గాయపడి కాలిపోతారు. ఈ తరహా ఘటనల్లో ఈ సేవా సంస్థ సభ్యులు చురుగ్గా ముందుకొస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాంరెడ్డి కొద్ది నెలల క్రితం ఇలానే అగ్నికి దాదాపు 85 శాతం గాయాలపాలయ్యాడు. అతన్ని కొందరు గాంధీ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి వదిలివెళ్లారు. ఉదయ్‌రెడ్డి బృందం రంగంలోకి దిగి దాదాపు 15 రోజులపాటు బాధితుడికి సాయం అందించింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన జరిగితే అక్కడి ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి ఈ సేవా సంస్థకు సమాచారం అందిస్తారు. ప్రాథమిక చికిత్స, బాధితుల తరలింపు, మృతదేహాల తరలింపు ఇలాంటి అన్ని అంశాల్లో వీరి సాయం కూడా తీసుకుంటున్నారు. కాగా సొసైటీకి చెందిన ఉదయ్రెడ్డితోపాటు మనోజ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్, కీర్తన, అఖిల్, లక్ష్మీనర్సింహారెడ్డి, సాయినిహాల్లు ప్రాథమిక చికిత్సకు సంబంధించి శిక్షణ సైతం పొందారు. ప్రమాద ఘటనల్లో వీరే ప్రాథమిక సాయం అందిస్తారు. అభాగ్యులకు అండగా నిలవడానికే..: ఉదయ్‌రెడ్డి, అధ్యక్షుడు అభాగ్యులు, అనాథలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాం. తమ లక్ష్యసాధనలో చాలా మంది కలిసి వస్తున్నారు. సేవపై యువతలో మరింత ప్రోత్సాహాన్ని కల్పించడానికి వారంలో ఒకరోజు వివిధ కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు యువత, సమాజం, పెడదోవ పడితే కలిగే నష్టాలు, సామాజిక సేవ అంశాలపై అవగాహన కల్పిస్తాం. ఎవరూ అనాథలుగా చనిపోవద్దు. తమవారు లేక ఎవరూ వైద్యసేవలకు దూరం కావొద్దు.. ఆకలితో అలమటించవద్దు.. వీటినే నమ్మాం.. అందుకే ఆయా సేవలను అందిస్తున్నాం. వీటితోపాటు చదువుకు ప్రాధ్యాన్యమిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇలా అవసరమైన ప్రతి సామగ్రిని ఈ సంస్థ అందజేస్తుంది. వారి చదువులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇందుకోసం వాట్సాప్ నంబర్ 9652752324లో సంప్రదిస్తే చాలని అంటున్నారు ఉదయ్‌రెడ్డి. -
మీ దీవెనలు అందించ రారండి...
తల్లి ఎవరో తెలియదు.. నాన్న ఎలా ఉంటాడో చెప్పలేరు. ఈ 81 మంది చిన్నారులూ ఎక్కడ ఎప్పుడు పుట్టారో కూడా తెలియదు. కాని వారంతా ఒకే ఆశ్రమంలో పెరుగుతున్నారు. అంతేకాదు, ఆ చిన్నారులంతా తమ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ విడ్డూరమేమిటో చూడాలంటే జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం రేగడి తండావద్ద ‘మా ఇల్లు ప్రజాదరణ’ వేదికకు వెళ్లాల్సిందే. అనాథలను అల్లారు ముద్దుగా చూసుకోవడంతోపాటు వారికి పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న గాదె ఇన్నయ్య, పుష్పరాణి తమ కుమార్తె పెళ్లిని కూడా అదే వేదికపై నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రులు లేకపోవడం, ఎక్కడ, ఎప్పుడు పుట్టారో తెలియక పోవడంతో అనాథలకు పుట్టిన రోజులు జరపడం కష్టమే. దీంతో పుట్టినరోజు లేని వారి కోసం భగత్‌సింగ్, మదర్ థెరిస్సా, మహాత్మాగాంధీ జయంతులు, ప్రముఖుల పుట్టిన రోజులతోపాటు ప్రతి దసరా పండుగ సెలవుల్లో సామూహికంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం ‘మా ఇల్లు ప్రజాదరణ వేదిక’లో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి–పుష్పరాణి దంపతుల ఏకైక కుమార్తె డాక్టర్ బాలస్నేహ వివాహం వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన డాక్టర్ ఊర ఓంకార్‌రెడ్డితో ఆశ్రమంలో ఆదర్శ వివాహం జరిపిస్తున్నారు. అదేరోజు సామూహిక జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టారు. 81మంది పిల్లలకు కొత్తదుస్తులను కట్టించి ఒక్కొక్కరికి ఒక కేక్ చొప్పున కట్ చేసి వేడుకలను నిర్వహించనున్నారు. వేడుకలకు హాజరుకానున్న ప్రముఖులు.. అనాథపిల్లల సామూహిక జన్మదిన వేడుకలకు రాష్ట్ర ప్రముఖులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్, ఎంపీలు దయాకర్, వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు ఎరబ్రెల్లి దయాకర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు పలువురు పాల్గొననున్నారు. పుష్కరం క్రితం ప్రారంభం... ఒకప్పుడు పీపుల్స్‌వార్ నక్సలైట్‌గా ఉండి అజ్ఞాత జీవితం గడిపిన గాదె ఇన్నారెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం. జఫర్‌గఢ్ మండలం రేగడితండాకు చెందిన గాదె ఇన్నారెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న సమయంలో 2005లో అరెస్టయ్యారు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న సమయంలో ఇన్నారెడ్డి చాలా పుస్తకాలను చదివారు. ప్రపంచంలో ప్రముఖులుగా ఉన్న వ్యక్తులు అనాథలుగా ఉన్నట్లు గుర్తించారు. దీనితో అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వడం కోసం 2006, మే 28న రేగడి తండాలో మా ఇల్లు ప్రజాదరణ సోషల్ వెల్ఫెర్ సొసైటీని స్థాపించారు. 32మందితో ప్రారంభమైన ఆ ఆశ్రమం ఇప్పుడు వందలాదిమందికి ఆశ్రయం కల్పిస్తోంది. రేగడి తండాతోపాటు బోడుప్పల్, జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడు ఆశ్రమాల్లో 220 మంది పిల్లలు ఉన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతోపాటు నేపాల్‌కు చెందిన పిల్లలూ ఉన్నారు. ఇప్పటివరకు 832మంది అనాథలను చేరదీసి వారికి కొత్త జీవితాలను అందించారు ఇన్నారెడ్డి దంపతులు. 8మంది అమ్మాయిలకు ఆశ్రమంలోనే వివాహాలు జరిపించారు. చదువులు పూర్తి చేసుకున్న కొందరు వివిధ స్థాయిలలో ఉద్యోగాలు చేస్తుండగా కొంతమంది నర్సింగ్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్, వివిధ వృత్తి విద్య కోర్సులను చదువుతున్నారు. అనాథలు లేని భారతదేశం నాధ్యేయం అనాథ పిల్లలు లేని భారతదేశం నా ప్రధాన ధ్యేయమని మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి అన్నారు. అనాథల్లో అంతర్గతమైన శక్తి ఉంటుంది. వారు ఏదైనా సాధిస్తారు. సమాజం, ప్రభుత్వాలు అనాథలను అక్కున చేర్చుకోవాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వద్ద చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న అనాథలను చేరదీస్తున్నాం. ప్రపంచంలోని అనేకమంది మేధావులు, శాస్త్రవేత్తలు అనాథలే. ఒబామా, మధర్ థెరిస్సా, ఐ స్టీన్, న్యూట వంటి అనాథలే. మా ఆశ్రమంలోని అనాథలకు మేమే తల్లిదండ్రులం. అనాథల సామూహిక జన్మదిన వేడుకలకు మనసున్న మహారాజులు తరలి రావాలని కోరుతున్నాం. – గాదె ఇన్నారెడ్డి, ఆశ్రమ నిర్వాహకుడు -
అనాథల సేవలో యువ దంపతులు
మహబూబాబాద్ : ‘సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఈ దంపతులు మాత్రం సొంతానికంటూ ఏమి లేకుండా కష్టార్జితమంతా అనాథలకే వెచ్చిస్తూ వారికి ప్రేమను పంచుతున్నారు. యుక్తవయసులోనే ఆ దంపతులు అనాథలను చేరదీసి చేయూతనందిస్తున్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన బల్లెం విజయ్‌కుమార్, విక్టోరియా దంపతులకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. వారికి ఏడాది పాప ఉంది. బల్లెం విజయ్‌కు అనాథాశ్రమం నడపాలని తన ఆశయం. అందుకు తాను పెళ్లి చేసుకున్న భార్య కూడా సహకరించటం ఆయనకు మరింత బలాన్ని చేకూర్చింది. బ్యాంక్ కాలనీ సమీపంలో చిన్నగది ఉన్న ఇల్లు నెలకు 1500 చొప్పున అద్దెకు తీసుకుని పిల్లలతో పాటు ఆ దంపతులు ఆ గదిలోనే ఉంటున్నారు. సుమారు 9 మంది అనాథలను చేరదీసి వారిని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. గది అద్దె తక్కువ కావడంతో ఎలాంటి సౌకర్యాలు లేవు. దూరంగా వెళ్లి ఆ దంపతులు బోరింగ్ వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నారు. సౌండ్ సిస్టమే ఆశ్రమానికి ఆధారం.. సౌండ్ సిస్టమ్ నడుపుతూ ఇతరత్రా పనులు చేస్తూ విజయ్ కుమార్ తన ఆదాయంతో అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఇటీవల కాజీపేటకు చెందిన పాస్టర్ కురియన్ నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాడు. మరో ఇద్దరు చెరో రూ.1000 చొప్పున సాయం చేస్తున్నారు. వారు చేసే సాయం కిరాయికి పోను మిగిలిన డబ్బులు సరిపోవడం లేదు. ఆశ్రమం పేరుతో అధికారుల వద్దకు, వ్యాపారుల వద్దకు నిర్వాహకులు వెళ్లడం లేదు. కానీ ఆ ఆశ్రమం గురించి తెలిసిన అధికారులు అక్కడికి వెళ్లి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నెల 15న డీఎస్పీ డి.నాగరాజు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ఆశ్రమాన్ని చూశారు. దాని గురించి ఆరాతీసి ఆ దంపతులు చేస్తున్న సేవను తెలుసుకుని ఆశ్రమానికి వెళ్లారు. వెంటనే ఆయన స్పందించి క్వింటా బియ్యం, పిల్లలకు, ఆ దంపతులకు దుస్తులను, ఇతర సామగ్రి అందజేశారు. ఇంటికి నెల అద్దె తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దాతలు ముందుకొచ్చి సదుపాయాలు కల్పిస్తే ఆ అనాథలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కష్టంగానే నడుపుతున్నాం.. అయినా సంతోషంగా ఉంది నా భర్త ఆశయం ఆశ్రమం నడపాలని. అందుకు నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. వారికి వంట చేసి ఆలనా పాలనా చూసుకుంటున్నాను. డబ్బులపరంగా ఇబ్బంది అవుతున్నా వచ్చిన ఆదాయంలో వంట చేస్తూ పిల్లలకు పెడుతున్నాను. నా పిల్లల్లా చూసుకుంటున్నాను. కష్టం ఎక్కువగా ఉన్నా దానిలోను ఎంతో సంతోషం ఉంది. ఊరికి వెళ్లినా మాతో పాటుగా తీసుకెళ్తాం. మా పిల్లల లాగానే ప్రేమతో చూసుకుంటున్నాం. - విక్టోరియా, నిర్వాహకురాలు