పట్టించిన వాట్స్‌యాప్
=మొబైల్ అప్లికేషన్‌తో చిక్కిన ‘మెంటల్ ఖురేషీ’
=మొదటి వారంలో ‘ఎర్రగడ్డ’ నుంచి పరారీ
=19 రోజుల్లో పద్దెనిమిది ప్రాంతాల్లో ‘పర్యటన’
=రెండో భార్యతో ఉన్న ఫొటోలు మొదటామెకు షేర్
=బయటి నుంచి నలుగురు సహకరించినట్లు నిర్ధారణ
సాక్షి, సిటీబ్యూరో: నేరగాళ్లను పట్టుకునేందుకు వెస్ట్‌జోన్ పోలీసులకు టెక్నాలజీ బాగా ఉపకరిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్‌గౌడ్ కిడ్నాప్, హత్య మిస్టరీని ఫేస్‌బుక్ ఫొటోలు విప్పితే... ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి నుంచి పరారైన ఖైదీ ఖురేషీ జాడను మొబైల్ అప్లికేషన్ ‘వాట్స్‌యాప్’ తెలిపింది. రెండో భార్యతో ములాఖత్ అంగీకరించలేదనే కారణంగా ఈ నెల 3న తెల్లవారుజామున మరికొందరు ఖైదీలతో కలిసి ఖురేషీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఖురేషీ ‘గ్రేట్ ఎస్కేప్’కు బయట నుంచి మరో నలుగురు సహకరించినట్లు ఆధారాలు లభించాయని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు.
మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖురేషీ అరెస్టును ఆయన ప్రకటించారు. నాంపల్లి చాపెల్ రోడ్‌లో నివసించే మహ్మద్ అహ్మద్ ఫాహుద్దీన్ ఖురేషీపై అబిడ్స్ ఠాణాలో ఆరు, నాంపల్లి పోలీసుస్టేషన్‌లో మరో కేసు నమోదై ఉన్నాయి. అబిడ్స్ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్‌గా ఉన్న ఖురేషీని ఆ ఠాణా పోలీసులు మాదకద్రవ్యాల కేసులో అక్టోబర్ 15న అరెస్టు చేసి జైలుకు పంపారు. మానసికస్థితి సరిగ్గా లేదన్న కారణంతో జైలు అధికారులు ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తప్పించుకున్నాడు.
నిత్యం ‘రోమింగ్’లోనే...
ఆస్పత్రి వద్ద నుంచి ఆటోలో తన రెండో భార్య అల్మాస్ వద్దకు వెళ్లిన ఖురేషీ.. ఆమెతో కలిసి టవేరా వాహనంలో ‘టూర్’ ప్రారంభించాడు. మొదటి భార్య ఉన్నప్పటికీ ఖురేషీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అల్మాస్‌ను పెళ్లి చేసుకున్నాడు. గడిచిన 19 రోజుల్లో వాహనాలతో పాటు విమానాలు, రైళ్లలో గుల్బర్గా, బెంగళూరు, మైసూరు, ఊటీ, అజ్మీర్, ఢిల్లీ, ముంబై, మహాబలేశ్వర్, హరిద్వార్, కాశ్మీర్, గోవా, ఆగ్రా, సిమ్లా, కులూమనాలీ, శ్రీనగర్, పటాన్‌కోట్, లడక్, విజయవాడల్లో తిరిగాడు. ఎక్కడా ఒకరోజుకు మించి బస చేయలేదు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆగ్రాలో రెండో భార్యతో కలిసి దిగిన ఫొటోలను వాట్స్‌యాప్ ద్వారా మొదటి భార్యకు షేర్ చేశాడు. దీంతో అతడి ఆచూకీని సాంకేతికంగా కనిపెట్టిన పోలీసులు నిఘా ఉంచారు. సోమవారం సాయంత్రం విజయవాడ నుంచి టోలిచౌకి చేరుకోగా మాటు వేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు.
సహకరించిన వారిలో చీతాపూర్ కార్పొరేటర్
ఖురేషీ తప్పించుకోవడానికి సహకరించిన వ్యక్తులు నలుగురని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మీరాలం మండీకి చెందిన రెండోభార్య అల్మాస్‌కు ఖురేషీ పరారైన ఖైదీ అని తెలిసీ అతడితో సంచరించింది. ఈమె సోదరుడైన సయ్యద్ ముస్తాఫా అలీఖాన్ రిజ్వీ అలియాస్ ఫజల్ తరచూ ఆస్పత్రిలో ఖురేషీని క లుస్తూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి సహకరించాడు. అల్మాస్ నివసిస్తున్న ఇంటి యజమాని సయ్యద్ అలీ హుస్సేన్ వీరిద్దరూ సిటీ వదిలి పారిపోవడానికి తన టవేరా వాహనాన్ని సమకూర్చాడు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ఉన్న చీతాపూర్ కార్పొరేటర్ సయ్యద్ జఫార్ సైతం రూ.25 వేల వరకు ఇచ్చి సహకరించాడు. వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఇంకా ఎవరి ప్రమేయం ఉందనేది తేల్చడానికి ఖురేషీని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ కూడా..
ప్రస్తుతం అబిడ్స్ ఠాణాలో రౌడీషీటర్‌గా ఉన్న, ‘మెంటల్’గా ముద్రపడిన ఖురేషీలో మరో ఆసక్తికర కోణమూ ఉంది. అతను ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్. ఫహద్ ఖురేషీ పేరుతో 2006 వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సీనియర్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఎందరో మల్లయోధుల్ని మట్టికరిపించి నాలుగైదు మెడల్స్ కూడా సంపాదించాడు. 2004 ఆగస్టు 22-25 మధ్య ఒడిశాలోని పూరీలో జరిగిన 28వ సీనియర్ నేషనల్ ఆర్మ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో అత్యుత్తమన ప్రతిభ కనబరిచాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి.
ఖురేషీ మానసికస్థితి పక్కాగా ఉంది
ఎస్కేప్‌కు ప్లాన్ చేయడం నుంచి పట్టుబడే వరకు ఖురేషీ తీరును పరిశీలిస్తే అతడి మానసికస్థితి పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు జైలు నుంచి మెంటల్ ఆస్పత్రికి ఎందుకు వచ్చాడనేది బయటపడాలి. ఖురేషీ సైతం తనను ఆ ఆస్పత్రికి ఎందుకు పంపారో తెలియదని చెబుతున్నాడు. అందుకే గాంధీ ఆస్పత్రి వైద్యుల బృందంతో పరీక్షలు చేయిస్తున్నాం. నివేదికల్ని కోర్టుకు సమర్పించి న్యాయమూర్తి ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఖురేషీ ఆస్పత్రిలో ఉండగా ఫోను వాడాడని తెలుస్తోంది. ఈ విషయంతో పాటు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నాం. ఆ రోజు తప్పించుకున్న వారిలో తిరుమలేష్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఇతని కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది.
- డీసీపీ సత్యనారాయణ