ఖురేషి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి: ప్రమోద్కుమార్
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషి అనే ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమోద్కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆసుపత్రి నుంచి గత రాత్రి 11 మంది రోగులు పరారైనట్లు ధృవీకరించారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఖురేషి భార్య ములాఖత్ కావాలంటూ ఆసుపత్రికి వచ్చిందని, అయితే ఆ సమయంలో ములాఖత్ నిబంధనలకు విరుద్ధమని చెప్పామని ఆయన తెలిపారు. భార్యతో ములాఖత్ నిరాకరించడంతో ఖురేషి ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించాడని పేర్కొన్నారు.
ఖురేషీ ఆసుపత్రి సిబ్బంది,పోలీస్ సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడని వివరించారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్తో గోడకు రంధ్రం చేసి వారంత పరారయ్యారని తెలిపారు. పరారైన వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో నలుగురు పరారిలో ఉన్నారన్నారు. రాత్రి సమయంలో వారిని అడ్డుకోవడానికి తమ సిబ్బంది, పోలీసులు విఫలయత్నం చేశామన్నారు. అయితే ఆసుపత్రిలో మిగిలిన 50 మంది పేషెంట్లకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.