వాషింగ్టన్: పాకిస్తాన్ భూభాగం కేంద్రంగా జరుగుతున్న ఉగ్రసంస్థల కార్యకలాపాలను నిలువరిస్తూ అర్థవంతమైన చర్యలు వెంటనే చేపట్టాలని పాక్‌ను అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. సంయమనం పాటించాలని భారత్, పాక్‌లను కోరింది. రెచ్చగొట్టే చర్యలను ఆపాలని అమెరికా విదేశాంగ మంత్రి పొంపియో పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి ఫోన్‌లో సూచించారు. శాంతిని కొనసాగించేందుకు కలసి రావాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నేరుగా చర్చలు జరపాలని, సైనిక చర్యలకు పాల్పొడద్దని, శాంతిని కొనసాగించేందుకు కలసి రావాలని కోరారు.
సుష్మా వస్తే మేం రాం: పాక్
ఇస్లామాబాద్: ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్(ఓఐసీ) సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వస్తే తాము రాబోమని పాక్ స్పష్టంచేసింది. మార్చి 1, 2 తేదీల్లో అబుదాబిలో జరగనున్న ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశానికి సుష్మాను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. దీనిపై పాక్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఓఐసీ సభ్య దేశాలతో మాకు ఇబ్బంది లేదు. కానీ, సుష్మా వస్తే సమావేశాన్ని మేం బహిష్కరిస్తాం. టర్కీ విదేశాంగ మంత్రితో మాట్లాడా. భారత్ ఈ సమావేశానికి హాజరుకావడాన్ని టర్కీ కూడా వ్యతిరేకిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రికి మా అభ్యంతరం తెలిపాం’అని ఖురేషి చెప్పారు. 1969లో ఏర్పాటు చేసిన ఓఐసీలో 57 సభ్యదేశాలున్నాయి. గతంలో ఈ సమావేశాల్లో క శ్మీర్ అంశాన్ని చర్చించడంపై భారత్ పలమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment