సాక్షి, సిటీబ్యూరో: సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ బాంబే సలీం పూణే క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడు. గతంలో ముంబై మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లోనే చోరీ సంచలనం సృష్టించిన ఈ ఘరానా నేరస్తుడిపై దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. పలు నగరాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఇతడికి హైదరాబాద్‌తో పాటు ముంబైలోనూ ఇల్లు ఉంది. తాజాగా 127 చోరీ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అతడిని పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని గతంలో 2012 ఫిబ్రవరి 28న రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు.
ఇద్దరూ కలిసి దొంగతనాలు...
అప్పటి నుంచి ఇద్దరూ కలిసి వివిధ నగరాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ ఇంటిని టార్గెట్ చేసుకున్న తర్వాత ప్రత్యేకమైన ఉపకరణాలతో తాళాలు, డోర్లు పగులకొట్టి ఖరేషీ లోపలకు వెళ్తాడు. ఇషావర్ పెప్పర్ స్ప్రే చేత పట్టుకుని బయట కాపుకాసేవాడు, ఎవరైనా ఇంటిలోకి కానీ, తమ సమీపంలోకి కానీ రావడానికి ప్రయత్నిస్తే వారి ముఖంపై స్ప్రే చేయడంతో పాటు ఖురేషీని అప్రమత్తం చేస్తాడు. ఆపై ఎదుటి వారు తేరుకునే లోపు ఇద్దరూ కలిసి పరారయ్యేవారు. పుణేలో మొత్తం 30 పోలీసుస్టేషన్లు ఉండగా... వాటిలోని 27 ఠాణాల పరిధిలో ఖురేషీ ద్వయం పంజా విసిరింది. దీంతో అతడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ ఆధీనంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు నెలల పాటు శ్రమించిన పోలీసులకు గత వారం ఖురేషీ పుణే విమానాశ్రయం వద్ద సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్నిన అధికారులు నల్లరంగు లాన్సర్ కారులో తిరుగుతున్న అతడితో పాటు అతడి సహాయకుడు ఇషావర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ఈ వివరాలు రాబట్టడానికి కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్ప టి వరకు ఖురేషీ, ఇషావర్‌లు 127 చోరీలు చేసినట్లు అంగీకరించడంతో పూణే క్రైంబ్రాంచ్ ఆయా నగరాలకు సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా పీటీవారెంట్లు వేసుకుని అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పొరపాటున చోటా రాజన్ ఇంట్లో...
ముంబైలోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్‌లోని డియోనార్ బుచ్చర్ హౌస్‌కు చెందిన సలీం అలీ హుస్సేన్ ఖాన్ ఆరో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఇతడికి బాంబే సలీం, మున్న ఖురేషీ, మహ్మద్ హమీద్ హబీబ్ ఖురేషీ తదితర మారుపేర్లు ఉన్నాయి. ముంబైలో చిన్న చిన్న చోరీలకు శ్రీకారం చుట్టిన అతను 2000 నుంచి ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2001లో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన బాంబే సలీం గ్యాంగ్ అదే రోజు రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించి తమ ‘పని’ పూర్తి చేసుకుంది. మరుసటి రోజు పత్రికలు చూసిన సలీం షాక్‌కు గురయ్యాడు. తాను చోరీ చేసింది మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలుసుకుని ఖంగుతిన్నాడు. కొన్నాళ్ల తర్వాత ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడం, వారు తన అనుచరులపై దాడి చేయడంతో భయపడిన సలీం జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే రాజన్ అనుచరులను కలిసి జరిగింది చెప్పి ముంబై వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. అనంతరం అతను తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్‌లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ గ్యాంగ్‌ను విడిచి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరులో విక్రయించేవాడు. ఇతడి కోసం గాలింపు చేపట్టిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో అతడిని అరెస్టు చేశారు. ‘నేను పుణేలో తప్ప బెంగళూరులో ఎలాంటి నేరాలు చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎలా పట్టుకుంటారు?’ అంటూ బెంగళూరు పోలీసులను ప్రశ్నించడంతో వారు నివ్వెరపోయారు. అలా బెంగళూరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన సలీం ఆ తర్వాత అక్కడా పంజా విసిరాడు. కొన్నాళ్లకు అతను మరో పెళ్లి చేసుకున్నాడు.
సిటీలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్...
కేసుల సంఖ్య పెరగడం, నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో బెంగళూరు, పుణే, ముంబై పోలీసుల కళ్లు కప్పేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చిన సలీం ఇక్కడా చేతులకు పని చెప్పి పోలీసులకు దొరికిపోయాడు. ఈ రకంగా సిటీతో పరిచయం ఏర్పడిన సలీం 2010లో తన ఇద్దరు భార్యలతో హైదారాబాద్‌కు వచ్చి వేర్వేరు ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాడు. కొన్నాళ్ల పాటు టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించాడు. అందులో నష్టాలు రావడంతో మళ్లీ చోరీల బాటపట్టిన అతను చందానగర్, బాలానగర్, ఉప్పల్, కుషాయిగూడ, అల్వాల్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, సరూర్‌నగర్, శివరామ్‌పల్లి, చైతన్యపురి, శంషాబాద్, రాయదుర్గం, మీర్‌పేట్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పంజా విసిరాడు. మధ్య మధ్యలో పుణే, ముంబైలకు వెళ్తూ అందినకాడికి దండుకు వచ్చేవాడు. ఈ రకంగా రెండు రాష్ట్రాల్లోనూ 20 వరకు నేరాలు చేశాడు. అతడిపై సుదీర్ఘకాలం నిఘా ఉంచిన రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు 2012లో అతడిని పట్టుకున్నారు. అప్పట్లో ఇతడి నుంచి రూ.56,27,500 విలువైన 1.58 కేజీల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. కాగా బాంబే సలీంకు ముంబైతో పాటు హైదరాబాద్‌లోని రాఘవకాలనీలోని షాదత్ రెసిడెన్సీలోనూ ఇళ్లు ఉన్నాయి. ఇద్దరు భార్యల్లో ఒకరు ముంబైలో, మరొకరు సిటీలో ఉంటున్నారు. 2018 ఆగస్టు నుంచి ముంబైతో పాటు పుణె, నాసిక్, నాగ్‌పూర్, నవీ ముంబై, థానేల్లో 127 చోరీలు చేశాడు. హైదరాబాద్‌లోనూ కొన్నిచోట్ల పంజా విసిరినట్లు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో వచ్చే ఖురేషీ ఆయా నగరాల్లో స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఖరీదైన కారును కొనుగోలు చేసే ఇతను రిజిస్ట్రేషన్‌ను తన పేరుతో మార్చుకోకుండానే అదే కారులో తిరుగుతూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి అనువైన ఇంటికి కన్నం వేస్తాడు. పుణేలోని భారతి విద్యాపీఠ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో ఖురేషీని అక్కడి పోలీసులు 2018 జూలైలో అరెస్టు చేసి యరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన ఖురేషీ జైల్లో తనకు పరిచయమైన యరవాడలోని షామీఅలీ ప్రాంతానికి చెందిన ఇషావర్ అలియాస్ చింత్యా షిండేవాల్ అనే దొంగకు బెయిల్ ఇప్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment