Salim
-
అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్ సరిహద్దుల్లోని రైసెన్ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. భోపాల్‌లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ సయ్యద్ డానిష్ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్ ఖాన్ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్ రెహా్మన్, షేక్ జునైద్ కూడా హాజరయ్యారని ఏటీఎస్ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది. గోల్కొండలోని సలీం నివాసంలో ఎయిర్ పిస్టల్, పిల్లెట్స్, భోపాల్‌లోని యాసిర్ ఇంటి నుంచి నాటు తుపాకీ, తూటాలు సీజ్ చేశారు. ఈ నాటు తుపాకీ సేకరించింది, భోపాల్ మాడ్యుల్‌కు శిక్షణ ఇచ్చింది కూడా సలీం అని ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ కోణంలో అతడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విదేశీ నంబర్లకు ఫోన్లపై ఆరా నగర మాడ్యుల్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ఫోన్ల నుంచి విదేశీ నెంబర్లకు ఫోన్లు వెళ్లినట్లు అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు వాటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి విదేశాల్లో ఉన్న వారితో ఉన్న సంబంధాల పైనా దర్యాప్తు చేయనున్నారు. ఉగ్రవాద సాహిత్యాన్ని తన ల్యాప్‌టాప్ వినియోగించి సొంతంగా తయారు చేసిన సలీం అందులో అనేక అంశాలు చేర్చాడు. ఆన్లైన్లో ఉన్న విషయాలతో పాటు వివిధ పుస్తకాల్లోని అంశాలు క్రోడీకరించి రూపొందించిన ఇందులో జిహాద్, ముజాహిదీన్ అంటే ఏమిటి? తాము ఏం చేయాలి? అనే వివరాలతో పాటు ఉగ్రవాద చర్యల్లో పాల్గొంటూ చనిపోయిన వారి కుటుంబాలను ఎలా ఆదుకోవాలి? ఎలాంటి ఆయుధాలు సమీకరించుకోవాలి? క్యాడర్‌ను ఎలా రిక్రూట్ చేసుకోవాలి? వివరాలు పొందుపరిచాడు. ఈ కేసులో సాక్షులుగా ‘వారు’: సలీం రెహ్మాన్ న్ గతంలో మరికొందరిని ఆకర్షించారు. వీళ్లు కేవలం మతపరమైన కార్యక్రమాలు చేపడుతున్నారని భావించిన వాళ్లు కొన్ని సమావేశాలకు హాజరయ్యారు. కొన్నాళ్లకే వీరి వ్యవహరశైలి, కార్యకలాపాలు అనుమానాస్పదంగా భావించిన వారంతా దూరయమ్యారు. వీరిని గుర్తించి, ఈ కేసులో సాక్షులుగా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. -
తొమ్మిది నెలలు నడిచాను
సుప్రసిద్ధ నటి హెలెన్ గొప్ప నాట్యగత్తెగా అందరికీ తెలుసు.రచయిత సలీం భార్యగా, సల్మాన్ ఖాన్ మారుతల్లిగా కూడా తెలుసు.కాని ఆమెకు ఒక వెంటాడే గతం ఉంది.తన కుమారుడు అర్బాజ్ ఖాన్ చేస్తున్న తాజా షోలోఆమె ఆ గతాన్ని గుర్తు చేసుకుంది.ఆ జ్ఞాపకాలు కదిలించేవిగా ఉన్నాయి. ‘నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే, సినిమాల్లో నిలబడ్డానంటే దానికి మా అమ్మే కారణం. ఆమె చాలా ఆత్మస్థయిర్యం ఉన్న స్త్రీ’ అని గుర్తు చేసుకున్నారు 84 ఏళ్ల హెలెన్. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే హెలెన్ నటుడు అర్బాజ్ ఖాన్ టాక్ షో ‘ది ఇన్విన్సిబుల్స్’లోపా ల్గొని మాట్లాడింది. ఆ సందర్భంగా తన బాల్యాన్ని, తల్లిని గుర్తు చేసుకుంది. ‘మా అమ్మది బర్మా (మయన్మార్). నాన్న ఆంగ్లో ఇండియన్. నేను పెద్దదాన్ని. నా తర్వాత తమ్ముడు. చెల్లెలు. 1943లో అమ్మ గర్భంతో ఉండగా నాన్న చనిపోయాడు. అప్పుడే బర్మాను జపాన్ ఆక్రమించింది. అంతటా రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు. బర్మాలో ఉండే పరిస్థితి లేదు. ఆ సమయానికి నాకు ఆరేళ్లు. అమ్మ నన్ను తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని ఇండియా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళితే సరిగ్గా మేము వెళ్లే సమయానికి జపాన్ విమానాలు వచ్చి బాంబులు వేశాయి. ఇక విమానంలో వెళ్లే పరిస్థితి లేదు. దాదాపు 350 మంది నడక ద్వారానే ఇండియాకు బయలుదేరాం. అమ్మ ప్రెగ్నెంట్ అయినా భయపడక నన్ను, తమ్ముణ్ణి, చెల్లెల్ని తీసుకుని ఆ బిడారులో బయలుదేరింది. 9నెలలపా టు నడిచాం. దారిలోని పల్లెల్లో కొంతమంది మాకు అన్నం పెట్టేవాళ్లు. బ్రిటిష్ సైనికులు కనిపించి తినడానికి ఇచ్చేవారు. దారిలో అమ్మకు అబార్షన్ అయ్యింది. చెల్లెలు చనిపోయింది. నేను, తమ్ముడు ఎముకల గూడుగా మారాం. ఇండియా చేరేనాటికి 350 మందిలో సగం మందిమే మిగిలాం. మేము మొదట అస్సాంకు తర్వాత కోల్‌కతాకు చేరాం. ఆ తర్వాతే బాంబే వచ్చి స్థిరపడ్డాం’ అని చెప్పిందామె. మరి సినిమా రంగానికి ఎలా వచ్చారు అని అర్బాజ్ అడగగా– ‘బాంబేలో మేమున్న ఇంటి ఎదురుగా ఒక మణిపూరి డాన్సర్ ఉండేది. ఆమె దగ్గర అమ్మ నాకు మణిపురి నేర్పించింది. ఆ రోజుల్లో కుకూ అనే డాన్సర్ సినిమాల్లో ఫేమస్. ఆమెకు అమ్మతో స్నేహం కుదిరింది. ఆమెలా నేనూ డాన్సర్ అవ్వాలని అమ్మ అనుకుంది. కుకు నన్ను సినిమాల్లోకి గ్రూప్ డాన్సర్‌గా తీసుకెళ్లింది. దేవ్ ఆనంద్ నటించిన ‘బారిష్’ (1957)లోని ‘మిస్టర్ జాన్ బాబాఖాన్’పా టతో ఐటమ్ గర్ల్‌గా మారాను. ‘హౌరాబ్రిడ్జ్’ (1958)లోని ‘మేరా నామ్ చిన్ చిన్ చూ’పా టతో నాకు స్టార్డమ్ వచ్చింది’ అని చెప్పిందామె. ‘మా నాన్న (రచయిత సలీం ఖాన్)తో మీ స్నేహం ప్రేమ, పెళ్లి దాకా ఎలా దారి తీసింది’ అని అర్బాజ్ అడగగా ‘1970లో నా ఆస్తి మొత్తం పోయింది (హెలెన్ మొదటి భర్త పి.ఎన్.అరోరా వల్ల). కోర్టు కేసుల్లో చిక్కుకున్నాను. ఆ సమయంలో మీ నాన్న నా ఇబ్బందిని గమనించి తాను రాసే సినిమాల్లో నాకు వేషాలు వచ్చేలా చూశాడు. అలా ప్రేమ ఏర్పడింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా కోసం ఆయన తన కుటుంబం నుంచి విడిపోయి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ కలసి ఉండేలా చూడమని గట్టిగా కోరాను. మీ అమ్మ (సల్మా ఖాన్), మీరు ఆ రోజుల్లో ఎక్కువ వేదన అనుభవించి ఉంటారు. నేనైతే మీ అమ్మకు ఎదురుపడటానికి కూడా భయపడేదాన్ని. ఏమైనా కొన్నాళ్లకు మీరంతా నన్ను యాక్సెప్ట్ చేశారు. నన్ను హెలెన్ ఖాన్‌గా గౌరవించారు. సల్మా, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అర్పిత (సల్మాన్ చెల్లెలు) పెళ్లిలో శుభలేఖలో నా పేరు కూడా వేశారు. ఇంతకన్నా ఏం కావాలి?’ అందామె. -
లష్కరే టాప్ ఉగ్రవాది సలీం పర్రే హతం
జమ్మూ/శ్రీనగర్: శ్రీనగర్ శివారులో సోమవారం పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్కౌంటర్లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. లక్ష్య పెట్టకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. -
హత్య.. ఆత్మహత్య..మధ్యలో మద్యం
మద్యం.. వారి విచక్షణను కోల్పోయేలా చేసింది.. మత్తులో ఉన్న వారు తామేం చేస్తున్నామో తెలుసుకోలేని స్థితికి వెళ్లిపోయారు.. ముందు..వెనుకా ఆలోచించలేదు.. కుటుంబం గురించి పట్టించుకోలేదు.. ఆవేశం కట్టలు తెంచుకుంది.. వారి చర్యలతో ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. మరొకరు హత్యచేశారు. నగరంలోని వేర్వేరు చోట్ల ఈ రెండు సంఘటనలు జరిగాయి. జగద్గిరిగుట్ట: పాత కక్షల నేపథ్యంలో హఫీజ్ (21) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట సీఐ గంగరెడ్డి తెలిపిన మేరకు.. గాజులరామారం డివిజన్ శ్రీరాంనగర్‌కు చెందిన అక్బర్(31) అటో డ్రైవర్. రంజాన్ పండగ అనంతరం విందు చేసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన జావీద్(19) అన్నులు కలిసి మద్యం తాగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన హఫీజ్ కారు మెకానిక్ వీరి వద్దకు వచ్చి నా సోదరుడు జావీద్తో ఎందుకు మద్యం తాగుతున్నావని అక్బర్‌తో గొడవకు దిగాడు. అనంతరం నలుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అక్బర్ మరోసారి మద్యం కొనుగోలు చేసి తాగేందుకు వెళ్తున్నాడు. ఇది గమనించిన హఫీజ్ అక్బర్‌తో మరోమారు గొడవ పడటం ప్రారంభించాడు. గతంలో అక్బర్‌ను చంపుతానంటూ హఫీజ్ బెదిరించాడు. దీంతో తనను అంతమొందించెందుకే గొడవ పడుతున్నాడని భావించిన అక్బర్ హఫీజ్‌ను కిందపడేసి పక్కనే ఉన్న సిమెంటో ఇటుకతో తలపై మోదాడు. దీంతో తలకు తీవ్ర గాయమైన హాఫీజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతంరం అక్బర్ జగద్గిరిగుట్ట ఠాణాలో లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(ఉద్యోగం పేరుతో వ్యభిచార రొంపిలోకి.. ) బ్లేడుతో చేయికోసుకొని ప్రాణం వదిలాడు దూద్‌బౌలి: మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ తెలిపిన మేరకు.. కాకినాడకు చెందిన సలీం (38) నగరంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు.కొద్ది రోజులుగా భార్య కాకినాడ నుంచి ఫోన్ చేసి డబ్బు కోసం అడుగుతూ ఉండేది. లాక్డౌన్ నేపథ్యంలో సలీం వద్ద డబ్బులు లేకపోవడంతో భార్యతో తరచుగా గొడవ పడుతుండేవాడు. మద్యానికి బానిసైన సలీం.. ఇక డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్లో భార్యకు బెదిరించేవాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో విపరీతంగా మద్యం తాగిన సలీం ఫోన్లో భార్యతో గొడవ పడి అక్కడే ఉన్న బ్లేడ్‌తో ఎడమచేయిపై తీవ్రంగా గాయాలు చేసుకున్నాడు. రక్తస్రావం జరగడంతో అపస్మారకస్థితిలో చేరుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల వరకు సలీం తలుపులు తెరవకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూడగా మృతి చెంది ఉన్నాడు. చార్మినార్ ఏసీపీ అంజయ్య, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు కాకినాడలో ఉండే భార్యకు సమాచారం అందించారు. -
అక్కడ దొంగతనం.. ఇక్కడ విక్రయం!
సాక్షి, సిటీబ్యూరో: సంపన్నుల ఇళ్లే అతడి టార్గెట్.. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా దొంగతనాలు. 127 చోరీ కేసుల్లో పుణె క్రైమ్ బ్రాంచ్‌కు గత వారం చిక్కిన ‘దొంగలకే దొంగ’ మహ్మద్ హమీద్ ఖురేషీ అలియాస్ బాంబే సలీం విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతడు దేశంలోని ఏ ప్రాంతంలో చోరీ చేసినా ఆ సొత్తును మాత్రం హైదరాబాద్‌కు తరలించి ఐదుగురు రిసీవర్ల ద్వారా విక్రయించేవాడని తేలింది. దీంతో మూడు రోజుల క్రితం సిటీకి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు సలీం బంధువులు, స్నేహితులుగా అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరోపక్క ఇతగాడికి ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ సహకరిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ఆ కోణంలో లోతుగా విచారించాలని నిర్ణయించింది. పుణె సహా ఇతర నగరాల్లో చేసిన 127 కేసులకు సంబంధించిన సొత్తును సలీం ఖరేషీ తన వెంట హైదరాబాద్‌కు తీసుకువచ్చాడని తేలింది. కారులో, విమానంలో తీసుకువస్తే తనిఖీల్లో దొరికే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో వాటిని వినియోగించడు. సాధారణ ప్రయాణికుడి మాదిరిగా రైలులో సిటీకి చేరుకుంటాడు. తొలుత ఈ సొత్తును మెహిదీపట్నం బృందావన్ కాలనీలోని తన ఇంటికి తరలించే సలీం.. ఆపై నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తన స్నేహితులైన షరీఫ్ షేక్, అశోక్ ప్రధాన్, అబ్దుల్ సత్తార్, మొఘల్ అన్వారీలాల్ బేగ్, ప్రభు నంజ్వాడేలకు ఇచ్చేవాడు. ఈ ఐదుగురు రిసీవర్లు ఆ సొత్తును అమ్మి క్యాష్ చేయగా.. తమ కమీషన్ మిగుల్చుకుని మిగిలిన మొత్తం సలీంకు అప్పగించేవాళ్లు. సలీం విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా గత వారం హైదరాబాద్‌కు వచ్చిన పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ ఐదుగురు రిసీవర్లను పట్టుకుని తీసుకెళ్లారు. వీరి నుంచి రూ.36.91 లక్షల విలువైన 860 గ్రాముల బంగారం, 6.275 కేజీల వెండి తదితరాలను రికవరీ చేశారు. జైలుకెళ్లిన ప్రతిసారీ కొత్త గ్యాంగ్.. దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో వెయ్యి వరకు చోరీలు చేసిన బాంబే సలీం అత్యధిక నేరాలు ఒంటరిగానే చేశాడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ముఠా కట్టి రంగంలోకి దిగుతాడు. ఏ సందర్భంలోనూ ఒకసారి వాడిన ముఠా సభ్యుల్ని మరోసారి వినియోగించడు. వీరి ద్వారా తమ ఉనికి బయపడుతుందనే ఉద్దేశంలోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2012లో సైబరాబాద్ పోలీసులకు చిక్కినప్పుడు బెంగళూరుకు చెందిన ఆసిఫ్‌తో కలిసి నేరాలు చేసినట్లు వెల్లడైంది. ఇతగాడిని 2017లో గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడితో పాటు ముఠా కట్టిన రవీంద్ర ఎస్ థైడే, ప్రకాష్ బి సన్వానేలను పట్టుకున్నారు. ఆ దఫా ఈ త్రయం మొత్తం 200 చోరీలు చేసినట్లు తేల్చారు. ఆ ఏడాది మార్చ్ 11 రాత్రి సూరత్‌కు చెందిన వ్యాపారి విపుల్ రాశ్యా ఇంటిపై పంజా విసిరిన ఈ ముగ్గురూ భారీగా బంగారం, వజ్రాలతో పాటు ఆయన కారును తస్కరించారు. ఈ వాహనానికి జీపీఎస్ పరిజ్ఞానం ఉండటంతో ఆ విషయాన్ని యజమాని పోలీసులకు తెలిపాడు. దీని ద్వారా దర్యాప్తు చేసిన సూరత్ పోలీసులు ఖురేషీ ఆచూకీ హైదరాబాద్‌లో కనుగొని అదే నెల 16న అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. ఇతడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఇద్దరినీ పట్టుకుని కారు, సొత్తు రికవరీ చేశారు. తాజాగా పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇషావర్తో కలిసి నేరాలు చేస్తూ చిక్కాడు. చోరీలకు పోలీసు సహకారం... బాంబే సలీం వ్యవహారంలో ఇప్పటివరకూ లేని కొత్త కోణాన్ని పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెలికితీశారు. జైలుకు వెళ్లినప్పుడల్లా పాత దొంగలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, బయటకు వచ్చాక వారికీ బెయిల్ ఇప్పించడం, వారితోనే ముఠా కట్టి దొంగతనాలు చేయడం.. ఈ పంథాలోనే సలీం నేరాలు చేస్తూ వచ్చాడు. ఇతడి కోసం దాదాపు రెండు నెలలకుపైగా గాలించిన పుణె పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఫలితంగానే సలీంకు ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్ సహకరిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీరిద్దరికీ 2018లో పరిచయం అయినట్లు భావిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ ఎలా సహకరిస్తున్నాడు? ఎందుకు ఆ పని చేస్తున్నాడు? తదితర అంశాలను ఆరా తీస్తున్నారు. మరోపక్క బాంబే సలీంపై నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో 2006 నుంచి కేసులు నమోదయ్యాయి. రాయదుర్గం, పంజగుట్ట, బాలానగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, నేరేడ్మెట్, సరూర్‌నగర్, శంషాబాద్, చైతన్యపురి, చందానగర్, మల్కాజిగిరి, మైలార్‌దేవ్‌పల్లి, మీర్‌పేట, కుషాయిగూడ, అల్వాల్ ఠాణాల్లో ఇవి ఉన్నాయి. 2000 సంవత్సరంలో గుంటూరులో వాహన చోరీ కేసు రిజిస్టర్ అయింది. ప్రస్తుతం సలీం పుణె పోలీసులకు చిక్కడంతో ఈ ఠాణాల అధికారులు అప్రమత్తమయ్యారు. తమ వద్ద నమోదైన కేసుల పరిస్థితి ఏంటి? నాన్– బెయిబుల్ వారెంట్లు జారీ అయ్యాయా? తదితర అంశాలు పరిశీలిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చోరీ కేసుల్లోనూ ఇతడి పాత్రపై ఆరా తీస్తున్నారు. -
మాఫియా డాన్ ఇంట్లోనూ చోరీ..
సాక్షి, సిటీబ్యూరో: సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఖరీదైన కార్లలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ బాంబే సలీం పూణే క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడు. గతంలో ముంబై మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లోనే చోరీ సంచలనం సృష్టించిన ఈ ఘరానా నేరస్తుడిపై దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. పలు నగరాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఇతడికి హైదరాబాద్‌తో పాటు ముంబైలోనూ ఇల్లు ఉంది. తాజాగా 127 చోరీ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అతడిని పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని గతంలో 2012 ఫిబ్రవరి 28న రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇద్దరూ కలిసి దొంగతనాలు... అప్పటి నుంచి ఇద్దరూ కలిసి వివిధ నగరాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ ఇంటిని టార్గెట్ చేసుకున్న తర్వాత ప్రత్యేకమైన ఉపకరణాలతో తాళాలు, డోర్లు పగులకొట్టి ఖరేషీ లోపలకు వెళ్తాడు. ఇషావర్ పెప్పర్ స్ప్రే చేత పట్టుకుని బయట కాపుకాసేవాడు, ఎవరైనా ఇంటిలోకి కానీ, తమ సమీపంలోకి కానీ రావడానికి ప్రయత్నిస్తే వారి ముఖంపై స్ప్రే చేయడంతో పాటు ఖురేషీని అప్రమత్తం చేస్తాడు. ఆపై ఎదుటి వారు తేరుకునే లోపు ఇద్దరూ కలిసి పరారయ్యేవారు. పుణేలో మొత్తం 30 పోలీసుస్టేషన్లు ఉండగా... వాటిలోని 27 ఠాణాల పరిధిలో ఖురేషీ ద్వయం పంజా విసిరింది. దీంతో అతడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ ఆధీనంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు నెలల పాటు శ్రమించిన పోలీసులకు గత వారం ఖురేషీ పుణే విమానాశ్రయం వద్ద సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్నిన అధికారులు నల్లరంగు లాన్సర్ కారులో తిరుగుతున్న అతడితో పాటు అతడి సహాయకుడు ఇషావర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరు హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ఈ వివరాలు రాబట్టడానికి కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్ప టి వరకు ఖురేషీ, ఇషావర్లు 127 చోరీలు చేసినట్లు అంగీకరించడంతో పూణే క్రైంబ్రాంచ్ ఆయా నగరాలకు సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా పీటీవారెంట్లు వేసుకుని అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పొరపాటున చోటా రాజన్ ఇంట్లో... ముంబైలోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్‌లోని డియోనార్ బుచ్చర్ హౌస్‌కు చెందిన సలీం అలీ హుస్సేన్ ఖాన్ ఆరో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఇతడికి బాంబే సలీం, మున్న ఖురేషీ, మహ్మద్ హమీద్ హబీబ్ ఖురేషీ తదితర మారుపేర్లు ఉన్నాయి. ముంబైలో చిన్న చిన్న చోరీలకు శ్రీకారం చుట్టిన అతను 2000 నుంచి ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2001లో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన బాంబే సలీం గ్యాంగ్ అదే రోజు రాత్రి ఆ ఇంట్లోకి ప్రవేశించి తమ ‘పని’ పూర్తి చేసుకుంది. మరుసటి రోజు పత్రికలు చూసిన సలీం షాక్‌కు గురయ్యాడు. తాను చోరీ చేసింది మాఫియా డాన్ చోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలుసుకుని ఖంగుతిన్నాడు. కొన్నాళ్ల తర్వాత ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడం, వారు తన అనుచరులపై దాడి చేయడంతో భయపడిన సలీం జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే రాజన్ అనుచరులను కలిసి జరిగింది చెప్పి ముంబై వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. అనంతరం అతను తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్‌లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ గ్యాంగ్‌ను విడిచి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరులో విక్రయించేవాడు. ఇతడి కోసం గాలింపు చేపట్టిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో అతడిని అరెస్టు చేశారు. ‘నేను పుణేలో తప్ప బెంగళూరులో ఎలాంటి నేరాలు చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎలా పట్టుకుంటారు?’ అంటూ బెంగళూరు పోలీసులను ప్రశ్నించడంతో వారు నివ్వెరపోయారు. అలా బెంగళూరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన సలీం ఆ తర్వాత అక్కడా పంజా విసిరాడు. కొన్నాళ్లకు అతను మరో పెళ్లి చేసుకున్నాడు. సిటీలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్... కేసుల సంఖ్య పెరగడం, నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో బెంగళూరు, పుణే, ముంబై పోలీసుల కళ్లు కప్పేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చిన సలీం ఇక్కడా చేతులకు పని చెప్పి పోలీసులకు దొరికిపోయాడు. ఈ రకంగా సిటీతో పరిచయం ఏర్పడిన సలీం 2010లో తన ఇద్దరు భార్యలతో హైదారాబాద్‌కు వచ్చి వేర్వేరు ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాడు. కొన్నాళ్ల పాటు టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించాడు. అందులో నష్టాలు రావడంతో మళ్లీ చోరీల బాటపట్టిన అతను చందానగర్, బాలానగర్, ఉప్పల్, కుషాయిగూడ, అల్వాల్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సరూర్‌నగర్, శివరామ్‌పల్లి, చైతన్యపురి, శంషాబాద్, రాయదుర్గం, మీర్పేట్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పంజా విసిరాడు. మధ్య మధ్యలో పుణే, ముంబైలకు వెళ్తూ అందినకాడికి దండుకు వచ్చేవాడు. ఈ రకంగా రెండు రాష్ట్రాల్లోనూ 20 వరకు నేరాలు చేశాడు. అతడిపై సుదీర్ఘకాలం నిఘా ఉంచిన రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు 2012లో అతడిని పట్టుకున్నారు. అప్పట్లో ఇతడి నుంచి రూ.56,27,500 విలువైన 1.58 కేజీల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. కాగా బాంబే సలీంకు ముంబైతో పాటు హైదరాబాద్‌లోని రాఘవకాలనీలోని షాదత్ రెసిడెన్సీలోనూ ఇళ్లు ఉన్నాయి. ఇద్దరు భార్యల్లో ఒకరు ముంబైలో, మరొకరు సిటీలో ఉంటున్నారు. 2018 ఆగస్టు నుంచి ముంబైతో పాటు పుణె, నాసిక్, నాగ్‌పూర్, నవీ ముంబై, థానేల్లో 127 చోరీలు చేశాడు. హైదరాబాద్‌లోనూ కొన్నిచోట్ల పంజా విసిరినట్లు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో వచ్చే ఖురేషీ ఆయా నగరాల్లో స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఖరీదైన కారును కొనుగోలు చేసే ఇతను రిజిస్ట్రేషన్‌ను తన పేరుతో మార్చుకోకుండానే అదే కారులో తిరుగుతూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి అనువైన ఇంటికి కన్నం వేస్తాడు. పుణేలోని భారతి విద్యాపీఠ్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో ఖురేషీని అక్కడి పోలీసులు 2018 జూలైలో అరెస్టు చేసి యరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు నెల రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన ఖురేషీ జైల్లో తనకు పరిచయమైన యరవాడలోని షామీఅలీ ప్రాంతానికి చెందిన ఇషావర్ అలియాస్ చింత్యా షిండేవాల్ అనే దొంగకు బెయిల్ ఇప్పించాడు. -
సలీం.. అనార్కలీ
మొఘల్ సామ్రాట్ అక్బర్ కుమారుడైన సలీం ఓ రోజు దానిమ్మ తోటలో ఉండగా ఓ అమ్మాయిని చూస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. తాను యువరాజునని చెప్పకుండా ఆమెతో స్నేహం చేస్తాడు. ఆ యువతి పేరు నదిరా బేగం. ఆమె కూడా సలీంతో ప్రేమలో పడుతుంది. ఓ సారి నదిరా బేగం గాన నాట్యాలకు ముగ్దుడైన అక్బర్ ఆమెను ఆస్థాన నర్తకిగా ఆహ్వానిస్తాడు. దానిమ్మ తోటలో(అనార్ అంటే హిందీలో దానిమ్మ) కనిపించింది గనుక అనార్కలి అనే బిరుదునిస్తాడు. సలీం మేనమామ సైన్యాధిపతి మాన్‌సింగ్‌కు అల్లుడి ప్రేమ విషయం తెలుస్తుంది. అనార్కలిని మరచిపొమ్మని మాన్సింగ్ హెచ్చరిస్తాడు. సలీం వినకపోయే సరికి అతడిని తనతో పాటు యుద్ధానికి తీసుకుపోతాడు. అక్కడ శత్రువులు బానిసల స్థావరంపై దాడి చేసి అనార్కలిని తీసుకుపోయి వేలానికి పెడతారు. అప్పుడు సలీం ఆమెను తన వెంట తెచ్చుకుంటాడు. తర్వాత సలీం యుద్దంలో గాయపడితే అనార్కలి సపర్యలు చేసి అతన్ని కాపాడుకుంటుంది. అయితే సలీం మామూలు సైనికుడు కాదని అక్బర్ కొడుకని తెలుసుకుంటుంది. అనార్కలి తక్కువ కులంలో పుట్టిన యువతి. తక్కువ కులం వారితో ఏటువంటి సంబంధమైనా అప్పటి సమాజంలో నిషిద్ధం. సలీంతో ప్రేమ వ్యవహారం అక్బర్ మహారాజుకు నచ్చదన్న విషయం అనార్కలికి తెలుసు. అయినప్పటికి సలీంకు దూరంగా ఉండలేకపోతుంది. వీరి ప్రేమ విషయం అక్బర్‌కు తెలిసిపోతుంది. తన కొడుకు ఓ సాధారణ నాట్యకత్తెతో ప్రేమలో పడటం అక్బర్ జీర్ణించుకోలేకపోతాడు. అనార్కలిని సలీం దృష్టిలో పడకుండా చేయటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న అనార్కలి సమాధి విషయం తెలుసుకున్న సలీం కన్న తండ్రిపైనే యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో సలీం ఓడిపోతాడు. అతడికి మరణశిక్ష పడుతుంది. తన ప్రియుడ్ని మరణం నుంచి తప్పించటానికి అనార్కలి తన ప్రేమను.. ప్రాణాలను పణంగా పెడుతుంది. అక్బర్.. సలీం కళ్లముందే ఆమెను సజీవంగా ఇటుకలతో సమాధి చేయిస్తాడు. అనంతరం తన కుమారుడిని ప్రాణాలతో వదలిపెడతాడు. -
ఆట ఆరంభం
‘ఆటగదరా శివ’ చిత్రం ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్ ఆంటోనీతో తమిళంలో ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్.వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం. ఐశ్వర్య రాజేష్ కథానాయిక. అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కథా చిత్రమిది. ఆంధ్ర, తెలంగాణతో పాటు విదేశాల్లోనూ షూటింగ్ జరపనున్నాం. ఏప్రిల్‌కి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, కిరణ్, శరత్ మరార్, దర్శకులు చంద్ర సిద్ధార్థ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కెమెరా: గణేష్ చంద్ర. -
ఓటమి భయంతోనే ముందస్తుకు: సలీమ్ అహ్మద్
సాక్షి, యాదాద్రి: ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి సలీమ్ అహ్మద్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటనకు వచ్చిన స్పందనతో కేసీఆర్‌లో అభద్రతాభావం నెలకొందన్నారు. రాహుల్‌గాంధీపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. నరేంద్ర మోదీని పదేపదే ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్టమైన ప్రణాళిక ఉందని, దాని ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. పొత్తులపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాల మేరకే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో పీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మీడియాపై కోర్టుకెక్కిన పోలీస్
న్యూ ఢిల్లీ: తాగిన వ్యక్తిలా ఊగుతూ ఢిల్లీ మెట్రో రైలులో కిందపడ్డ కానిస్టేబుల్ వీడియో గత ఏడాది హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు అతను అసలు మద్యం తీసుకోలేదని, ఆరోగ్య సమస్య కారణంగానే అలా తూలిపడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. వీడియో బయటకు వచ్చినప్పుడు తనను అప్రతిష్టపాలు చేయడానికి మీడియా చూపించిన చొరవ, తాను తప్పు చేయలేదని నిర్ధారణ అయిన తర్వాత చూపించకపోవడంతో ఇప్పుడు సలీం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. వివరాలు..ఢిల్లీ మెట్రోరైలులో కానిస్టేబుల్‌గా విధి నిర్వహణలో ఉన్న పీకే సలీం తప్ప తాగి తూలుతూ ఉన్నట్టు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వీడియోకు 2లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. దీంతో అతనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన పోలీసులు సలీంను సస్పెండ్ చేశారు. అయితే తాను మద్యం సేవించలేదని సలీమ్ చెప్పడంతో మరోసారి విచారణ చేపట్టారు. ఆ రోజు సలీమ్ తాగలేదని, ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే ఆ ఘటన జరిగిందని పోలీసుల ధ్రువీకరించారు. దీంతో అతడిని గత నవంబర్‌లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ వార్త మీడియాలో ఎక్కడా రాలేదు. 'ఆ వీడియో వల్ల సలీం సస్పెండ్ అయ్యాడు. అప్పుడు అన్ని పత్రికల్లో ముందు పేజీల్లో వేశాయి. కానీ సలీం ఆ రోజు తాగిలేడు అని నిర్ధారణ అయిన తర్వాత ఎవరూ ఆ వార్తని ప్రచురించలేదు. ప్రజల దృష్టిలో అతను ఇంకా సస్పెండ్ అయ్యే ఉన్నాడు.' అని సలీం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ఆ వీడియో వల్ల తనకు చెడ్డపేరు వచ్చిందంటూ ఇప్పుడు సలీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు పరువునష్టం అందించాలని కోరాడు. -
మహిళలను హతమార్చిన నిందితుడి అరెస్ట్
మెదక్ : నగల కోసం అయిదురు మహిళలను హతమార్చి, అనంతరం దహనం చేసిన కేసులకు సంబంధించి నిందితుడిని సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సలీంతో పాటు హత్యలకు సహకరించిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 13 తులాల బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా జిల్లాలో ఐదుగురు మహిళలు హత్యగావించబడిన విషయం తెలిసిందే. కాగా సలీంను పోలీసులు వారం రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే విచారణ అనంతరం శనివారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నగల కోసమే మహిళలను హత్యచేసి, దహనం చేసినట్లు సలీం విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా హత్యగావించబడిన మహిళలు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ప్రేమించలేదని యువతి కిడ్నాప్
'స్నేహితులతో కలసి అంబులెన్స్‌లో తీసుకెళ్లిన వైనం 'బంగారుపాళెంలో చోటుచేసుకున్న ఘటన ' కిడ్నాప్‌ను పలమనేరులో ఛేదించిన పోలీసులు పలమనేరు, న్యూస్‌లైన్: ప్రేమించలేదని యువతిని కిడ్నా ప్ చేసిన ఘటన శుక్రవారం పలమనేరులో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పలమనేరు అర్బన్ సీఐ బాలయ్య కథనం మేరకు.. బంగారుపాళెంలోని జెండా వీధికి చాంద్‌బాషా కొన్ని ప్రయివేటు అంబులెన్స్‌లను నిర్వహిస్తూ, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటి ముందు ఉన్న యువతి(23)ని ప్రేమించాడు. ఇతనికి పెళ్లై పిల్లలూ ఉం డడంతో ఆమె అతని ప్రేమను అంగీకరించలేదు. ఇదిలావుండగా ఆ యువతికి ఇటీవలే పెద్దలు వేరొకరితో పెళ్లిచేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న చాంద్‌బాషా శుక్రవారం ఉదయం ఆమె తన ఇంటి నుంచి పాఠశాల సమీపంలో వెళ్తుండగా తన స్నేహితులు సలీమ్, సన్నులతో కలిసి అంబులెన్స్‌లో బలవంతంగా ఎక్కించుకుని పరారయ్యేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ యువతి కేకలు విన్న స్థానికులు బంగారుపాళెం పోలీసులకు సమాచా రం అందించారు. ఇంతలో చాంద్‌బాషా అంబులెన్స్‌ను పలమనేరు వైపు మళ్లించాడు. స్థానిక పోలీసులూ ఆ వాహనాన్ని వెంబడిస్తూ పలమనేరు పోలీసులకు సమాచారం అందించారు. పలమనేరు అర్బన్ సీఐ బాలయ్య తన సిబ్బందిని అప్రమత్తం చేసి పట్టణంలో ని ప్రధాన రహదారుల్లో నిఘా పెట్టారు. గంటావూరు, రంగబాబు సర్కిల్ ప్రాం తాల వైపు అంబులెన్స్ వస్తుందని ఊ హించారు. అదే ప్రాంతానికి రెండు అం బులెన్స్‌లు రావడంతో వాటిని వెంబ డించారు. ఆ రెండు వాహనాల్లో రోగు లు ఉండడంతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో పట్టణ పొలిమేర్లలోని గాంధీనగర్ మీదుగా ఓ అంబులెన్స్ వస్తోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు వాహనాలు కాకాతోపు ప్రాంతానికి చేరాయి. అక్కడ సుమారు గంట పాటు సినిమా షూటింగ్‌ను తలపించేలా అంబులెన్స్‌ను చేజ్ చేశారు. స్థానికులూ ద్విచక్రవాహనాలపై అంబులెన్స్‌ను వెంబడించారు. ఎట్టకేల కు పట్టణ సమీపంలోని చిన్నూరు రోడ్డు వద్ద అంబులెన్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. అప్పటికే ఆ వాహనంలో నుంచి సన్ను దూకి పరారయ్యాడు. అందులో ఉన్న చాంద్‌బాషా, సలీమ్, కిడ్నాప్‌నకు గురైన యువతిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇంతలో బంగారుపాళెం నుంచి వచ్చిన బాధితురాలి బంధువులు స్టేషన్‌కు చేరుకున్నారు. కిడ్నాప్ ఘటన బంగారుపాళెంలో జరిగింది కాబట్టి నిందితులను అక్కడి పోలీసులకు అప్పగించి కేసు నమోదు అక్కడే చేయిస్తున్నట్లు సీఐ తెలిపారు.