మీడియాపై కోర్టుకెక్కిన పోలీస్
న్యూ ఢిల్లీ:
తాగిన వ్యక్తిలా ఊగుతూ ఢిల్లీ మెట్రో రైలులో కిందపడ్డ కానిస్టేబుల్ వీడియో గత ఏడాది హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు అతను అసలు మద్యం తీసుకోలేదని, ఆరోగ్య సమస్య కారణంగానే అలా తూలిపడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. వీడియో బయటకు వచ్చినప్పుడు తనను అప్రతిష్టపాలు చేయడానికి మీడియా చూపించిన చొరవ, తాను తప్పు చేయలేదని నిర్ధారణ అయిన తర్వాత చూపించకపోవడంతో ఇప్పుడు సలీం సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
వివరాలు..ఢిల్లీ మెట్రోరైలులో కానిస్టేబుల్గా విధి నిర్వహణలో ఉన్న పీకే సలీం తప్ప తాగి తూలుతూ ఉన్నట్టు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వీడియోకు 2లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. దీంతో అతనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన పోలీసులు సలీంను సస్పెండ్ చేశారు. అయితే తాను మద్యం సేవించలేదని సలీమ్ చెప్పడంతో మరోసారి విచారణ చేపట్టారు. ఆ రోజు సలీమ్ తాగలేదని, ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే ఆ ఘటన జరిగిందని పోలీసుల ధ్రువీకరించారు. దీంతో అతడిని గత నవంబర్లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ వార్త మీడియాలో ఎక్కడా రాలేదు.
'ఆ వీడియో వల్ల సలీం సస్పెండ్ అయ్యాడు. అప్పుడు అన్ని పత్రికల్లో ముందు పేజీల్లో వేశాయి. కానీ సలీం ఆ రోజు తాగిలేడు అని నిర్ధారణ అయిన తర్వాత ఎవరూ ఆ వార్తని ప్రచురించలేదు. ప్రజల దృష్టిలో అతను ఇంకా సస్పెండ్ అయ్యే ఉన్నాడు.' అని సలీం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ఆ వీడియో వల్ల తనకు చెడ్డపేరు వచ్చిందంటూ ఇప్పుడు సలీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు పరువునష్టం అందించాలని కోరాడు.