తొమ్మిది నెలలు నడిచాను | A story of Famous actress Helen | Sakshi
Sakshi News home page

తొమ్మిది నెలలు నడిచాను

Published Wed, Feb 22 2023 1:46 AM | Last Updated on Wed, Feb 22 2023 1:46 AM

A story of Famous actress Helen - Sakshi

సుప్రసిద్ధ నటి హెలెన్‌ గొప్ప నాట్యగత్తెగా అందరికీ తెలుసు.రచయిత సలీం భార్యగా, సల్మాన్‌ ఖాన్‌ మారుతల్లిగా కూడా తెలుసు.కాని ఆమెకు ఒక వెంటాడే గతం ఉంది.తన కుమారుడు అర్బాజ్‌ ఖాన్‌ చేస్తున్న తాజా షోలోఆమె ఆ గతాన్ని గుర్తు చేసుకుంది.ఆ జ్ఞాపకాలు కదిలించేవిగా ఉన్నాయి.

‘నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే, సినిమాల్లో నిలబడ్డానంటే దానికి మా అమ్మే కారణం. ఆమె చాలా ఆత్మస్థయిర్యం ఉన్న స్త్రీ’ అని గుర్తు చేసుకున్నారు 84 ఏళ్ల హెలెన్‌. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే హెలెన్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ టాక్‌ షో ‘ది ఇన్‌విన్సిబుల్స్‌’లోపా ల్గొని మాట్లాడింది. ఆ సందర్భంగా తన బాల్యాన్ని, తల్లిని గుర్తు చేసుకుంది.

‘మా అమ్మది బర్మా (మయన్మార్‌). నాన్న ఆంగ్లో ఇండియన్‌. నేను పెద్దదాన్ని. నా తర్వాత తమ్ముడు. చెల్లెలు. 1943లో అమ్మ గర్భంతో ఉండగా నాన్న చనిపోయాడు. అప్పుడే బర్మాను జపాన్‌ ఆక్రమించింది. అంతటా రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు. బర్మాలో ఉండే పరిస్థితి లేదు. ఆ సమయానికి నాకు ఆరేళ్లు. అమ్మ నన్ను తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని ఇండియా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళితే సరిగ్గా మేము వెళ్లే సమయానికి జపాన్‌ విమానాలు వచ్చి బాంబులు వేశాయి.

ఇక విమానంలో వెళ్లే పరిస్థితి లేదు. దాదాపు 350 మంది నడక ద్వారానే ఇండియాకు బయలుదేరాం. అమ్మ ప్రెగ్నెంట్‌ అయినా భయపడక నన్ను, తమ్ముణ్ణి, చెల్లెల్ని తీసుకుని ఆ బిడారులో బయలుదేరింది. 9నెలలపా టు నడిచాం. దారిలోని పల్లెల్లో కొంతమంది మాకు అన్నం పెట్టేవాళ్లు. బ్రిటిష్‌ సైనికులు కనిపించి తినడానికి ఇచ్చేవారు. దారిలో అమ్మకు అబార్షన్‌ అయ్యింది. చెల్లెలు చనిపోయింది. నేను, తమ్ముడు ఎముకల గూడుగా మారాం. ఇండియా చేరేనాటికి 350 మందిలో సగం మందిమే మిగిలాం. మేము మొదట అస్సాంకు తర్వాత కోల్‌కతాకు చేరాం. ఆ తర్వాతే బాంబే వచ్చి స్థిరపడ్డాం’ అని చెప్పిందామె.

మరి సినిమా రంగానికి ఎలా వచ్చారు అని అర్బాజ్‌ అడగగా– ‘బాంబేలో మేమున్న ఇంటి ఎదురుగా ఒక మణిపూరి డాన్సర్‌ ఉండేది. ఆమె దగ్గర అమ్మ నాకు మణిపురి నేర్పించింది. ఆ రోజుల్లో కుకూ అనే డాన్సర్‌ సినిమాల్లో ఫేమస్‌. ఆమెకు అమ్మతో స్నేహం కుదిరింది. ఆమెలా నేనూ డాన్సర్‌ అవ్వాలని అమ్మ అనుకుంది. కుకు నన్ను సినిమాల్లోకి గ్రూప్‌ డాన్సర్‌గా తీసుకెళ్లింది. దేవ్‌ ఆనంద్‌ నటించిన ‘బారిష్‌’ (1957)లోని ‘మిస్టర్‌ జాన్‌ బాబాఖాన్‌’పా టతో ఐటమ్‌ గర్ల్‌గా మారాను. ‘హౌరాబ్రిడ్జ్‌’ (1958)లోని ‘మేరా నామ్‌ చిన్‌ చిన్‌ చూ’పా టతో నాకు స్టార్‌డమ్‌ వచ్చింది’ అని చెప్పిందామె.

‘మా నాన్న (రచయిత సలీం ఖాన్‌)తో మీ స్నేహం ప్రేమ, పెళ్లి దాకా ఎలా దారి తీసింది’ అని అర్బాజ్‌ అడగగా ‘1970లో నా ఆస్తి మొత్తం పోయింది (హెలెన్‌ మొదటి భర్త పి.ఎన్‌.అరోరా వల్ల). కోర్టు కేసుల్లో చిక్కుకున్నాను. ఆ సమయంలో మీ నాన్న నా ఇబ్బందిని గమనించి తాను రాసే సినిమాల్లో నాకు వేషాలు వచ్చేలా చూశాడు. అలా ప్రేమ ఏర్పడింది.

పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా కోసం ఆయన తన కుటుంబం నుంచి విడిపోయి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ కలసి ఉండేలా చూడమని గట్టిగా కోరాను. మీ అమ్మ (సల్మా ఖాన్‌), మీరు ఆ రోజుల్లో ఎక్కువ వేదన అనుభవించి ఉంటారు. నేనైతే మీ అమ్మకు ఎదురుపడటానికి కూడా భయపడేదాన్ని. ఏమైనా కొన్నాళ్లకు మీరంతా నన్ను యాక్సెప్ట్‌ చేశారు. నన్ను హెలెన్‌ ఖాన్‌గా గౌరవించారు. సల్మా, నేను మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. అర్పిత (సల్మాన్‌ చెల్లెలు) పెళ్లిలో శుభలేఖలో నా పేరు కూడా వేశారు.  ఇంతకన్నా ఏం కావాలి?’  అందామె.         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement