ఖురేషి
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ/జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ ఎట్టకేలకు సత్యం తెలుసుకుంది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఐరాసతోపాటు అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడం అసాధ్యమని తెలుసుకుంది. ఈ విషయం స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ మాటల్లోనే తెలిపోయింది. కశ్మీర్‌పై భ్రమల్లో జీవించడం ఆపేయాలని ఆయన స్వదేశీయులకు హితవు పలికారు. మంగళవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ ఐరాస మద్దతు పొందేందుకు కొత్తగా పోరాటం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ‘మీరు (ప్రజలు) భ్రమల్లో జీవించడం మానేయాలి.
మీ కోసం ఐక్యరాజ్యసమితిలో పూలదండలు పట్టుకుని సిద్ధంగా ఎవరూ లేరు. అక్కడ ఎవరూ మీకోసం ఎదురుచూడటం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుంది. కోట్లాది మంది జనాభా ఉన్న దేశం భారత్. చాలా దేశాలు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి. ముస్లిం దేశాలు మన వెనుకే ఉంటాయని మనం తరచూ అనుకుంటుంటాం. కానీ, వారికీ భారత్‌తో అనేక ఆర్థిక స్వయోజనాలున్నాయి. అందుకే, ముస్లిం దేశాలు కశ్మీర్ విషయంలో మనకు మద్దతు ఇవ్వకపోవచ్చు..’ అంటూ ప్రత్యేకంగా ఏ దేశం పేరునూ ప్రస్తావించకుండా ఆయన పేర్కొన్నారు. అత్యంత సన్నిహిత దేశం చైనా కూడా భారత్, పాక్‌లు రెండూ పొరుగుమిత్రులంటూ చర్చల ద్వారానే విభేదాలను పరిష్కరించుకోవాలనడం తెలిసిందే.
దీటుగా స్పందిస్తాం: ఆర్మీ చీఫ్
జమ్మూకశ్మీర్‌లో పరిణామాల నేపథ్యంలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాక్ అదనపు బలగాలను మోహరించిందన్న వార్తలపై భారత్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. ‘గత కొద్ది రోజులుగా ఎల్‌వోసీ వెంట పాక్ బలగాల సంఖ్య పెరిగినా దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని తెలిపారు.
సరిహద్దులో భారత జవాను పహారా
దశలవారీగా ఆంక్షల సడలింపు
‘ప్రాణనష్టం నివారించేందుకే ప్రజలకు అసౌకర్యం కలిగించక తప్పడం లేదు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా దశలవారీగా ఆంక్షల సడలింపు చర్యలు చేపట్టే అధికారం స్థానిక యంత్రాంగానికే ఇచ్చాం’అని జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సల్ తెలిపారు.
జమ్మూలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్
అక్టోబర్ 12 నుంచి శ్రీనగర్‌లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించనున్నట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం ప్రకటించింది.
కాల్పులు అబద్ధం: హోం శాఖ
ఈ నెల 9న శ్రీనగర్ శివారులోని సౌరాలో ప్రజలపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయంటూ వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. కశ్మీర్లో ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని స్పష్టం చేసింది. ‘9వ తేదీన సౌరాలోని మసీదు నుంచి ప్రార్థనలు చేసి వస్తున్న వారిలో కలిసి పోయిన అల్లరిమూకలు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వి రెచ్చగొట్టేందుకు యత్నించాయి. అయితే, బలగాలు సంయమనం పాటించాయి. ఎటువంటి కాల్పులు జరగలేదు’ అని హోం శాఖ తెలిపింది. అయితే, ప్రభుత్వం చెబుతున్నట్లుగా కశ్మీర్లో అంతా ప్రశాంతంగా లేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భద్రతాదళాలకు చెందిన పెల్లెట్ గన్ గాయాలతో శ్రీనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నపిల్లల ఉదంతాలను చూపుతున్నాయి. ఆ ఇద్దరు చిన్నారుల్లో ఒకరు సోమవారం గాయపడగా, మరో బాలిక గత వారం గాయపడినట్లుగా పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment