సాక్షి, అమరావతి : విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమై నప్పుడు బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సేంజ్)లో అధిక ధర వెచ్చించైనా సరే విద్యుత్‌ను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే డిస్కంలపై ఆర్థిక భారం పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పవర్ ఎక్స్చేంజి లో ప్రస్తుతం యూనిట్ విద్యుత్ గరిష్ట ధర రూ.12గా ఉన్న సీలింగ్‌లో మార్పులు చేస్తూ కొన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరేలా యూనిట్ ధరను రూ.50గా నిర్ణయిస్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్‌సీ) తాజాగా ఆదేశాలు జారీచేసింది.
ప్రస్తుతానికి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్‌లకు మాత్రమే ఈ రేటు వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో బొగ్గు కొరత, విద్యుత్ డిమాండ్‌వల్ల అన్ని జెన్‌కోలు ఇదే ధరకు విద్యుత్ అమ్ముతామని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఇంధనరంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు అనేది డిస్కంలకు పెనుభారంగా మారుతుంది. ట్రూ అప్ ఛార్జీలుగా అంతిమంగా ఈ భారం ప్రజలపైనే పడుతుంది.
అప్పుడే భారమనుకుంటే..
2021 అక్టోబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు కొరతతో భారత్‌లోనూ తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో బొగ్గు నిల్వలు కూడా నిండుకోవడంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి లో నడపలేక బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను గరిష్టంగా రూ.20 పెట్టి కొని వినియోగదారులకు అందించారు.
గతేడాది వేసవిలోనూ ఇదే పరిస్థితి రావడంతో యూని ట్ ధర రూ.20 దాటింది. దీంతో దేశ వ్యాప్తంగా డిస్కంలు ఆందోళన వ్యక్తంచేయడంతో సీఈఆర్సీ రంగంలోకి దిగి విద్యుత్ అమ్మకం గరిష్ట ధర రూ.12 మించకూడదని ఆదేశాలు (సీలింగ్) జారీచేసింది. తాజాగా.. ఆ ఆదేశాలను సవరించి యూనిట్ రూ.50 రూపాయల వరకు విక్రయించుకోవడానికి అనుమతిచ్చింది.
రాష్ట్రంలో రోజుకు 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటే ఇందులో దాదాపు 30 మిలియన్ యూనిట్లు బయటి నుంచే కొంటున్నారు. ఇందుకోసం రోజూ రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఖర్చుచేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ అమ్మకం ధర యూనిట్ రూ.9 వరకూ ఉంది. ఈ నెలలో డిమాండ్ 240 మిలియన్ యూనిట్లు, వచ్చే నెలలో 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఇంధన శాఖ ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఈ లెక్కన బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను అధిక ధరకు అదనంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది.
ఇలా అయితే కష్టమే..
కొన్నేళ్లుగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆధునిక సాంకేతికత(ఎనర్జీ ఫోర్‌కాస్ట్)ను ఉపయోగించుకుని బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్ లభించే సమయాన్ని ముందుగానే అంచనా వేసి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ విధంగా 2021లో రూ.4,925 కోట్లు ఆదా చేశాయి. ఈ మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా 2021–22లో రూ.3,373 కోట్లను ట్రూ డౌన్ చేస్తూ ఆంధ్ర్ర పదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది.
కానీ, బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల కారణంగా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత వి ద్యుత్ పంపిణీ సంస్థలు 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకున్న దానికి మించి మూడు డిస్కంలు కలిపి రూ.9,029 కోట్లను విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేశాయి. నిజానికి అప్పుడు కొన్న విద్యుత్ యూనిట్ ధర సరాసరిన రూ.5.22–రూ.5.35 మాత్రమే. దానికే రూ.1,048 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాంటిది రూ.20ని దాటి రూ.50కు కొనాల్సి వస్తే డిస్కంలు ఆర్థికంగా కుదేలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment