సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలు అందించేలా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను పునరుద్ధరణ పంపిణీరంగ పథకం (ఆర్డీఎస్‌ఎస్) ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఈ మొత్తం పెట్టుబడిలో 60 శాతం కేంద్రం నుంచి గ్రాంట్‌గా పొందవచ్చని చెప్పారు.
ఆయన ఆదివారం ఇంధనశాఖ ఆధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్డీఎస్‌ఎస్ ద్వారా డిస్కంలు బలోపేతం కావడం వల్ల అన్నివర్గాల వినియోగదారులకు అధిక నాణ్యత గల విద్యుత్‌ను అందించవచ్చనితెలిపారు. విద్యుత్ సంస్థ (పవర్ యుటిలిటీస్)ల ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల తగ్గింపు, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్డ్ హైడ్రోస్టోరేజి ప్రాజెక్టులు మొదలైన వాటితోసహా అనేక రాష్ట్ర ప్రభుత్వం పథకాలను నవరత్నాల కింద విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.
తద్వారా గత మూడునెలల స్వల్ప వ్యవధిలో విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సాధించాయని చెప్పారు. 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో రూ.8,400 కోట్లు ఏటా కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చడం వల్ల డిస్కంలకు, రైతులకు ప్రయోజనమని చెప్పారు.
ఏ రైతు తమ జేబులోంచి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే బిల్లు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. 16,66,282 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని నిర్ణయించగా.. 16,55,988 కనెక్షన్లకు సంబంధించిన రైతులు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment