‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు  | Southern States Power Committee Objection on Central Govt Decision | Sakshi
Sakshi News home page

‘విద్యుత్‌’పై ఎల్‌సీ వద్దు 

Published Wed, Jul 17 2019 1:41 AM | Last Updated on Wed, Jul 17 2019 1:41 AM

Southern States Power Committee Objection on Central Govt Decision - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరంతర విద్యుత్‌ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగేలా, విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసేలా ఏకపక్ష నిబంధనలను తమపై రుద్దొద్దని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ సమన్వయ కమిటీ (ఎస్సార్పీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ) జారీ చేశాకే డిస్కంలు కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు(సీజీఎస్‌), ఇతర ప్రైవేటు విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆం దోళన వ్యక్తం చేసింది. ఎస్సార్పీసీ చైర్మన్, కర్ణాటక ట్రాన్స్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.సెల్వ కుమార్‌ నేతృత్వంలో మంగళవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆరు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల అధికారులు పాల్గొని కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ తరఫున ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ. గోపాల్‌రావుతోపాటు పలువురు విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలుపుతూ ఎస్‌.సెల్వ కుమార్‌ కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
 
లోడ్‌ సమతౌల్యతపై తీవ్ర ప్రభావం... 
దక్షిణాది రీజియన్‌లో చాలా వరకు డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ) జారీ చేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు బ్యాలెన్స్‌ నిర్వహించ డం సాధ్యం కాదని సెల్వ కుమార్‌ లేఖలో స్పస్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఎల్‌సీ జారీ చేయలేదని కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు, ప్రైవేటు ప్లాంట్ల నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తే విద్యుత్‌ సరఫరా లోడ్‌ సమతౌల్యతను పర్యవేక్షించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలతో పవర్‌ ఎక్సే్చంజీలు, స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నుంచి అత్యవసర విద్యుత్‌ కొనుగోళ్లకు మార్గాలు సైతం మూసుకుపోతాయన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తే ప్రధానంగా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడం సాధ్యం కాదన్నారు. బొగ్గు రవాణా జరిపినందుకు రైల్వేలు, బొగ్గు కంపెనీలకు సకాలంలో బిల్లులు అందేలా తీసుకొచ్చిన ఈ నిబంధనలు మంచివేనని, కానీ వాటికి ముందే డిస్కంలకు బిల్లులు అందేలా నిబంధనలు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. డిస్కంలకు బిల్లులు అందితేనే అవి విద్యుత్‌ కంపెనీలకు బిల్లులు చెల్లించగలుగుతాయని గుర్తుచేశారు. 

ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు... 
దక్షిణాదిన తీవ్ర వర్షాభావం నెలకొందని, గతేడాది ఇదే సమయానికి దక్షిణాది ప్రాంత రిజర్వాయర్లలో 6,629 మిలియన్‌ యూనిట్ల జల విద్యుదుత్పత్తికి సరిపడా నీటి నిల్వలుండగా ప్రస్తుతం 3,137 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తికి సరిపడా మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని కేంద్రం దృష్టికి సెల్వ కుమార్‌ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భారీగా థర్మల్‌ విద్యుత్‌ కొనుగోళ్లు చేయక తప్పదని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కొనుగోళ్లు సాధ్యం కావన్నారు. కేంద్రం ఇలాంటి నిబంధనలను తీసుకురావడానికి ముందే భాగస్వాములైన రాష్ట్రాల డిస్కంలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల అభిమతమని పేర్కొన్నారు. 

ఎల్‌సీ అంటే? 
డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్‌ సరఫరా చేసేందుకు రాష్ట్రాల డిస్కంలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తున్నాయి. విద్యుత్‌ కొనుగోళ్లు చేసిన 60 రోజుల్లోగా వాటికి సంబంధించిన బిల్లులను విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లిస్తున్నాయి. అయితే ఆర్థిక సమస్యల వల్ల డిస్కంలు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోవడంతో అన్ని రాష్ట్రాల్లో బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోతున్నాయి. దీంతో బొగ్గు గనుల కంపెనీలు, రైల్వేకు విద్యుదుత్పత్తి కంపెనీలు సైతం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్నాయి. డిస్కంల నుంచి ఎప్పటికప్పుడు విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లులు అందేలా ముందుగానే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌లను జారీ చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. విద్యుత్‌ కొనుగోళ్లకు ముందుగానే ఆ మేర డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసి ఎల్‌సీని విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డిస్కంలకు విద్యుత్‌ సరఫరా కానుంది. అయితే కొనుగోలు చేసిన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసి, నెలా రెండు నెలల తర్వాత వాటికి సంబంధవించిన బిల్లులను వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటేనే డిస్కంలకు ఆదాయం వస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement