Central Electricity Authority
-
కరెంటుకు కటకట
న్యూఢిల్లీ: మండే ఎండలతో ఓవైపు అల్లాడుతున్న జనానికి కరెంటు కోతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, యూపీ సహా 16కి పైగా రాష్ట్రాల్లో డిమాండ్ పీక్స్‌కు చేరింది. సరిపడా కరెంటు పంపిణీ చేయలేకపోవడంతో గంటల తరబడి కోతలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం భారీగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు దేశ చరిత్రలోనే అత్యధికంగా 207.11 గిగావాట్లకు చేరిందని కేంద్ర విద్యుత్ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం చేతగానితనమే విద్యుత్ సంక్షోభానికి కారణమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి దుయ్యబట్టారు. ‘‘మోదీ జీ! దేశమన్నా, ప్రజలన్నా మీకు అస్సలు పట్టదా?’’ అంటూ నిలదీశారు. ఇకనైనా విద్వేషపు బుల్డోజర్లను ఆపి విద్యుత్కేంద్రాలను నిరంతరాయంగా నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీలో ఒక్క రోజు బొగ్గు నిల్వలే థర్మల్ విద్యుత్‌పైనే అత్యధికంగా ఆధారపడ్డ నేపథ్యంలో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సకాలంలో అందక సంక్షోభం ముంచుకొచ్చింది. ఢిల్లీలో ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గు అందకుంటే ఆస్పత్రులకు, మెట్రోకు కరెంటివ్వలేమని కేజ్రివాల్ ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇప్పటిదాకా ఎలాగోలా సర్దుబాటు చేశాం. పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి’’ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపిణీకి వీలుగా 657 పాసింజర్ రైళ్లను కేంద్రం నిరవధికంగా రద్దు చేసింది. వాటికి బదులు యుద్ధప్రాతిపదికన బొగ్గు వాగన్లను రవాణా చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది. 165 థర్మల్ విద్యుత్కేంద్రాలకు గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం 56 కేంద్రాల్లో 10% బొగ్గు నిల్వలే ఉన్నాయి. 26 కేంద్రాల్లోనైతే 5% కంటే తక్కువకు పడిపోయాయి. బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా లేకుంటే నిరంతరాయ విద్యుత్ పంపిణీ వీలు పడదు. కేంద్రం వర్సెస్ కేజ్రివాల్ ఢిల్లీలో డిమాండ్ రోజుకు 6 వేల మెగావాట్లకు పెరగడంతో పంపిణీ కష్టంగా మారింది. బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెప్పగా, అదేమీ లేదంటూ ఎన్టీపీసీ ట్వీట్ చేసింది. ‘‘ఢిల్లీకి కరెంటు సరఫరా చేసే ఉంచహార్, దాద్రి విద్యుత్కేంద్రాలు 100% సామర్థ్యంతో పని చేస్తున్నాయి. బొగ్గు పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. దాద్రిలో 1.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఉంచహార్లోని ఐదు యూనిట్లలో 95 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి’’ అని చెప్పింది. -
శ్రీశైలం ప్రమాదంపై సీఈఏ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న ప్రమాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)చే విచారణ జరిపించేందుకు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమ్మతించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్.కె.సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని హైడల్ పవర్ ప్రాజెక్టులను ఆడిట్ చేసి భద్రతా లోపాలపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్టు సంజయ్ పేర్కొన్నారు. ప్రమాదానికి టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, సీఐడీ విచారణ కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని కేంద్రమంత్రికి వివరించారు. ‘నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కోడ్ నంబర్ 850 ప్రమాణాల మేరకు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు లేవు. 1998, 2009 వరదలు, 2019 అగ్నిప్రమాదం అనంతరమూ జల విద్యుత్కేంద్రంలో భద్రతా ప్రమాణాలను పెంచలేదు. ఇప్పటికైనా అత్యసవర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలి’ అని ఫిర్యాదులో సంజయ్ వివరించారు. -
‘విద్యుత్’పై ఎల్సీ వద్దు
సాక్షి, హైదరాబాద్: నిరంతర విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగేలా, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసేలా ఏకపక్ష నిబంధనలను తమపై రుద్దొద్దని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సమన్వయ కమిటీ (ఎస్సార్పీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేశాకే డిస్కంలు కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు(సీజీఎస్), ఇతర ప్రైవేటు విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటూ కేంద్ర విద్యుత్‌శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆం దోళన వ్యక్తం చేసింది. ఎస్సార్పీసీ చైర్మన్, కర్ణాటక ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.సెల్వ కుమార్ నేతృత్వంలో మంగళవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆరు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధికారులు పాల్గొని కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరఫున ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ. గోపాల్‌రావుతోపాటు పలువురు విద్యుత్ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలుపుతూ ఎస్.సెల్వ కుమార్ కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. లోడ్ సమతౌల్యతపై తీవ్ర ప్రభావం... దక్షిణాది రీజియన్‌లో చాలా వరకు డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) జారీ చేసేందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు బ్యాలెన్స్ నిర్వహించ డం సాధ్యం కాదని సెల్వ కుమార్ లేఖలో స్పస్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఎల్సీ జారీ చేయలేదని కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాలు, ప్రైవేటు ప్లాంట్ల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే విద్యుత్ సరఫరా లోడ్ సమతౌల్యతను పర్యవేక్షించడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలతో పవర్ ఎక్సే్చంజీలు, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నుంచి అత్యవసర విద్యుత్ కొనుగోళ్లకు మార్గాలు సైతం మూసుకుపోతాయన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తే ప్రధానంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదన్నారు. బొగ్గు రవాణా జరిపినందుకు రైల్వేలు, బొగ్గు కంపెనీలకు సకాలంలో బిల్లులు అందేలా తీసుకొచ్చిన ఈ నిబంధనలు మంచివేనని, కానీ వాటికి ముందే డిస్కంలకు బిల్లులు అందేలా నిబంధనలు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. డిస్కంలకు బిల్లులు అందితేనే అవి విద్యుత్ కంపెనీలకు బిల్లులు చెల్లించగలుగుతాయని గుర్తుచేశారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు... దక్షిణాదిన తీవ్ర వర్షాభావం నెలకొందని, గతేడాది ఇదే సమయానికి దక్షిణాది ప్రాంత రిజర్వాయర్లలో 6,629 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తికి సరిపడా నీటి నిల్వలుండగా ప్రస్తుతం 3,137 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి సరిపడా మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని కేంద్రం దృష్టికి సెల్వ కుమార్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భారీగా థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేయక తప్పదని, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కొనుగోళ్లు సాధ్యం కావన్నారు. కేంద్రం ఇలాంటి నిబంధనలను తీసుకురావడానికి ముందే భాగస్వాములైన రాష్ట్రాల డిస్కంలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల అభిమతమని పేర్కొన్నారు. ఎల్సీ అంటే? డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్రాల డిస్కంలు దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లు చేసిన 60 రోజుల్లోగా వాటికి సంబంధించిన బిల్లులను విద్యుదుత్పత్తి కంపెనీలకు చెల్లిస్తున్నాయి. అయితే ఆర్థిక సమస్యల వల్ల డిస్కంలు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోవడంతో అన్ని రాష్ట్రాల్లో బకాయిలు రూ. వేల కోట్లకు పెరిగిపోతున్నాయి. దీంతో బొగ్గు గనుల కంపెనీలు, రైల్వేకు విద్యుదుత్పత్తి కంపెనీలు సైతం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్నాయి. డిస్కంల నుంచి ఎప్పటికప్పుడు విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లులు అందేలా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్లను జారీ చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. విద్యుత్ కొనుగోళ్లకు ముందుగానే ఆ మేర డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసి ఎల్సీని విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే డిస్కంలకు విద్యుత్ సరఫరా కానుంది. అయితే కొనుగోలు చేసిన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసి, నెలా రెండు నెలల తర్వాత వాటికి సంబంధవించిన బిల్లులను వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటేనే డిస్కంలకు ఆదాయం వస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
2022 నాటికి ‘పోలవరం హైడ్రో’ ప్రాజెక్ట్ పూర్తి
వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి ప్రశ్నకు కేంద్రం జవాబు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిర్మాణంలో ఉన్న 960 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పోలవరం(ఇందిర సాగర్) హెడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు 2021–22 నాటికి పూర్తి కావచ్చని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొవ్వాడలో 6 వేల మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సూత్రప్రాయంగా అనుమతులిచ్చామన్నారు.దుమ్ముగూడెం హైడ్రో ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర విద్యుత్ అథారిటీ తిప్పిపంపినట్టు మంత్రి తెలిపారు. -
విద్యుత్ వివాదంపై సమావేశం వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ వివాదాలపై ఈ నెల 23న న్యూఢిల్లీలో జరగాల్సిన విద్యుత్ ప్రాధికార అథారిటీ (సీఈఏ) సమావేశం వాయిదా పడింది. కృష్ణపట్నం, హిందూజాతో పాటు విద్యుత్ వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు రావాలని సీఈఏ రెండు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులను కోరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా తాము రాలేమని ఏపీ ఇంధన శాఖ సీఈఏకు చెప్పిందని సమాచారం. దీంతో సమావేశాన్ని వాయిదా వేసిన సీఈఏ, తదుపరి భేటీ ఎప్పుడన్నది వెల్లడించలేదు.