
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న ప్రమాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)చే విచారణ జరిపించేందుకు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ సమ్మతించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్.కె.సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని హైడల్ పవర్ ప్రాజెక్టులను ఆడిట్ చేసి భద్రతా లోపాలపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్టు సంజయ్ పేర్కొన్నారు. ప్రమాదానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, సీఐడీ విచారణ కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని కేంద్రమంత్రికి వివరించారు. ‘నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్ కోడ్ నంబర్ 850 ప్రమాణాల మేరకు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు లేవు. 1998, 2009 వరదలు, 2019 అగ్నిప్రమాదం అనంతరమూ జల విద్యుత్కేంద్రంలో భద్రతా ప్రమాణాలను పెంచలేదు. ఇప్పటికైనా అత్యసవర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలి’ అని ఫిర్యాదులో సంజయ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment