‘సెకీ’ విద్యుత్ వల్ల రాష్ట్రంపై అంతర్రాష్ట్ర సరఫరా చార్జీలు పడవు
ప్రభుత్వానికి తేల్చి చెప్పిన విద్యుత్ నియంత్రణ మండలి
30 ఏళ్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలనుకున్న గత ప్రభుత్వం
తక్కువ ధరకే కొనేలా కేంద్ర సంస్థ సెకీతో ఒప్పందం
ఈ ఒప్పందంపై విషం చిమ్మిన బాబు ప్రభుత్వం
రూ.3500 కోట్ల చార్జీలు పడతాయంటూ శ్వేతపత్రంలో అబద్ధాలు
∙అదంతా ఉత్తిదేనని తేల్చిన ఏపీఈఆర్‌సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ ఉచిత విద్యుత్ అందించడంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం బయటపడింది. ఉచిత విద్యుత్‌ను ఆపాలన్న దురాలోచనతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో వైఎస్ జగన్ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందంపై దుష్ప్రచారానికి తెరతీసింది.
సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో సెకీ ఒప్పందాన్ని తప్పుబడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. సెకీ విద్యుత్ తీసుకుంటే జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ (జీఎన్‌ఏ) నిబంధనల ప్రకారం రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకూ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్‌టీఎస్) చెల్లించాల్సి వస్తుందని నమ్మించాలనుకున్నారు.
కానీ ఆయన చెప్పినదంతా అబద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పష్టం చేసింది. గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీ ద్వారా అంతర్రాష్ట్ర చార్జీలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం స్పష్టంగా చెప్పింది.
వంద శాతం మినహాయింపు
సెకీతో ఒప్పందమే పెద్ద భారమైనట్టు, ఓ నేరమైనట్టు సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో చెప్పుకొచ్చారు. ఐఎస్‌టీఎస్ చార్జీలపై అపోహల నేపథ్యంలో ఈ నెల 2న కర్నూలులో జరిగిన సదరన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్ ఫోరం (ఎస్‌ఈఆర్‌ఎఫ్) సమావేశంలో, ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన వర్కింగ్ గ్రూప్ భేటీలోనూ ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జున రెడ్డి చర్చించారు.
నిపుణుల అభిప్రాయాలు, చట్టాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం సెకీ విద్యుత్‌పై ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి వంద శాతం మినహాయింపు పొందవచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు ఏపీఈఆర్‌సీ తెలిపింది. తద్వారా 25 సంవత్సరాల పాటు ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. దీని విలువ చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే దాదాపు రూ.3,500 కోట్లు.
తక్కువ ధరతోనూ రూ.3,750 కోట్లు ఆదా
సెకీ నుంచి 2024 సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉండగా, సెకీ విద్యుత్ యూనిట్ రూ.2.49 కే వస్తోంది. ఎన్టీపీసీ సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 కన్నా కూడా ఇది తక్కువ. దీనిద్వారా ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది.
చీకటి రోజుల నుంచి రైతులకు విముక్తి
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పంటలకు నీరు పెట్టుకోవడం కోసం మీటర్లు వేసుకొనేందుకు రైతులు అర్ధరాత్రివేళ పొలాలకు వెళ్లి, విద్యుత్ షాక్‌కు, పాము కాట్లకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం విముక్తి కలిగించింది. వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించింది. దాంతోపాటు రానున్న 30 ఏళ్లలో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా సౌర విద్యుత్ సమకూర్చే చర్యలు చేపట్టింది.
అది కూడా ప్రైవేటు నుంచి కాకుండా, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని రైతులకు ఉచితంగా అందించాలని సంకల్పించింది. సెకీతో ఒప్పందం అనంతరం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం అన్ని రకాల విద్యుత్‌ను కొనేందుకు అనుమతి ఉన్న డిస్కంలు ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు పొందలేవు. దీనిని ముందే గుర్తించిన వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సరఫరా కంపెనీని ఏర్పాటు చేసింది.
నష్టం తెచ్చిందే టీడీపీ
వాస్తవంగా విద్యుత్ రంగాన్ని నష్టాలపాలు చేసిందే గత చంద్రబాబు ప్రభుత్వం. అప్పట్లో మార్కెట్‌లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54), బాబు ప్రభుత్వం ఏకంగా యూనిట్ రూ.6.99కు కొనేలా ఒప్పందాలు చేసుకుంది. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి ఒప్పందాలు చేసుకుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యం మేరకు పవన విద్యుత్ ఒప్పందాలు నామినేషన్ ప్రాతిపదికనే జరిగాయి.
పోటీ బిడ్డింగ్ ద్వారా కాదు. దీనివల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో దుబారా, దోపిడీని అరికట్టి కరెంటు కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. సెకీతో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment