సాక్షి, హైదరాబాద్: కార్యాలయాల పై కప్పులపై (రూఫ్ టాప్) సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవహారం రెండు ప్రభుత్వ సంస్థల మధ్య వివాదం రేపుతోంది. ఈ విధానాన్ని ప్రోత్సహించాలని సంప్రదాయేతర ఇంధన వనరులు, పునరుత్పాదన విభాగం(నెడ్‌క్యాప్) కసరత్తు చేస్తుంటే, భద్రతపరంగా దీన్ని స్వాగతించలేమని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్) అంటున్నాయి.
రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానళ్లు ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలను నెడ్‌క్యాప్ గుర్తించింది. నెట్ మీటరింగ్ ఏర్పాటు కోసం డిస్కమ్‌లకు ప్రతిపాదనలు పంపింది. భద్రతపరమైన అంశాలను పరిశీలించే విభాగం సమగ్ర నివేదిక ఇవ్వకుండా దీన్ని అంగీకరించలేమని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి. టార్గెట్లు పూర్తి చేయాలని నెడ్‌క్యాప్ తొందపడుతుండగా, ప్రాణభయం ఉందంటూ అడ్డుకోవడానికి డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. డిస్కమ్‌ల లైన్లకే సోలార్ విద్యుత్ వెళ్తుంది.
ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను డిస్కమ్‌లే కొనుగోలు చేయాలి. కాబట్టి వాటి నుంచి అనుమతి తప్పనిసరి. కానీ, డిస్కమ్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పంచాయితీ కేంద్ర ఇంధన శాఖకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. డిస్కమ్‌ల అభ్యంతరాలను కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసేందుకు నెడ్‌క్యాప్ సన్నాహాలు చేస్తోంది.
‘రూఫ్ టాప్ సోలార్’ జగడం!
Published Thu, Aug 13 2015 7:38 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM