సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పరిధిలో దాదాపు రూ.13 వేల కోట్లను ‘ఆర్డీఎస్‌ఎస్’ ద్వారా వెచ్చిస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. విద్యుత్ సంస్థ (ఏపీజెన్‌కో, ట్రాన్స్‌కో, ఏపీఎస్‌పీసీఎల్, డిస్కం)ల డైరీల ఆవిష్కరణ, ‘ఏపీసీపీడీసీఎల్’ 4వ వార్షికోత్సవం గురువారం నిర్వహించారు.
విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో కొత్తగా దాదాపు 484 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని, 10 శాతానికి తీసుకుచ్చామని వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్‌స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణపట్నం 800 మెగావాట్ల యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామన్నారు.
డాక్టర్ ఎన్టీటీటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 99.7 శాతం ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ లభ్యతతో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీఎస్పీడీడీఎల్ సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఇన్‌చార్జ్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ మాజీ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్ బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment