సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి, రైతులకు ఉచిత విద్యుత్‌పై రానున్న 30 ఏళ్ల పాటు హక్కు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూనిట్ కేవలం రూ.2.49 పైసలకే 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఈ ఒప్పందం కుదిరింది.
విద్యుత్ చట్టాలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాయి. తక్కువ రేటుకే విద్యుత్ కొని 30 ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ అందించే మంచి కార్యక్రమం ఈనాడుకు నచ్చలేదు. రామోజీ ఏకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)నే తప్పుబడుతూ ఈనాడులో కథనాలు ఇస్తున్నారు.
సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతున్న కార్యకలాపాలపైనే అడ్డగోలుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. రెండు రోజులుగా ఈనాడు పత్రికలో వస్తున్న అసత్య కథనాలను ఏపీఈఆర్‌సీ తీవ్రంగా పరిగణించింది. కనీస అవగాహన లేకుండా, చట్టం గురించి తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయడంపై తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ ‘సాక్షి’కి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
ఈనాడు ఆరోపణ: సెకీతో 2021లో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరపకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
వాస్తవం: విద్యుత్ నియంత్రణ మండలి స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర స్థాయి అత్యున్నత సంస్థ. మండలి తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదు. మండలి నిర్ణయాలపై ఎలాంటి గోప్యతకు తావులేదు. బహిరంగ విచారణ విషయానికొస్తే మండలి అనుసరించే విచారణ ప్రక్రియ విద్యుత్ సరఫరా చట్టం, అందుకు అనుగుణంగా మండలి జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. సెక్షన్ 62 – 64 ప్రకారం పంపిణీ సంస్థల టారిఫ్‌ను నిర్దేశించే క్రమంలో డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలను పత్రికాముఖంగా తెలియజేయాలి.
ఆ ప్రతిపాదనలపై వచ్చే అన్ని అభ్యంతరాలను పరిశీలించి, మండలి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సెకీతో ఒప్పందం కుదుర్చుకునే ముందు డిస్కంలు మండలి అనుమతి కోరాయి. ఐదో నియంత్రిత కాలం లోడ్ ఫోర్‌కాస్ట్ రిసోర్స్ ప్లాన్ ప్రకారం ఉన్న విద్యుత్ అవసరాల రీత్యా 7 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అని మండలి భావించింది. ఇందుకు సహేతుక కారణాలు తెలుపుతూ 2021 నవంబర్ 11న డిస్కంల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలకు మండలి షరతులతో కూడిన ఆమోదం తెలిపింది.
విద్యుత్ టారిఫ్ విషయానికి వస్తే సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి మాత్రమే టారిఫ్‌ని నిర్ధారిస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. 2022లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్‌సీ)లో దాఖలైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్ రూ.2.49 పైసలుగా టారిఫ్‌ను నిర్ధారించింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అభ్యంతరదారులు పిల్ దాఖలు చేశారు. ఆ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఆరోపణ: విద్యుత్ పంపిణీ సంస్థలు సెకీతో చేసుకున్న ఒప్పందం ఆమోదం కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను మండలి వెబ్‌సైట్‌లో ఉంచలేదు.
వాస్తవం: ఈ విమర్శల్లో ఎటువంటి వాస్తవికత గాని, హేతుబద్ధత గాని లేదు. ఏదైనా ప్రతిపాదనపై విచారణ ప్రక్రియ చట్టానికి అనుగుణంగా జరుగుతుంది. వినియోగదారుల విద్యుత్ చార్జీల సవరణ, ట్రూఅప్ చార్జీలపై మాత్రమే కమిషన్ బహిరంగ విచారణ చేపడుతుంది.
వాటికి సంబంధించిన అంశాలను మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. ఇతర ఏ ప్రతిపాదనలకు బహిరంగ విచారణ జరపాలని గానీ, వెబ్‌సైట్‌లో పెట్టాలని గానీ చట్టంలో నిబంధన లేదు. అందువల్ల పత్రికలో మండలిపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారాలు. ఇటువంటి వార్తలు ప్రచురించడం ద్వారా మండలి లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించడం వ్యవస్థకు ఎంత మాత్రం మేలు చేయదు.
Comments
Please login to add a commentAdd a comment