సౌర విద్యుత్‌పై భారీ ఆశలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధార పడడాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా మన జిల్లాలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. అయితే ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు విడుదల కావాల్సి ఉంది.
వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన ఐదువేల ఎకరాలకు పైగా భూమి గట్టు మండలంలో ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెసి) ఈ యేడాది మార్చిలో ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ)తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆరు నెలల్లో ఎంపిక చేసిన స్థలంలో మౌలిక సౌకర్యాల కల్పన పూర్తి చేయాలని అంగీకారానికి వచ్చారు.
కాంపిటీటీవ్ బిడ్డింగ్ పద్ధతిలో డెవలపర్స్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మౌలిక సౌకర్యాల కల్పనకు త్వరలో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ప్రభుత్వమే నెలకొల్పుతుందా లేక ప్రైవేటు పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఔత్సాహికులు ముందుకు వస్తే జపాన్ ఆర్థిక సంస్థ జికా సహకారంతో మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు రుణాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ధర నిర్ణయంపైనే ఆసక్తి
సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నా యూనిట్ ధర నిర్ణయంపై స్పష్టత రావడం లేదు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో) సౌర విద్యుత్ యూనిట్ ధరను రూ.6.50 నుంచి రూ.7.50గా పేర్కొంటోంది. పెట్టుబడులతో పోలిస్తే ట్రాన్స్‌కో నిర్ణయిస్తున్న ధర అంత లాభదాయం కాదనే భావన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విధానంలో పారదర్శకత లేదంటూ గతంలో ఔత్సాహిక పెట్టుబడిదారులు ఆరోపించారు.
సబ్సిడీలు, పన్ను రాయితీ, కనీసం 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం వంటి అంశాలపై స్పష్టత ఇస్తే ముందుకు వచ్చే యోచనలో పారిశ్రామికవేత్తలున్నారు. కాగా జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై బిడ్‌లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే స్పష్టత వస్తుందని నెడ్‌క్యాప్ డీఎం గోవిందరాజులు ‘సాక్షి’కి వెల్లడించారు. గట్టు మండలంలో గతంలో సెసి సర్వే చేసినా సరైన భూమి దొరకలేదన్నారు. విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తి కావాల్సి ఉందన్నారు.
జెన్‌కో ఆధ్వర్యంలో
రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్‌కో ఆధ్వర్యంలో తొలి సారిగా ధరూరు మండలం రేవులపల్లి వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రం ఆవరణలో రూ. 12.8 కోట్ల వ్యయంతో ప్లాంటు నిర్మించారు. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఈ ప్లాంటు ఏర్పాటుకు సహకారం అందించింది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పవర్ ప్లాం టును 2012లో ప్రారంభించారు.
యేటా1.4 మిలియ న్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జెన్‌కోతో పాటు వాల్యూలాబ్స్ అనే ఐటీ సంస్థ 8 మెగావాట్లు, రేస్ ఇన్‌ఫ్రా 10 మెగావాట్లు. ఓ మీడియా సంస్థ 10 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను జిల్లాలో ఇప్పటికే నెలకొల్పాయి.