రైతు బతుకులో ‘సౌర’ వెలుగులు
- అందుబాటులో సౌర పంపుసెట్లు
- నెడ్‌క్యాప్, ట్రాన్స్‌కో శిక్షణ శిబిరాలు
అనకాపల్లి: రైతుల విద్యుత్ కష్టాలకు త్వరలో తెర పడనుంది. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా సౌర విద్యుత్ వినియోగంపై అధికారులు సమాయత్తమవుతున్నారు. సౌర విద్యుత్ తో పనిచేసే నీటి పంపుల వినియోగంలో రైతులకు ఎదురయ్యే లాభనష్టాలను అంచనా వేసుకొని, పూర్తిస్థాయి వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ కోత, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్‌ను దృష్టిలో ఉంచుకొని సంప్రదాయ వనరులైన పవన, సౌరశక్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని పాలకులు, అధికారులు గుర్తించారు. పరిశ్రమలకు తోడు, గృహావసరాల విద్యుత్ సరఫరాకు డిమాండ్ పెరగడంతో ఆ ప్రభావం వ్యవసాయ రంగానికి సరఫరా చేసే విద్యుత్‌పై పడింది.
దశల వారీగా వ్యవసాయ రంగానికి కేటాయించే విద్యుత్ వేళలను కుదించడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఏడు గంటల పాటు సరఫరా చేసే విద్యుత్‌ను సైతం లోడింగ్‌ను బట్టి ఫీడర్ల వారీగా రెండు విడతలుగా సరఫరా చేయడంతో ఉపయోగం ఉండదని రైతుల వాదన. దీంతో రైతులకు అవగాహన కల్పించి, రాయితీపై సౌర విద్యుత్‌ను అందించేందుకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (నెడ్‌క్యాప్) ముందుకొచ్చింది.
ప్రయోగాత్మకంగా శిక్షణ శిబిరాలు
నెడ్‌క్యాప్, ట్రాన్స్‌కో శాఖలు ఎంపిక చేసిన రైతులకు సౌర నీటి పంపుల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. దీనికి ఇప్పటికే రెండు శాఖల అధికారులు వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించారు. ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 15వ తే దీన 300 మంది రైతులకు సౌర నీటి పంపుసెట్ల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాలతో వాయిదా వేసిన ఈ సదస్సును ఈ నెల 18న నిర్వహించే అవకాశం ఉంది. సౌర విద్యుత్ పంపుసెట్లకు అవసరమైన మోటార్లు, ప్యానెల్స్‌ను సరఫరా చేసే వివిధ సంస్థలు అవగాహన సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దశల వారీగా సౌర విద్యుత్ పంపుసెట్లను వినియోగంలోకి వస్తే రైతులకు విద్యుత్ కష్టాలు తీరినట్లే.