training camps
-
అమ్మకు శిక్షణ.. బిడ్డకు రక్షణ
సాక్షి, అమరావతి: పాలుతాగే పసికందులను వదిలి వెళ్లేందుకు ఏ మాతృమూర్తికీ మనసొప్పదు. పక్కింటికి వెళ్లినా వెంట తీసుకెళ్తుంది. తప్పనిసరిగా వదిలి వెళ్లాల్సివస్తే మాత్రం బాగా కావాల్సిన వారికి మాత్రమే అప్పగిస్తుంది. కానీ.. ఉద్యోగం సాధించి, శిక్షణ కోసం వారం రోజులపాటు వదిలి ఉండాల్సి వస్తే..! సరిగ్గా ఇలాంటి తల్లుల ఇబ్బందిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారు శిక్షణ పొందుతున్న ప్రాంగణాల్లోనే ప్రత్యేక బేబీకేర్ సెంటర్ల (ఎఫ్ఎల్ఎన్ కిడ్స్‌స్పేస్)ను ఏర్పాటుచేసింది. పిల్లలు తినే ఆహారం.. ఏ సమయానికి ఏం తింటారు.. ఎప్పుడు నిద్రపోతారు.. ఇలా అన్ని వివరాలను తీసుకుని ప్రత్యేకంగా పాలు, ఆహారం, ఆట వస్తువులతో పాటు కేర్ టేకర్లను సైతం నియమించింది. ఉదయం ఉపాధ్యాయ శిక్షణకు హాజరయ్యేటప్పుడు పిల్లలను ఈ కిడ్స్స్పేస్లో వదిలి తల్లులు ట్రైనింగ్‌కు హాజరై.. సాయంత్రం తిరిగి తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ బిడ్డకు ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లను, సంరక్షణ బాధ్యతను సమగ్ర శిక్ష అధికారులు తీసుకున్నారు. కొత్తగా కేజీబీవీల్లో చేరిన టీచర్లకు మరింత మెరుగ్గా బోధనా నైపుణ్యాలు అందించేందుకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు విజయవాడ, విశాఖపట్నంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చేటప్పుడు తమ పిల్లల బాధ్యత ఎలాగని బెంగపడ్డ టీచర్లు.. పిల్లల కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటుచేయడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 1,190 మంది కేజీబీవీ టీచర్లకు శిక్షణ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల్లో బోధన కోసం 1,190 మందిని టీచర్లుగా నియమించింది. వారంతా దాదాపు 24 నుంచి 30 ఏళ్లలోపు వారే. వారికోసం విజయవాడ, విశాఖపట్నంలో ఫౌండేషన్ లెరి్నంగ్ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)పై ఈనెల 6 నుంచి శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇక్కడకు వచ్చిన వారిలో దాదాపు 40 శాతం మంది చంటి పిల్లలతో రావడం, ఆ పిల్లలను ఎక్కడ ఉంచాలో తెలీక ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు వెంటనే అదే ప్రాంగణంలో ‘ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ కిడ్స్ స్పేస్’ సెంటర్లు ఏర్పాటుచేశారు. టాయ్స్ కార్నర్, హోలిస్టిక్ డెవలెప్మెంట్ సెంటర్, స్లీపింగ్ కార్నర్, స్టోరీ టెల్లింగ్ కార్నర్, మదర్/గార్డియన్‌ను అందుబాటులో ఉంచారు. టీచర్ల ఏకాగ్రత శిక్షణపై ఉండేలా పిల్లల సంరక్షణ బాధ్యత అధికారులే తీసుకోవడం ఇదే ప్రథమం. గతంలో శిక్షణకు తాము మూడు నెలల బిడ్డలతో వచ్చి ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు పిల్లల సంరక్షణను సమగ్ర శిక్ష అధికారులు తీసుకోవడం గొప్ప విషయమని సీనియర్ టీచర్లు సంతోషం వ్యక్తంచేశారు. విజయవాడ, విశాఖపట్నంలో మొదటి విడత శిక్షణ ముగియడంతో ఈనెల 16 నుంచి అనంతపురం, తిరుపతిలో టీచర్ల శిక్షణ మొదలవుతుందని, అక్కడ కూడా ఇదే తరహా బేబీకేర్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. తల్లులు ఇబ్బంది పడకూడదనే.. బాలికా విద్యాభివృద్ధే ధ్యేయంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కేజీబీవీల ద్వారా నాణ్యమైన చదువుతోపాటు చక్కని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అక్కడ తల్లిదండ్రులకు, సంరక్షకులకు దూరంగా ఉండి విద్యార్థులు చదువుతుంటారు. వారికి రక్షణతో పాటు ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే కొత్తగా చేరిన టీచర్లకు బోధనా నైపుణ్యాలతో పాటు విద్యార్థులు, సహచరులతో మెలగాల్సిన విధానాలపై శిక్షణ ఇస్తున్నాం. అయితే, ఈ శిక్షణ కేంద్రానికి కొందరు చిన్నపిల్లలతో వచ్చి ఇబ్బందిపడడం గమనించాను. వారి ఏకాగ్రత కోల్పోకుండా వారి పిల్లల సంరక్షణ బాధ్యతను మేం తీసుకుని బేబీ కేర్ సెంటర్లను ఏర్పాటుచేశాం. పిల్లలను చూసుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలను సంరక్షకులుగా నియమించాం. – బి. శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఎస్పీడీ పిల్లల కోసం చక్కటి ఏర్పాట్లు.. ట్రైనింగ్ అనగానే సబ్జెక్టు వరకే ఉంటుందనుకున్నాను. టీచర్‌కు ఉండాల్సిన ఉత్తమ లక్షణాలను, విద్యార్థులు, తోటి టీచర్లతో ఎలా ఉండాలి?, కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్ ప్రయోగాలు, విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు ఎలా రాబట్టాలి వంటి అంశాలపై చక్కని శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో కొందరు తమ పసిపిల్లలను తీసుకొస్తే అంగన్వాడీ ఆయాలు, ప్రథమ్ సభ్యులకు పిల్లల సంరక్షణ బాధ్యతను అప్పగించారు. పిల్లల కోసం బెస్ట్‌ఫుడ్, ఆట వస్తువులు, నర్సులను అందుబాటులో ఉంచారు. – విజయ జాగు, కెమిస్ట్రీ పీజీటీ, నక్కపల్లి కేజీబీవీ (అనకాపల్లి జిల్లా) ఇంటి వాతావరణం తలపించేలా.. కేజీబీవీ టీచర్ శిక్షణ కోసం నాలుగు నెలల పాపతో వచ్చాను. కొత్త ప్రదేశం.. పైగా చల్లని వాతావరణం, పాప తట్టుకోలేదేమోనని ముందు భయపడ్డాను. ఒకవైపు శిక్షణ.. మరోవైపు పాపను చూసుకోవడం ఇబ్బంది తప్పదనుకున్నాను. కానీ, ఇక్కడ పిల్లల కోసం వేడినీళ్లు, పాలు, సెరిలాక్, ఆహారం వంటివి ఏర్పాటుచేశారు. ఆరోగ్య జాగ్రత్తల కోసం నర్సులను నియమించారు. కొంచెం పెద్ద పిల్లలకు ఆట వస్తువులు, బొమ్మలు ఏర్పాటుచేశారు. భోజనం, వసతి ఇంటిని తలపించేలా ఉంది. – హెచ్ఆర్. దివ్యశ్రీ, తాడిమర్రి కేజీబీవీ, బోటనీ పీజీటీ (అనంతపురం జిల్లా) -
అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్ సరిహద్దుల్లోని రైసెన్ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. భోపాల్‌లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ సయ్యద్ డానిష్ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్ ఖాన్ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్ రెహా్మన్, షేక్ జునైద్ కూడా హాజరయ్యారని ఏటీఎస్ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది. గోల్కొండలోని సలీం నివాసంలో ఎయిర్ పిస్టల్, పిల్లెట్స్, భోపాల్‌లోని యాసిర్ ఇంటి నుంచి నాటు తుపాకీ, తూటాలు సీజ్ చేశారు. ఈ నాటు తుపాకీ సేకరించింది, భోపాల్ మాడ్యుల్‌కు శిక్షణ ఇచ్చింది కూడా సలీం అని ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ కోణంలో అతడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విదేశీ నంబర్లకు ఫోన్లపై ఆరా నగర మాడ్యుల్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ఫోన్ల నుంచి విదేశీ నెంబర్లకు ఫోన్లు వెళ్లినట్లు అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు వాటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి విదేశాల్లో ఉన్న వారితో ఉన్న సంబంధాల పైనా దర్యాప్తు చేయనున్నారు. ఉగ్రవాద సాహిత్యాన్ని తన ల్యాప్‌టాప్ వినియోగించి సొంతంగా తయారు చేసిన సలీం అందులో అనేక అంశాలు చేర్చాడు. ఆన్లైన్లో ఉన్న విషయాలతో పాటు వివిధ పుస్తకాల్లోని అంశాలు క్రోడీకరించి రూపొందించిన ఇందులో జిహాద్, ముజాహిదీన్ అంటే ఏమిటి? తాము ఏం చేయాలి? అనే వివరాలతో పాటు ఉగ్రవాద చర్యల్లో పాల్గొంటూ చనిపోయిన వారి కుటుంబాలను ఎలా ఆదుకోవాలి? ఎలాంటి ఆయుధాలు సమీకరించుకోవాలి? క్యాడర్‌ను ఎలా రిక్రూట్ చేసుకోవాలి? వివరాలు పొందుపరిచాడు. ఈ కేసులో సాక్షులుగా ‘వారు’: సలీం రెహ్మాన్ న్ గతంలో మరికొందరిని ఆకర్షించారు. వీళ్లు కేవలం మతపరమైన కార్యక్రమాలు చేపడుతున్నారని భావించిన వాళ్లు కొన్ని సమావేశాలకు హాజరయ్యారు. కొన్నాళ్లకే వీరి వ్యవహరశైలి, కార్యకలాపాలు అనుమానాస్పదంగా భావించిన వారంతా దూరయమ్యారు. వీరిని గుర్తించి, ఈ కేసులో సాక్షులుగా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. -
గురి తప్పని బాణాలు
పిఠాపురం: మనసును.. దృష్టిని లక్ష్యంపై కేంద్రీకరించి వంద శాతం ఏకాగ్రతతో ఆడాల్సిన ఆట విలువిద్య. సనాతన భారత ఇతిహాసాలలో కనిపించే విలు విద్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆర్చరీ క్రీడను నేర్చుకునేందుకు చిన్నారులు క్యూ కడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, ఆలమూరు, రాజోలు, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో వేసవి విలు విద్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్రీడాకారులు 200లకు పైగా ఉండగా.. రిజిస్టర్ కాని క్రీడాకారులు వెయ్యి మందికి పైగా ఉన్నారు. వీరిలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలు సాధించిన క్రీడాకారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలు విద్యా క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఆర్చరీకి డిమాండ్ పెరిగింది. వేసవి శిబిరాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారంటే.. దేశానికి పేరు తెస్తా చిన్నప్పటి నుంచి విలువిద్య అంటే ప్రాణం. 2016లో జిల్లాస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం, 2022లో సీనియర్స్ విభాగంలో స్వర్ణ పతకం, సీనియర్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఇంటర్ చదివిన నేను ప్రస్తుతం తాపీ పని చేసుకుంటూ ఆర్చరీలో మరింతగా శిక్షణ పొందుతున్నాను. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మరిన్ని పతకాలు సాధించి దేశానికి.. రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్న సంకల్పంతో ఉన్నాను. – పి.కృష్ణ, పిఠాపురం జాతీయ స్థాయిలో రాణిస్తా పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్నా. చిన్నప్పటి నుంచి పుల్లలతో బాణాలు తయారు చేసుకోవడం సరదా. దానిని చూసిన మా స్కూల్ పీడీ మంగయ్యమ్మ నన్ను విలువిద్య నేర్చుకోమని చెప్పారు. అందుకే.. శిక్షణ పొందుతున్నాను. 2016లో కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాను. 2023 కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. – పి.మహాలక్ష్మి, పిఠాపురం శిక్షణ బాగుంది నేను 3వ తరగతి చదువుతున్నాను. బాణాలంటే చాలా ఇష్టం. అది చూసి అమ్మానాన్న విలువిద్య నేర్పించారు. కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లాస్థాయి ఆర్చరీ పోటీల్లో రజత పతకం సాధించా. జాతీయ స్థాయిలో రాణించాలన్న సంకల్పంతో శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ శిక్షణ బాగుంది. – ఎస్.కృష్ణ అభిరామ్, పిఠాపురం ఆసక్తి పెరిగింది విలువిద్యపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఏటా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించడమే ధ్యేయంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో విలువిద్య క్రీడాకారులకూ ఉద్యోగావకాశాలు కల్పిస్తుండటంతో ప్రోత్సాహం పెరిగింది. – పి.లక్ష్మణరావు, ఆర్చరీ కోచ్, పిఠాపురం -
భారత్‌లో దాడులకు పాక్ కుట్రలు !
శ్రీనగర్ : భారత్‌లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పథక రచన చేస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ఉగ్రమూకల సంస్థలతో కలిసి సెస్టెంబర్ చివరి వారంలో లేక అక్టోబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పాకిస్తాన్ బిగ్రేడ్‌కు చెందిన 2000 మందితో కూడిన బలగాలను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని పూంచ్ ఏరియాకు చెందిన బాగ్, కోట్లీ సెక్టార్‌కు తరలించినట్లు సమాచారం అందింది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) నుంచి భారత భూభాగంలోకి చొరబడేజైష్-ఎ-ముహమ్మద్ (జెఎమ్), లష్కర్-ఎ-తొయిబా తీవ్రవాదులకు ఈ బలగాలు సహకరించనున్నాయి. ప్రస్తుతం ఈ బలగాలు నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎస్ఎస్జి కమాండోలతో కలిసి ఎల్ఇటి, జైషే ఉగ్రవాదులు ఇప్పటికే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్లలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లో ఈ ఉగ్రవాద గ్రూపుల కోసం శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశారు. జమాత్-ఎ-ఇస్లామి ఈ శిబిరాలకు నాయకత్వం వహిస్తుండగా, జైష్-ఎ-ముహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఎల్ఈటీ తమ వంతు సహకారం అందించనున్నట్లు తెలిసింది. వజీరాస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు ఐఎస్ఐ పెద్ద మొత్తంలో జాబితాను తయారు చేసినట్లు, దీనికంతటికి హిజ్బుల్ కమాండర్ షంషేర్‌ఖాన్ నాయకత్వం వహించనున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. -
చంద్రబాబు అవినీతి అక్రమాలకు 40ఏళ్లు..
తిరుపతి మంగళం: ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించడంలో చంద్రబాబే కీలకపాత్ర పోషించారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి ఆరోపించారు. తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. చివరి రోజున మదనపల్లె, పూతలపట్టు నియోజకవర్గాల బూత్ కమిటీ సభ్యులకు నిర్వహించిన శిక్షణకు పార్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్ కుమార్, ఎస్ కోట కన్వీనర్ జోగినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, కుంభా రవిబాబు, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. పార్థసారథి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలన స్వర్ణయుగంలా ఉండేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఏపని తలపెట్టినా వెనకాముందు చూసేవారు కాదని, ప్రజల సంక్షేమమే తన కళ్ల ముందు కనిపించేదని అన్నారు. గుంటూరు–కృష్ణా జిల్లాకు గుండె కాయలాంటి పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులు నినదిస్తే తెలంగాణ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారంటూ చేతులెత్తేసిన పిరికిపంద చంద్రబాబు అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పులిచింతల ప్రాజక్టును పూర్తి చేసిన ఘనుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలను అబద్ధాలు, కల్లబొల్లి మాటలతో మోసగించడం, అవినీతి అక్రమాలతో దోచుకోవడం, దాచుకోవడం తప్ప చంద్రబాబుకు మరొకటి తెలియదన్నారు. రాజధాని పేరుతో పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేల కోట్లు దండుకున్న దుర్మార్గుడన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నాడని మండిపడ్డారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించారు.. వైఎస్ ఐదేళ్ల పాలన రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలించారని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఫైల్‌పై మొదటి సంతకాన్ని చేశారన్నారు. రాష్ట్రంలోని అంగుళం భూమి కూడా బీడుగా ఉండకూడదన్న ఉద్దేశంతో జలయజ్ఞనం పేరుతో నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. అలాంటి పాలనను తిరిగి తీసుకురావడం కోసం బూత్ కన్వీనర్లు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒక్కొక్కరు వంద నుంచి 150ఓట్లు వేయించేలా ఉండాలన్నారు. చంద్రబాబు అవినీతి అక్రమాలకు 40ఏళ్లు.. చంద్రబాబు అవినీతి అక్రమాలకు 40ఏళ్లు అని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.సునీల్ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను అబద్ధాలు, మాయమాటలతో మోసగిస్తున్నాడన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని బూత్ కన్వీనర్లు యుద్ధంలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వార్థం..కుట్ర.. ద్రోహానికి మారుపేరు చంద్రబాబు స్వార్థం.. ద్రోహం.. కుట్రకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పడంలో ఆయన దిట్ట అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మొదటి నుంచి జగనన్న ఉద్యమిస్తుంటే హోదాపై నోరుమెదపని ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలైనా అర్పించడానికి వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంగా ఉన్నామన్నారు. నవరత్నాల లాంటి పథకాల గురించి ప్రజలకు వివరించి, పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సోషియల్ మీడియా ద్వారా జనంలోకి.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు చేస్తున్న విష ప్రచారాన్ని ఎదుర్కొని, ప్రజాసంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నవరత్నాలను సోషియల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేటి సమాజంలో సోషియల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. -
మభ్యపెట్టడంలో బాబు దిట్ట
సామర్లకోట (పెద్దాపురం) ప్రజలను మభ్య పెట్టేలా ప్రచారం చేయడంలో చంద్రబాబును మించినవారు మరొకరు ఉండరని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెద్దాపురం–జగ్గంపేట రోడ్డులోని పామాయిల్ తోటలో మంగళవారం జరిగిన జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా భజన చేస్తున్నారని ఆరోపించారు. మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా సర్పంచ్‌లకు అన్యాయం జరుగుతోందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. అర్హులైనవారిని ఓటర్లుగా నమోదు చేయిం చేందుకు ప్రతీ బూత్‌కు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతీ 100 మందిలో ఇద్దరు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులను గుర్తించాలన్నారు. వారి ద్వారా 100 మంది అవసరాలు బూత్ కమిటీకి తెలిసేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా ప్రతి బూత్ కమిటీ ఒక ప్రణాళిక తయారు చేసి నియోజకవర్గ కన్వీనర్‌తో జిల్లా స్థాయికి అందజేయాలన్నారు. ప్రతీ బూత్‌లోను ఏఏ వర్గాలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడంతో పాటు వారి పేర్లను నిద్రలో అడిగినా చెప్పే విధంగా బూత్ కమిటీ సభ్యులు ఉండాలన్నారు. బూత్ కమిటీ సభ్యులు జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రభుత్వం కనిపించకుండా చేసిందని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లతో పాటు గృహనిర్మాణ పథకాలను ప్రారంభిస్తున్నారని.. ఈ విషయం ప్రజలు జాగ్రత్తగా గమనించాలన్నారు. ఇవి కూడా అర్హులకు అందడం లేదన్నారు. అర్హులను గుర్తించి ఈ పథకాలు అందే విధంగా బూత్ కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ విజయానికి బూత్‌కమిటీ సభ్యులు సైనికులుగా పని చేయాలన్నారు. ప్రజలను పార్టీ వైపు తిప్పే బాధ్యత బూత్ కమిటీ సభ్యులు స్వీకరించాలన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాసు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డితోనే వైఎస్సార్ పాలన సాధ్యమవుతుందన్నారు. పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి మాఫియా దోచేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అధికారపార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసమే జగన్ మోహన్‌రెడ్డి నవరత్న పథకాలను ప్రకటించారన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు, కర్రి వెంకట రమణ, మోరంపూడి శ్రీరంగనాయకులు, వరసాల ప్రసాద్, మేడిశెట్టి వీరభ్రదరావు, ఏపీజే వెన్ను, గవరసాని సూరిబాబు, నియోజకవర్గ నాయకులు తాటికొండ అచ్చిరాజు, మద్దాల శ్రీనివాసు, కాపుగంటి కామేశ్వరరావు, బొబ్బరాడ సత్తిబాబు, బంగారు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇటు శిక్షణ..అటు సెల్ వీక్షణ..!
‘‘ గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళికలు వేయండి..అవే మార్గదర్శకం కావాలంటూ’’ జిల్లా పంచాయతీ అధికారులు ఓ వైపు గొంతుచించుకుంటుంటే..మరోవైపు తమకేదీ పట్టదన్నట్టు కొందరు అధికార సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. సమావేశం జరుగుతుండగానే కొందరు అధికారులు ధైర్యంగా చేతుల్లో ఉన్న సెల్ఫోన్లతో సెల్ఫీలు దిగారు. మరికొందరు వీడియోలు చూసుకుంటూ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. శనివారం ఉదయం స్థానిక జెడ్పీసమావేశ మందిరంలో చోటు చేసుకున్న దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. అరసవల్లి: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలపై టీవోటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమాలు జెడ్పీ కార్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్నాయి. రోజుకో డివిజన్ చొప్పున మూడు డివిజన్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే శనివారం నాడు జరిగిన టెక్కలి డివిజన్ సమావేశంలో పలువురు అధికారులు సెల్ఫోన్లతో సెల్ఫీలు దిగగా, మరికొందరు వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్బుక్ అక్కౌంట్లు చూసుకుంటూ గడిపేశారు. మరికొందరైతే...చల్లగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఒకవైపు శిక్షణ..మరోవైపు సెల్ వీక్షణలతో సమావేశ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగింది. ఎంతో కీలకమైన పంచాయతీ బడ్జెట్ రూపకల్పన అంశాలను, ప్రభుత్వం లక్ష్యాలు, సాధించే క్రమాలను రిసోర్స్పర్సన్లు, అధికారులు వివరంగా చెప్పే ప్రయత్నాలు చేస్తుంటే...పలువురు సిబ్బంది ఎంచక్కా..తమ పనులను సెల్ఫోన్లలో చక్కదిద్దుకున్నారు. ఇదిలావుంటే కొందరు కార్యదర్శులు సమావేశానికి ముందుగా హాజరై, తర్వాత కొందరు మార్నింగ్‌షో సినిమాలకు పోతే...మరికొందరు వారి స్వంత పనులను చేసుకుని తీరిగ్గా భోజనాల సమయానికి తిరిగి జెడ్పీ హాల్లో హాజరై భోజనాలు చేసి, అధికారికంగా టీఏ బిల్లులు తీసుకుని వెళ్లిపోవడం కనిపించింది. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ హేమసుందరరావు అధ్యక్షతన జరిగిన ఈశిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు హాజరయ్యారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు: డీపీవో కోటేశ్వరరావు జిల్లాలో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ..తీర్మానాలను సైతం చేయడం లేదని, ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం జరిగిన టీవోటీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పైవిధంగా స్పందించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య, వీధి లైట్లు, మంచినీటి సరఫరా వంటి మూడు అత్యంత ప్రాధాన్యతాంశాలని, వీటికి అభ్యంతరాలు చెప్పకూడదని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేక చర్యలు చేపడితే వెంటనే నోటీసులు జారీ చేసి బాడీని రద్దు చేసే అధికారం తనకుందని స్పష్టం చేశారు. అలాగే 14వ ఆర్థిక సంఘ నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేస్తే బిల్లులు అవ్వవని గుర్తు చేశారు. అలా అని సర్పంచులు అక్రమాలు చేస్తున్నారని కాదని, చేస్తున్న పనులు పద్ధతిగా, నిబంధనలకు లోబడి చేయాలని వివరణ ఇచ్చారు. గ్రామ పంచాయతీల బడ్జెట్లో పేర్కొన్న పనులు మాత్రమే అధికారికంగా చెల్లుబాటు అవుతాయని, అందుకే సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ హేమసుందరరావు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ముందుచూపుతో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. లేదంటే పరిమితమైన ఫలితాలే ప్రజలకు అందుతాయని వివరించారు. అలాగే లింగ సమానత్వం కూడా ప్రాధాన్యతగా బడ్జెట్లో తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో జెడ్పీ అక్కౌంట్స్ అధికారి కిరణ్‌కుమార్, నందిగాం సర్పంచ్ ఎన్.శ్యామల, రిసోర్స్పర్సన్లు వెంకటరాజు, హరిహరరావు, ఎంపిడివోలు, ఇవోపిర్డీలు, పలు మండలాల అధికారులు పాల్గొన్నారు. -
రైతు బతుకులో ‘సౌర’ వెలుగులు
- అందుబాటులో సౌర పంపుసెట్లు - నెడ్‌క్యాప్, ట్రాన్స్‌కో శిక్షణ శిబిరాలు అనకాపల్లి: రైతుల విద్యుత్ కష్టాలకు త్వరలో తెర పడనుంది. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా సౌర విద్యుత్ వినియోగంపై అధికారులు సమాయత్తమవుతున్నారు. సౌర విద్యుత్ తో పనిచేసే నీటి పంపుల వినియోగంలో రైతులకు ఎదురయ్యే లాభనష్టాలను అంచనా వేసుకొని, పూర్తిస్థాయి వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ కోత, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్‌ను దృష్టిలో ఉంచుకొని సంప్రదాయ వనరులైన పవన, సౌరశక్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని పాలకులు, అధికారులు గుర్తించారు. పరిశ్రమలకు తోడు, గృహావసరాల విద్యుత్ సరఫరాకు డిమాండ్ పెరగడంతో ఆ ప్రభావం వ్యవసాయ రంగానికి సరఫరా చేసే విద్యుత్‌పై పడింది. దశల వారీగా వ్యవసాయ రంగానికి కేటాయించే విద్యుత్ వేళలను కుదించడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఏడు గంటల పాటు సరఫరా చేసే విద్యుత్‌ను సైతం లోడింగ్‌ను బట్టి ఫీడర్ల వారీగా రెండు విడతలుగా సరఫరా చేయడంతో ఉపయోగం ఉండదని రైతుల వాదన. దీంతో రైతులకు అవగాహన కల్పించి, రాయితీపై సౌర విద్యుత్‌ను అందించేందుకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (నెడ్‌క్యాప్) ముందుకొచ్చింది. ప్రయోగాత్మకంగా శిక్షణ శిబిరాలు నెడ్‌క్యాప్, ట్రాన్స్‌కో శాఖలు ఎంపిక చేసిన రైతులకు సౌర నీటి పంపుల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. దీనికి ఇప్పటికే రెండు శాఖల అధికారులు వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించారు. ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 15వ తే దీన 300 మంది రైతులకు సౌర నీటి పంపుసెట్ల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాలతో వాయిదా వేసిన ఈ సదస్సును ఈ నెల 18న నిర్వహించే అవకాశం ఉంది. సౌర విద్యుత్ పంపుసెట్లకు అవసరమైన మోటార్లు, ప్యానెల్స్‌ను సరఫరా చేసే వివిధ సంస్థలు అవగాహన సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దశల వారీగా సౌర విద్యుత్ పంపుసెట్లను వినియోగంలోకి వస్తే రైతులకు విద్యుత్ కష్టాలు తీరినట్లే.