‘‘ గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళికలు వేయండి..అవే మార్గదర్శకం కావాలంటూ’’ జిల్లా పంచాయతీ అధికారులు ఓ వైపు గొంతుచించుకుంటుంటే..మరోవైపు తమకేదీ పట్టదన్నట్టు కొందరు అధికార సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. సమావేశం జరుగుతుండగానే కొందరు అధికారులు ధైర్యంగా చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లతో సెల్ఫీలు దిగారు. మరికొందరు వీడియోలు చూసుకుంటూ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. శనివారం ఉదయం స్థానిక జెడ్పీసమావేశ మందిరంలో చోటు చేసుకున్న దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.
అరసవల్లి: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలపై టీవోటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమాలు జెడ్పీ కార్యాలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్నాయి. రోజుకో డివిజన్ చొప్పున మూడు డివిజన్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే శనివారం నాడు జరిగిన టెక్కలి డివిజన్ సమావేశంలో పలువురు అధికారులు సెల్‌ఫోన్లతో సెల్ఫీలు దిగగా, మరికొందరు వాట్సాప్ మెసేజ్‌లు, ఫేస్‌బుక్ అక్కౌంట్లు చూసుకుంటూ గడిపేశారు. మరికొందరైతే...చల్లగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఒకవైపు శిక్షణ..మరోవైపు సెల్ వీక్షణలతో సమావేశ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగింది. ఎంతో కీలకమైన పంచాయతీ బడ్జెట్ రూపకల్పన అంశాలను, ప్రభుత్వం లక్ష్యాలు, సాధించే క్రమాలను రిసోర్స్‌పర్సన్లు, అధికారులు వివరంగా చెప్పే ప్రయత్నాలు చేస్తుంటే...పలువురు సిబ్బంది ఎంచక్కా..తమ పనులను సెల్‌ఫోన్లలో చక్కదిద్దుకున్నారు. ఇదిలావుంటే కొందరు కార్యదర్శులు సమావేశానికి ముందుగా హాజరై, తర్వాత కొందరు మార్నింగ్‌షో సినిమాలకు పోతే...మరికొందరు వారి స్వంత పనులను చేసుకుని తీరిగ్గా భోజనాల సమయానికి తిరిగి జెడ్పీ హాల్‌లో హాజరై భోజనాలు చేసి, అధికారికంగా టీఏ బిల్లులు తీసుకుని వెళ్లిపోవడం కనిపించింది. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ హేమసుందరరావు అధ్యక్షతన జరిగిన ఈశిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు హాజరయ్యారు.
చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు: డీపీవో కోటేశ్వరరావు జిల్లాలో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ..తీర్మానాలను సైతం చేయడం లేదని, ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం జరిగిన టీవోటీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పైవిధంగా స్పందించారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య, వీధి లైట్లు, మంచినీటి సరఫరా వంటి మూడు అత్యంత ప్రాధాన్యతాంశాలని, వీటికి అభ్యంతరాలు చెప్పకూడదని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేక చర్యలు చేపడితే వెంటనే నోటీసులు జారీ చేసి బాడీని రద్దు చేసే అధికారం తనకుందని స్పష్టం చేశారు. అలాగే 14వ ఆర్థిక సంఘ నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేస్తే బిల్లులు అవ్వవని గుర్తు చేశారు.
అలా అని సర్పంచులు అక్రమాలు చేస్తున్నారని కాదని, చేస్తున్న పనులు పద్ధతిగా, నిబంధనలకు లోబడి చేయాలని వివరణ ఇచ్చారు. గ్రామ పంచాయతీల బడ్జెట్‌లో పేర్కొన్న పనులు మాత్రమే అధికారికంగా చెల్లుబాటు అవుతాయని, అందుకే సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ హేమసుందరరావు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ముందుచూపుతో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. లేదంటే పరిమితమైన ఫలితాలే ప్రజలకు అందుతాయని వివరించారు. అలాగే లింగ సమానత్వం కూడా ప్రాధాన్యతగా బడ్జెట్‌లో తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో జెడ్పీ అక్కౌంట్స్ అధికారి కిరణ్‌కుమార్, నందిగాం సర్పంచ్ ఎన్.శ్యామల, రిసోర్స్‌పర్సన్లు వెంకటరాజు, హరిహరరావు, ఎంపిడివోలు, ఇవోపిర్డీలు, పలు మండలాల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment