తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సభ్యుల శిక్షణ ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పార్థసారథి
తిరుపతి మంగళం: ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించడంలో చంద్రబాబే కీలకపాత్ర పోషించారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి ఆరోపించారు. తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. చివరి రోజున మదనపల్లె, పూతలపట్టు నియోజకవర్గాల బూత్ కమిటీ సభ్యులకు నిర్వహించిన శిక్షణకు పార్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్ కుమార్, ఎస్ కోట కన్వీనర్ జోగినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, కుంభా రవిబాబు, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. పార్థసారథి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలన స్వర్ణయుగంలా ఉండేదన్నారు.
ప్రజా సంక్షేమం కోసం ఏపని తలపెట్టినా వెనకాముందు చూసేవారు కాదని, ప్రజల సంక్షేమమే తన కళ్ల ముందు కనిపించేదని అన్నారు. గుంటూరు–కృష్ణా జిల్లాకు గుండె కాయలాంటి పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులు నినదిస్తే తెలంగాణ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారంటూ చేతులెత్తేసిన పిరికిపంద చంద్రబాబు అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పులిచింతల ప్రాజక్టును పూర్తి చేసిన ఘనుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలను అబద్ధాలు, కల్లబొల్లి మాటలతో మోసగించడం, అవినీతి అక్రమాలతో దోచుకోవడం, దాచుకోవడం తప్ప చంద్రబాబుకు మరొకటి తెలియదన్నారు. రాజధాని పేరుతో పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేల కోట్లు దండుకున్న దుర్మార్గుడన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్నాడని మండిపడ్డారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించారు..
వైఎస్ ఐదేళ్ల పాలన రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలించారని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ఫైల్‌పై మొదటి సంతకాన్ని చేశారన్నారు. రాష్ట్రంలోని అంగుళం భూమి కూడా బీడుగా ఉండకూడదన్న ఉద్దేశంతో జలయజ్ఞనం పేరుతో నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. అలాంటి పాలనను తిరిగి తీసుకురావడం కోసం బూత్ కన్వీనర్లు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒక్కొక్కరు వంద నుంచి 150ఓట్లు వేయించేలా ఉండాలన్నారు.
చంద్రబాబు అవినీతి అక్రమాలకు 40ఏళ్లు..
చంద్రబాబు అవినీతి అక్రమాలకు 40ఏళ్లు అని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.సునీల్ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలను అబద్ధాలు, మాయమాటలతో మోసగిస్తున్నాడన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని బూత్ కన్వీనర్లు యుద్ధంలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్వార్థం..కుట్ర.. ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
స్వార్థం.. ద్రోహం.. కుట్రకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పడంలో ఆయన దిట్ట అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మొదటి నుంచి జగనన్న ఉద్యమిస్తుంటే హోదాపై నోరుమెదపని ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలైనా అర్పించడానికి వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధంగా ఉన్నామన్నారు. నవరత్నాల లాంటి పథకాల గురించి ప్రజలకు వివరించి, పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
సోషియల్ మీడియా ద్వారా జనంలోకి..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు చేస్తున్న విష ప్రచారాన్ని ఎదుర్కొని, ప్రజాసంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నవరత్నాలను సోషియల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్లా మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేటి సమాజంలో సోషియల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment