పిఠాపురం: మనసును.. దృష్టిని లక్ష్యంపై కేంద్రీకరించి వంద శాతం ఏకాగ్రతతో ఆడాల్సిన ఆట విలువిద్య. సనాతన భారత ఇతిహాసాలలో కనిపించే విలు విద్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆర్చరీ క్రీడను నేర్చుకునేందుకు చిన్నారులు క్యూ కడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, ఆలమూరు, రాజోలు, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో వేసవి విలు విద్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్రీడాకారులు 200లకు పైగా ఉండగా.. రిజిస్టర్ కాని క్రీడాకారులు వెయ్యి మందికి పైగా ఉన్నారు. వీరిలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలు సాధించిన క్రీడాకారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలు విద్యా క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఆర్చరీకి డిమాండ్ పెరిగింది. వేసవి శిబిరాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారంటే..
దేశానికి పేరు తెస్తా
చిన్నప్పటి నుంచి విలువిద్య అంటే ప్రాణం. 2016లో జిల్లాస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం, 2022లో సీనియర్స్ విభాగంలో స్వర్ణ పతకం, సీనియర్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఇంటర్ చదివిన నేను ప్రస్తుతం తాపీ పని చేసుకుంటూ ఆర్చరీలో మరింతగా శిక్షణ పొందుతున్నాను. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మరిన్ని పతకాలు సాధించి దేశానికి.. రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్న సంకల్పంతో ఉన్నాను. – పి.కృష్ణ, పిఠాపురం
జాతీయ స్థాయిలో రాణిస్తా
పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్నా. చిన్నప్పటి నుంచి పుల్లలతో బాణాలు తయారు చేసుకోవడం సరదా. దానిని చూసిన మా స్కూల్ పీడీ మంగయ్యమ్మ నన్ను విలువిద్య నేర్చుకోమని చెప్పారు. అందుకే.. శిక్షణ పొందుతున్నాను. 2016లో కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాను. 2023 కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. – పి.మహాలక్ష్మి, పిఠాపురం
శిక్షణ బాగుంది
నేను 3వ తరగతి చదువుతున్నాను. బాణాలంటే చాలా ఇష్టం. అది చూసి అమ్మానాన్న విలువిద్య నేర్పించారు. కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లాస్థాయి ఆర్చరీ పోటీల్లో రజత పతకం సాధించా. జాతీయ స్థాయిలో రాణించాలన్న సంకల్పంతో శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ శిక్షణ బాగుంది. – ఎస్.కృష్ణ అభిరామ్, పిఠాపురం
ఆసక్తి పెరిగింది
విలువిద్యపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఏటా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించడమే ధ్యేయంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో విలువిద్య క్రీడాకారులకూ ఉద్యోగావకాశాలు కల్పిస్తుండటంతో ప్రోత్సాహం పెరిగింది. – పి.లక్ష్మణరావు, ఆర్చరీ కోచ్, పిఠాపురం
Comments
Please login to add a commentAdd a comment