2,400 మెగావాట్ల రెండో దశ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీతో ఒప్పందంపై సర్కారు విముఖత
ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే 5–8 ఏళ్ల తర్వాతే విద్యుత్ అందుబాటులోకి వచ్చేది
ఆలోగా యూనిట్ విద్యుత్ ధర రూ. 8–9కి పెరిగే అవకాశం.. దానివల్ల రూ. వేల కోట్ల అనవసర భారం
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 2,400 (3్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5–8 ఏళ్ల సమయం పట్టనుందని, దీని ద్వారా వచ్చే విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 8–9 ఎగబాకుతుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది.
బహిరంగ మార్కెట్లో దీనికన్నా తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా ఇంత భారీ ధరతో 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రజలపై రూ. వేల కోట్ల అనవసర భారం పడుతుందని తేల్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీతో రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సత్వరమే ఒప్పందం చేసుకోకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేయడంతో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది.
విభజన చట్టం కింద ఏర్పాటు..: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 1,600 (2 ్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 5.90 ఉండగా ఒప్పందం కారణంగా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి ఉంది.
గత సర్కారు తప్పిదమే!
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్‌లో 2,400 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ కింద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వీలుగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా పదేళ్లపాటు కాలయాపన చేయడమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అప్పట్లో ఒప్పందం చేసుకొని ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తై తక్కువ ధరకు విద్యుత్ రాష్ట్రానికి వచ్చేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పడు ఒప్పందం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత సర్కారు అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడంతోపాటు విచ్చలవిడి విధానాలను అనుసరించడం వల్ల గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది.
ఇక కొత్త థర్మల్ ప్లాంట్లకు స్వస్తి..
దామరచర్లలో తెలంగాణ జెన్‌కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే పూర్తికావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ. 6–10 కోట్లకు పెరిగింది. కాలంచెల్లిన సబ్–క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.
యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది. ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో రూ. 2–4కు యూనిట్ చొప్పున లభిస్తున్న పునరుద్పాదక విద్యుత్‌తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సౌర, జల, పవన, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ విద్యుత్‌పై సర్కారు దృష్టిపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment