తెలంగాణ జెన్‌కోకు ఏపీ జెన్‌కో ఎండీ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో తీరుపై ఆంధ్రప్రదేశ్ జెన్‌కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిల చెల్లింపులో మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏమాత్రం గౌరవించకపోవడం భావ్యం కాదని పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి ఇవ్వాల్సిన విద్యుత్‌ను నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కోఎండీ విజయానంద్ ఈ నెల 20వ తేదీన తెలంగాణ జెన్‌కోకు లేఖ రాసినట్లు సమాచారం.
బకాయిల చెల్లింపు అంశాన్ని కేంద్రం దృష్టికీ తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు 53.89, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ వాటాను కేటాయించారు. 2014 జూన్ నుంచి సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) రెండు రాష్ట్రాల విద్యుత్ వాడకాన్ని షెడ్యూల్డ్ చేస్తోంది. తెలంగాణ కంటే ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. దీంతో తెలంగాణ తీసుకునే విద్యుత్ ఎక్కువగాను, ఇచ్చే విద్యుత్ తక్కువగానూ ఉంటోంది. రెండు రాష్ట్రాల జెన్‌కోలు ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు డబ్బులు లెక్కగట్టి ఇవ్వాలి.
ఈ లెక్కన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకూ ఏపీ జెన్‌కో తెలంగాణ జెన్‌కోకు రూ.1,393 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఏపీ జెన్‌కోకు తెలంగాణ జెన్‌కో చెల్లించాల్సిన మొత్తం రూ.2,426 కోట్లు. ఏడాది కాలంగా తెలంగాణ చెల్లించకపోవడంతో, ఏపీ కూడా చెల్లించలేదు. రెండు నెలల క్రితం ఈ విషయమై ఏపీ జెన్‌కో తెలంగాణ అధికారుల వద్ద ప్రస్తావించింది. తాము చెల్లించాల్సిన మొత్తాన్ని మినహాయించుకుని మిగతాది ఇవ్వాలని కోరింది.
ఈ లెక్కన తెలంగాణ తమకు రూ.1,033 కోట్లు చెల్లించాలని ఏపీ జెన్‌కో లెక్కలేసి చెప్పింది. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏపీ జెన్‌కో ఎండీ ఈ నెల 10న తెలంగాణ జెన్‌కోకు లేఖ రాశారు. దీనికి బదులివ్వకపోవడంతో 20వ తేదీన మరో లేఖ రాశారు. దీంతో తెలంగాణ జెన్‌కో శుక్రవారం రూ.50 కోట్లు చెల్లించింది. మిగిలిన సొమ్ము సంగతి తేల్చలేదు. తెలంగాణ డబ్బులు ఇవ్వకపోతే తమ జెన్‌కోను ఎలా నడిపించాలని ఏపీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కట్
Published Mon, Jul 27 2015 1:29 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement