Arrears Payment
-
Yes Bank: యస్ బ్యాంక్ నష్టం 3,790 కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఏకంగా రూ. 3,790 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. ఆదాయం క్షీణించడం, మొండిబాకీలకు ప్రొవిజనింగ్ భారీగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,665 కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను యస్ బ్యాంక్ నికర నష్టాలు రూ. 16,432 కోట్ల నుంచి రూ. 3,488 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పునర్వ్యవస్థీకరించే అవకాశమున్న రుణాల కోసం కూడా ముందుగా ప్రొవిజనింగ్ చేసినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో మొండిబాకీలకు ప్రొవిజనింగ్ రూ. 5,239 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 4,872 కోట్లుగా ఉంది. మరో రూ.5,000 కోట్ల రికవరీ లక్ష్యం..: అసెట్ క్వాలిటీపరమైన సమస్యలు ఇక ముగిసినట్లేనని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కనీసం రూ. 5,000 కోట్లు రికవరీ చేయాలని నిర్దేశించుకున్నట్లు కుమార్ వివరించారు. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోను 15% పెంచుకోవాలని, రిటైల్ రుణాలను 20% పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యస్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో రిటైల్, చిన్న రుణాల వాటా 51% దాకా ఉంది. క్రమంగా మళ్లీ కార్పొరేట్ రుణాలను ఇవ్వనున్నట్లు, ఈ విభాగంలో 10% వృద్ధి అంచనా వేస్తున్నట్లు కుమార్ తెలిపారు. మార్చి క్వార్టర్లో రూ. 3,500 కోట్ల కొత్త రుణాలిచ్చినట్లు పేర్కొన్నారు. అటు స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం 16.80% నుంచి 15.41%కి తగ్గాయి. జూన్ క్వార్టర్లో రూ. 2,500 కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నట్లు.. వీటిలో సింహభాగం కార్పొరేట్ విభాగానివే ఉండొచ్చని కుమార్ తెలిపారు. -
టెల్కోలకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల భారంతో కుంగుతున్న టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు కాస్త ఊరట కల్పించింది. బకాయిల చెల్లింపునకు 10 సంవత్సరాల వ్యవధినిచ్చింది. 2021 మార్చి 31లోగా బాకీలో 10 శాతం భాగాన్ని కట్టాలని ఆదేశించింది. ఆయా టెల్కోల మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ) లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) బకాయిల చెల్లింపునకు సంబంధించి నాలుగు వారాల్లోగా వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయిదాలను చెల్లించని పక్షంలో జరిమానా, వడ్డీ విధించడంతో పాటు కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద చర్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు స్పెక్ట్రంను విక్రయించే అంశంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తుది ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. బాకీల లెక్కింపునకు సంబంధించి టెలికం శాఖ లెక్కలు, గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో మార్పేమీ ఉండబోవని జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. వాస్తవానికి బాకీల చెల్లింపునకు టెల్కోలు, టెలికం శాఖ (డాట్) 20 ఏళ్ల వ్యవధికి అనుమతి కోరాయి. కానీ దాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు పదేళ్ల వ్యవధికి అనుమతించడం గమనార్హం. వొడాఫోన్‌కు కష్టం.. ఎయిర్‌టెల్‌కు ఫర్వాలేదు.. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల వ్యవధిలో బాకీలన్నీ కట్టాలంటే వొడాఫోన్ ఐడియాకు కష్టంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్టెల్ మాత్రం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఎనిమిది శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే ఏటా భారతీ ఎయిర్టెల్ రూ. 3,900 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 7,500 కోట్లు కట్టాల్సి వస్తుందని లెక్క వేసింది. ఒకవేళ వడ్డీ భారం గానీ లేకపోతే ఇది రూ. 2,600 కోట్లు /రూ. 5,000 కోట్లకు తగ్గవచ్చని వివరించింది. ఇంకా వడ్డీ రేటు విషయంలో నిర్దిష్ట ఉత్తర్వులేమీ లేవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఈక్విటీ స్ట్రాటెజిస్ట్ బ్రోకింగ్ విభాగం) హేమంగ్ జానీ తెలిపారు. ‘ఎయిర్‌సెల్, వీడియోకాన్ కట్టాల్సిన బాకీల భారం ఎయిర్‌టెల్‌పై పడదు. అలాగే ఆర్‌కామ్ బకాయిల భారం రిలయన్స్ జియోపై ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎయిర్టెల్, రిలయన్స్‌లకు సానుకూలమైనవే కాగలవు‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రీపేమెంట్ గడువులోగా లైసెన్సుల వ్యవధి ముగిసిపోయే టెలికం సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనమ్ చంద్వాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి టెల్కోలు లైసెన్సును రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైతే పదేళ్ల వ్యవధి కన్నా ముందే బకాయి మొత్తం కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఏం జరిగింది.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీలను కేంద్రానికి టెలికం సంస్థలు కట్టాల్సిందేనని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చింది. డాట్ లెక్కించిన దాని ప్రకారం టెల్కోలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు పైచిలుకు కట్టాల్సి ఉంది. అయితే, తమ సొంత లెక్కల ప్రకారం తమ బాకీలు అంత భారీ స్థాయిలో లేవంటూ టెల్కోలు కొంతమేర కట్టాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున మిగతాది కట్టేందుకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కోరాయి. అటు టెలికం శాఖ కూడా 20 ఏళ్ల వ్యవధినివ్వడంపై ఈ ఏడాది మార్చిలో అఫిడవిట్ దాఖలు చేసింది. వాయిదా పద్ధతిలో బాకీలు చెల్లించడంపై జూలై 20న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. అయితే, బాకీ మొత్తం విషయానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులేమీ ఉండబోవంటూ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో టెలికం కంపెనీల గత పదేళ్ల ఖాతాలు సమర్పించాలని సూచించింది. అటు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందం వివరాలు కూడా ఇవ్వాలని ఆగస్టు 14న సూచించింది. తాజాగా బాకీల చెల్లింపు వ్యవధి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. -
విద్యుత్ బకాయిలు రూ.430 కోట్లు
కొత్తపల్లి(కరీంనగర్): టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బకాయిలు గుట్టలా పేరుకుపోతున్నాయి. మొండి బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ సంస్థలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి రాకపోవడంతో బకాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా బకాయిల భారంగా మిగిలిపోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించినా వాటిని ఇన్స్టాల్ చేయకపోవడంతో మొండి బకాయిలు నెలనెలా పెరుగుతున్నాయి. విద్యుత్‌సంస్థ ఉదాసీనత, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం మూలంగా కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తగా ఇప్పటి వరకు 2,308 సింగిల్ ఫేజ్, 543 త్రీఫేజ్ ప్రీ పెయిడ్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ శాఖ బిగించింది. బిగించిన మీటర్లు ఇన్స్టాలేషన్ చేయకపోవడంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.430,47,9700 కోట్లు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆలోచన అద్భుతం.. ఆచరణ శూన్యం.. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలకు చెక్ పెట్టేందుకు విద్యుత్ సంస్థలు చేపట్టిన ప్రీ పెయిడ్ మీటర్ల ఆలోచన బాగున్నప్పటికీ వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆశించిన ఫలితం దక్కడం లేదు. కరీంనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటి వరకు 727 సింగిల్ ఫేజ్, 295 త్రీ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డగోలుగా విద్యుత్ దుబారా అవుతున్నట్లు గుర్తించిన విద్యుత్ అధికారులు ప్రీ పెయిడ్ మీటర్ల ద్వారా అదుపు చేయాలని నిర్ణయించారు. లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అవసరానికి మించి వాడటంతో విద్యుత్ దుబారా కావడంతోపాటు బిల్లులు చెల్లించకపోవడం విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారింది. విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఉన్నతాధికారుల సిఫారసులతో విద్యుత్ పునరుద్ధరించుకోవడం పరిపాటిగా మారింది. మొండి బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ అనేకమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ ఒత్తిడిలకు తలొగ్గి సరఫరా చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ శాఖలే కాదా.. అంటూ బకాయిలపై నిర్లక్ష్యం వహించడంతో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు వసూలు చేయడం విద్యుత్ శాఖకు తలకుమించిన భారంగా మారుతోంది. అయినా అడపాదడపా చర్యలు చేపడుతోంది. కానీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోతోంది. కనీసం ప్రీ పెయిడ్ మీటర్లనైనా ఇన్స్టాలేషన్ చేస్తే విద్యుత్ బకాయిల వసూలుతోపాటు వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రూ.430.47 కోట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో రూ.430,47,97 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఏడాదికేడాది ఈ బకాయిలు పెరుగుతున్నాయే తప్ప చెల్లింపులు మాత్రం చేయకపోవడం విద్యుత్ శాఖకు భారంగా మారుతోంది. విద్యుత్ సర్వీసులు నిలిపివేస్తే క్షణాల్లోనే పునరుద్ధరణ కోసం పైరవీలు.. దీంతో ఏం చేయలేని విద్యుత్ శాఖ తిరిగి సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని బకాయిలను నిలువరించాలంటే ప్రీ పెయిడ్ మీటర్లు పూర్తిస్థాయిలో పని చేయాల్సి అవసరం ఉంది. ఆ దిశగా విద్యుత్ అధికారులు అడుగులేస్తే తప్ప విద్యుత్ బకాయిల వసూళ్లు కష్టసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై ఎన్నికల ఫలితాల అనంతరం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. బకాయిలు చెల్లించని శాఖల విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం. ప్రతినెలా నోటీసులిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రీపెయిడ్ మీటర్లను ఇన్స్టాలేషన్ చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించి సహకరించాలి. – కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కట్
తెలంగాణ జెన్కోకు ఏపీ జెన్కో ఎండీ లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో తీరుపై ఆంధ్రప్రదేశ్ జెన్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిల చెల్లింపులో మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏమాత్రం గౌరవించకపోవడం భావ్యం కాదని పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి ఇవ్వాల్సిన విద్యుత్‌ను నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కోఎండీ విజయానంద్ ఈ నెల 20వ తేదీన తెలంగాణ జెన్కోకు లేఖ రాసినట్లు సమాచారం. బకాయిల చెల్లింపు అంశాన్ని కేంద్రం దృష్టికీ తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు 53.89, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ వాటాను కేటాయించారు. 2014 జూన్ నుంచి సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) రెండు రాష్ట్రాల విద్యుత్ వాడకాన్ని షెడ్యూల్డ్ చేస్తోంది. తెలంగాణ కంటే ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. దీంతో తెలంగాణ తీసుకునే విద్యుత్ ఎక్కువగాను, ఇచ్చే విద్యుత్ తక్కువగానూ ఉంటోంది. రెండు రాష్ట్రాల జెన్కోలు ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు డబ్బులు లెక్కగట్టి ఇవ్వాలి. ఈ లెక్కన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకూ ఏపీ జెన్కో తెలంగాణ జెన్కోకు రూ.1,393 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఏపీ జెన్కోకు తెలంగాణ జెన్కో చెల్లించాల్సిన మొత్తం రూ.2,426 కోట్లు. ఏడాది కాలంగా తెలంగాణ చెల్లించకపోవడంతో, ఏపీ కూడా చెల్లించలేదు. రెండు నెలల క్రితం ఈ విషయమై ఏపీ జెన్కో తెలంగాణ అధికారుల వద్ద ప్రస్తావించింది. తాము చెల్లించాల్సిన మొత్తాన్ని మినహాయించుకుని మిగతాది ఇవ్వాలని కోరింది. ఈ లెక్కన తెలంగాణ తమకు రూ.1,033 కోట్లు చెల్లించాలని ఏపీ జెన్కో లెక్కలేసి చెప్పింది. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏపీ జెన్కో ఎండీ ఈ నెల 10న తెలంగాణ జెన్కోకు లేఖ రాశారు. దీనికి బదులివ్వకపోవడంతో 20వ తేదీన మరో లేఖ రాశారు. దీంతో తెలంగాణ జెన్కో శుక్రవారం రూ.50 కోట్లు చెల్లించింది. మిగిలిన సొమ్ము సంగతి తేల్చలేదు. తెలంగాణ డబ్బులు ఇవ్వకపోతే తమ జెన్కోను ఎలా నడిపించాలని ఏపీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.