విద్యుత్‌ బకాయిలు రూ.430 కోట్లు  | Prepaid Electricity Arrears Pending Karimnagar | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బకాయిలు రూ.430 కోట్లు 

Published Mon, May 20 2019 9:00 AM | Last Updated on Mon, May 20 2019 9:00 AM

Prepaid Electricity Arrears Pending Karimnagar - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌):  టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ బకాయిలు గుట్టలా పేరుకుపోతున్నాయి. మొండి బకాయిలకు చెక్‌ పెట్టేందుకు విద్యుత్‌ సంస్థలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రీ పెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు అందుబాటులోకి రాకపోవడంతో బకాయిలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా బకాయిల భారంగా మిగిలిపోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించినా వాటిని ఇన్‌స్టాల్‌ చేయకపోవడంతో మొండి బకాయిలు నెలనెలా పెరుగుతున్నాయి.

విద్యుత్‌సంస్థ ఉదాసీనత, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం మూలంగా కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తగా ఇప్పటి వరకు 2,308 సింగిల్‌ ఫేజ్, 543 త్రీఫేజ్‌ ప్రీ పెయిడ్‌ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ శాఖ బిగించింది. బిగించిన మీటర్లు ఇన్‌స్టాలేషన్‌ చేయకపోవడంతో విద్యుత్‌ బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.430,47,9700 కోట్లు విద్యుత్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
 
ఆలోచన అద్భుతం.. ఆచరణ శూన్యం..
ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బకాయిలకు చెక్‌ పెట్టేందుకు విద్యుత్‌ సంస్థలు చేపట్టిన ప్రీ పెయిడ్‌ మీటర్ల ఆలోచన బాగున్నప్పటికీ వాటి నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆశించిన ఫలితం దక్కడం లేదు. కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటి వరకు 727 సింగిల్‌ ఫేజ్, 295 త్రీ ఫేజ్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డగోలుగా విద్యుత్‌ దుబారా అవుతున్నట్లు గుర్తించిన విద్యుత్‌ అధికారులు ప్రీ పెయిడ్‌ మీటర్ల ద్వారా అదుపు చేయాలని నిర్ణయించారు. లైట్లు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అవసరానికి మించి వాడటంతో విద్యుత్‌ దుబారా కావడంతోపాటు బిల్లులు చెల్లించకపోవడం విద్యుత్‌ శాఖకు తలనొప్పిగా మారింది.

విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తే ఉన్నతాధికారుల సిఫారసులతో విద్యుత్‌ పునరుద్ధరించుకోవడం పరిపాటిగా మారింది. మొండి బకాయిలు వసూలు చేసేందుకు విద్యుత్‌ శాఖ అనేకమార్లు విద్యుత్‌ సరఫరా నిలిపివేసినప్పటికీ ఒత్తిడిలకు తలొగ్గి సరఫరా చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ శాఖలే కాదా.. అంటూ బకాయిలపై నిర్లక్ష్యం వహించడంతో కోట్ల రూపాయల బకాయిలు పేరుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ బకాయిలు వసూలు చేయడం విద్యుత్‌ శాఖకు తలకుమించిన భారంగా మారుతోంది. అయినా అడపాదడపా చర్యలు చేపడుతోంది. కానీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోతోంది. కనీసం ప్రీ పెయిడ్‌ మీటర్లనైనా ఇన్‌స్టాలేషన్‌ చేస్తే విద్యుత్‌ బకాయిల వసూలుతోపాటు వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుందని విద్యుత్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రూ.430.47 కోట్లు
టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలో రూ.430,47,97 కోట్ల విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. ఏడాదికేడాది ఈ బకాయిలు పెరుగుతున్నాయే తప్ప చెల్లింపులు మాత్రం చేయకపోవడం విద్యుత్‌ శాఖకు భారంగా మారుతోంది. విద్యుత్‌ సర్వీసులు నిలిపివేస్తే క్షణాల్లోనే పునరుద్ధరణ కోసం పైరవీలు.. దీంతో ఏం చేయలేని విద్యుత్‌ శాఖ తిరిగి సరఫరా పునరుద్ధరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని బకాయిలను నిలువరించాలంటే ప్రీ పెయిడ్‌ మీటర్లు పూర్తిస్థాయిలో పని చేయాల్సి అవసరం ఉంది. ఆ దిశగా విద్యుత్‌ అధికారులు అడుగులేస్తే తప్ప విద్యుత్‌ బకాయిల వసూళ్లు కష్టసాధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రత్యేక డ్రైవ్‌ 
ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలపై ఎన్నికల ఫలితాల అనంతరం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం. బకాయిలు చెల్లించని శాఖల విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తాం. ప్రతినెలా నోటీసులిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రీపెయిడ్‌ మీటర్లను ఇన్‌స్టాలేషన్‌ చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించి సహకరించాలి. – కె.మాధవరావు, ఎస్‌ఈ, కరీంనగర్‌ సర్కిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement