సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం చెల్లించా ల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. విద్యుత్ బకాయిలు చెల్లింపులపై తెలంగాణకు ఆ రాష్ట్ర హైకోర్టులో అనుకూలంగా వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్‌కో తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసిందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ చెల్లించా ల్సిన రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంటూ ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 లోబడి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఏపీకి తెలంగాణ చెల్లించా ల్సిన రూ.3,441.78 కోట్లను అసలుతో పాటు రూ.3,315.14 కోట్ల లేట్ పేమెంట్ సర్‌చార్జీల రూపంలో చెల్లించాలని మంత్రిత్వశాఖ ఆదేశించినట్టు వివరించారు.
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఈ మేరకు 2022 ఆగస్టు 29న ఏపీకి తెలంగాణ చెల్లించా ల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలను కొట్టేస్తూ హైకోర్టు 2023 అక్టోబర్ 19న తీర్పు వెలువరించిందని కేంద్రమంత్రి తెలిపారు.
ఎంబీబీఎస్ కొత్త పాఠ్య ప్రణాళిక
ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం జాతీయ మెడికల్ కమిషన్ కొత్త బోధన ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఏడాది ఆగస్ట్ 1న జారీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. కొత్త బోధన ప్రణాళిక కింద వృత్తిపరంగా మొదటి సంవత్సరంలో ‘కుటుంబ దత్తత కార్యక్రమం–లక్ష్యాలు అందుకోవడం‘ అనే పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ స్థితిగతులను అర్థం చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఏపీలో 45,84,548 కిసాన్ క్రెడిట్ కార్డులు
ఏపీలో సెప్టెంబర్ 2023 నాటికి రూ.60,576.14 కోట్లతో కో–ఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డులు 45,84,548 ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భగవంత్ కరాద్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఎన్నికల కమిషనర్ల బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామక బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తోందని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు ఎన్నికల సంఘానికి అప్పగించారన్నారు.
ప్రధాని అధ్యక్షతన లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రివర్గ సభ్యుడితో ఏర్పాటు చేసే కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లు నియామకంపై రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారని బిల్లు చెబుతోందన్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా, ప్రజలు పరిరక్షించేలా బిల్లు ఉందని బోస్ పేర్కొన్నారు.
ఉద్యాన రంగానికి మద్దతు ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యాన రంగానికి కేంద్రం మద్దతు ఇవ్వడంతోపాటు అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తానరావు కోరారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఏపీ పలు సవాళ్లు ఎదుర్కోంటోందన్నారు. రాష్ట్రంలో ఉద్యాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతూ ముఖ్యమైన కేంద్రంగా మారిందన్నారు. పూర్ సాయిల్ మేనేజ్‌మెంట్‌తోపాటు రవాణా, కోల్డ్ స్టోరేజీలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్టంలో ఉద్యానరంగ అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment