కృష్ణపట్నం కరెంటు మాకొద్దు!
♦ శాశ్వతంగా వదులుకోవాలని తెలంగాణ సర్కారు నిర్ణయం
♦ ఏపీ జెన్‌కోకు టీ జెన్‌కో లేఖ
♦ పీపీఏల నుంచి తమ డిస్కంలు వైదొలగుతున్నట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్‌ను శాశ్వతంగా వదులుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేలటూరులో 1600(2ఁ800) మెగావాట్ల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్(ఏపీపీడీసీఎల్) నిర్మించిన కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాలను వదులుకుంటున్నామని పేర్కొంటూ తెలంగాణ ట్రాన్స్‌కో యాజమాన్యం తాజాగా ఏపీ జెన్‌కో ఎండీ కావేటి విజయానంద్‌కు లేఖ రాసింది. కృష్ణపట్నం విద్యుత్‌పై ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకోగా.. ఈ పీపీఏల నుంచి తెలంగాణ డిస్కంలు వైదొలగనున్నాయని లేఖలో స్పష్టం చేసింది. కృష్ణపట్నం ప్రాజెక్టు కోసమే అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా ఏపీపీడీసీఎల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు మూల ధనంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకూ వాటాలున్నాయి.
మొదట్లో కరెంటు కోసం లొల్లి
విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం విద్యుత్‌లో తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. ఈ లెక్కన తెలంగాణకు 862 మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం కృష్ణపట్నం, హిందూజా విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ససేమిరా అనడంతో వివాదం రేగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాల పరిష్కారం కోసం గతేడాది కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ) చైర్మన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా భారీ ఎత్తున విద్యుత్ కొనుగోళ్లను ప్రారంభించడంతో తాత్కాలికంగానైనా ఏడాది కాలంగా రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరింది. కృష్ణపట్నం ప్రాజెక్టు తొలి యూనిట్ నుంచి వాణిజ్యపర విద్యుదుత్పత్తి గత ఏప్రిల్‌లో, రెండో యూనిట్ నుంచి ఆగస్టులో ప్రారంభమైంది. కృష్ణపట్నం నుంచి వాటాలు తీసుకుంటారో లేదో తెలపాలని దక్షిణ ప్రాంత విద్యుత్ లోడ్ డిస్పాచ్ కేంద్రం(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ఇప్పట్లో అవసరం లేదని గత ఏప్రిల్ 18న తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాశారు.
మారిన ఇరు రాష్ట్రాల వైఖరి
కృష్ణపట్నం నిర్మాణ వ్యయం భారీగా పెరగడం, విదేశీ బొగ్గును వినియోగం వల్ల యూనిట్ విద్యుత్ వ్యయం రూ.5-6 మధ్య ఉండనుందని ప్రచారం జరిగింది. దీంతో అధిక ధరతో కృష్ణపట్నం విద్యుత్‌ను కొనుగోలు చేయకూడదని ఆర్నెల్ల కిందే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఏపీ విద్యుత్ తీసుకోమని సీఎం కేసీఆర్ అప్పట్లో అసెంబ్లీ వేదికగా ప్రకటన సైతం చేశారు. ఆ తర్వాత ఏపీ కూడా తన వైఖరి మార్చుకుని కృష్ణపట్నం విద్యుత్ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బదులుగా తెలంగాణలో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల సింగరేణి, 600 మెగావాట్ల కేటీపీపీ విద్యుత్ కేంద్రాల విద్యుత్‌లో వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. సింగరేణి, కేటీపీపీ ప్రాజెక్టులకు అత్యంత సమీపంగా సింగరేణి బొగ్గు అందుబాటులో ఉండడంతో విద్యుత్ వ్యయం యూనిట్‌కు రూ.3-4 మధ్యే ఉండనుందని అంచనా. కృష్ణపట్నం విద్యుత్ ధరలతో పోల్చితే ఇది చాలా తక్కువ. కృష్ణపట్నం విద్యుత్‌ను తీసుకుంటే సింగరేణి, కేటీపీపీల విద్యుత్ ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.