సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవకుండా వీలైనంత త్వరగా దీనిపై స్పందించి ఏపీకి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తెలంగాణ ఏర్పాటు తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తరలించిన నీటి లెక్కలను వివరించారు.
కేటాయింపులకు విరుద్ధంగా తరలింపు
‘కృష్ణా బేసిన్‌కు ఆవల ఎలాంటి అనుమతుల్లేని ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలిస్తోంది. 1976, 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, 1981లో ప్రణాళిక సంఘం అనుమతుల మేరకు ఏపీ కేవలం 15 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు తరలించాల్సి ఉంది. మరో 19 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్‌ఆర్‌బీసీకి తరలించాల్సి ఉంది. అదికూడా జూలై, అక్టోబర్ నెలల మధ్యే తరలించాల్సి ఉంది. కానీ ఏపీ ఏటా కేటాయింపులకు విరుద్ధంగా అధికంగా నీటిని తరలిస్తోంది. గత రెండేళ్లుగా చూసినా.. 2019–20లో 179.3 టీఎంసీలు, 2020–21లో 129.45 టీఎంసీలు తరలించింది. ఈ ఏడాది సైతం ఆగస్టు 7 నాటికి 25 టీఎంసీల మేర తరలించింది.
శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టే
ఏపీ ఒకపక్క అక్రమంగా నీటిని తరలిస్తూనే, మరోపక్క శ్రీశైలంలో తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని ఆపాలని బోర్డును కోరుతోంది. వాస్తవానికి శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టే. విద్యుదుత్పత్తి ద్వారానే సాగర్‌కు నీటిని తరలించాల్సి ఉంటుంది. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా 30 నుంచి 35 లక్షల బోర్‌వెల్‌లపై, నదుల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంపైనే ఆధారపడి ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉధృతంగా సాగుతున్న ఖరీఫ్ అవసరాలకు పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అదీగాక బచావత్ అవార్డు ప్రకారం నాగార్జునసాగర్ కింద సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు 280 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా మరో 16.50 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అవసరాలన్నిటి దృష్ట్యా సాగర్‌కు నీటి విడుదల అత్యంతావశ్యకం. అందువల్ల పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపేలా చూడండి..’అని స్పెషల్ సీఎస్ కృష్ణా బోర్డును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment