సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం  | RMC Decided To Krishna Board On Srisailam Reservoir Water Usage | Sakshi
Sakshi News home page

సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం 

Published Sat, Dec 10 2022 2:30 AM | Last Updated on Sat, Dec 10 2022 2:30 AM

RMC Decided To Krishna Board On Srisailam Reservoir Water Usage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి వినియోగంలో సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆర్‌ఎంసీ (జలాశయాల నిర్వహణ కమిటీ) తేల్చిచెప్పింది. రుతుపవనాల కాలంలో జూలై 1 నుంచి అక్టోబర్‌ 31 వరకూ ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులకు పైనే ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వర్కింగ్‌ అరేంజ్‌మెంట్‌ ప్రకారం.. శ్రీశైలం వద్ద ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం (50: 50) పంచుకోవాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు ఆర్‌ఎంసీ కన్వీనర్‌ ఆర్కే పిళ్లై తుది నివేదిక ఇచ్చారు. డిసెంబర్‌ 3న నిర్వహించిన ఆర్‌ఎంసీ ఆరో సమావేశంలో తుది నివేదికను రెండు రాష్ట్రాలు అంగీకరించినా.. దానిపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్‌ 5న ఏర్పాటుచేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారని, దీంతో ఆర్‌ఎంసీలో మిగతా సభ్యులైన నలుగురు (కన్వీనర్‌ ఆర్కే పిళ్లై, కృష్ణా బోర్డు సభ్యులు మౌతాంగ్, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్‌కో డైరెక్టర్‌ ఎమ్వీవీ సత్యనారాయణ) తుది నివేదికపై సంతకాలు చేశారని తెలిపారు.

ఈ తుది నివేదికపై బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కృష్ణా బోర్డు ఆమోదించాకే ఆర్‌ఎంసీ నివేదిక అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు నోటిఫై అయ్యే దాకా ఈ నివేదిక అమల్లో ఉంటుందని తెలిపారు. ఆర్‌ఎంసీ తుది నివేదిక, సీడబ్ల్యూసీ రూల్‌ కర్వ్స్‌ ఆధారంగా నీటి కేటాయింపులకు రక్షణ కల్పి ంచాలంటూ రెండు రాష్ట్రాలు కేడబ్ల్యూడీటీ–2ను కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఆర్‌ఎంసీ తుది నివేదికలో మరికొన్ని ప్రధానాంశాలు ఇవీ.. 
►శ్రీశైలం జలాశయంలో 75 శాతం లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలి. ఆ తర్వాతే విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి.  

►శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

►ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అక్టోబర్‌ 31 వరకూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన నీటిని నిల్వ చేయాలి. 

►శ్రీశైలంకు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్‌ 31 మధ్య ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ మిలియన్‌ యూనిట్లలో లెక్కకట్టి.. దాన్ని ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలి. 

►నాగార్జునసాగర్‌కు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్‌ 31 మధ్య రూల్‌ కర్వ్‌లో నిర్ణయించిన నీటి మట్టం కంటే ఎక్కువగా ఉంటే విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఉత్పత్తయిన విద్యుత్‌ను లెక్కకట్టాలి. వరద తగ్గాక.. దిగువున సాగు, తాగునీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తూ ప్రధాన కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేయాలి. 

►నాగార్జునసాగర్‌ నిర్వహణ విధి విధానాలపై(రూల్‌ కర్వ్స్‌) రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) తెలియజేసి ఖరారు చేసుకోవాలి. 

మిగులు జలాలను కోటాలో కలపొద్దు.. 
►ప్రతి సంవత్సరం రెండు రాష్ట్రాలు వినియోగించిన నీటిని రెండు విభాగాలుగా లెక్కించాలి. 75 శాతం లభ్యత ఆధారంగా ఏ రాష్ట్రం ఎంత వాడుకుంది.. ఎంత వాడుకోలేదు అన్నది లెక్కట్టాలి. మిగులు జలాలను ఏమేరకు మళ్లించారు అన్నది లెక్కకట్టాలి. 

►వరద రోజుల్లో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఏ మేరకు మళ్లించినా.. ఆ జలాలను మిగులు జలాలుగానే లెక్కకట్టాలి.  

►జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను మూసివేసిన సమయంలో అంటే మిగు లు జలాలు లేని రోజుల్లో వాడుకున్న నీటిని ఆయా రాష్ట్రాల నికర జలాల కోటాలో కలపాలి.  

►ఆర్‌ఎంసీ స్థానంలో జలాశయాల శాశ్వత నిర్వహణ కమిటీ(పీఆర్‌ఎంసీ) ఏర్పాటు చేసి.. ఉమ్మ డి జలాశయాల నిర్వహణను పర్యవేక్షించాలి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement