rmc
-
సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నీటి వినియోగంలో సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆర్ఎంసీ (జలాశయాల నిర్వహణ కమిటీ) తేల్చిచెప్పింది. రుతుపవనాల కాలంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులకు పైనే ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వర్కింగ్ అరేంజ్మెంట్ ప్రకారం.. శ్రీశైలం వద్ద ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం (50: 50) పంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై తుది నివేదిక ఇచ్చారు. డిసెంబర్ 3న నిర్వహించిన ఆర్ఎంసీ ఆరో సమావేశంలో తుది నివేదికను రెండు రాష్ట్రాలు అంగీకరించినా.. దానిపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్ 5న ఏర్పాటుచేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారని, దీంతో ఆర్ఎంసీలో మిగతా సభ్యులైన నలుగురు (కన్వీనర్ ఆర్కే పిళ్లై, కృష్ణా బోర్డు సభ్యులు మౌతాంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో డైరెక్టర్ ఎమ్వీవీ సత్యనారాయణ) తుది నివేదికపై సంతకాలు చేశారని తెలిపారు. ఈ తుది నివేదికపై బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కృష్ణా బోర్డు ఆమోదించాకే ఆర్ఎంసీ నివేదిక అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు నోటిఫై అయ్యే దాకా ఈ నివేదిక అమల్లో ఉంటుందని తెలిపారు. ఆర్ఎంసీ తుది నివేదిక, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్స్ ఆధారంగా నీటి కేటాయింపులకు రక్షణ కల్పి ంచాలంటూ రెండు రాష్ట్రాలు కేడబ్ల్యూడీటీ–2ను కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఆర్ఎంసీ తుది నివేదికలో మరికొన్ని ప్రధానాంశాలు ఇవీ.. ►శ్రీశైలం జలాశయంలో 75 శాతం లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలి. ఆ తర్వాతే విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. ►శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ►ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన నీటిని నిల్వ చేయాలి. ►శ్రీశైలంకు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ మిలియన్ యూనిట్లలో లెక్కకట్టి.. దాన్ని ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలి. ►నాగార్జునసాగర్‌కు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య రూల్ కర్వ్‌లో నిర్ణయించిన నీటి మట్టం కంటే ఎక్కువగా ఉంటే విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఉత్పత్తయిన విద్యుత్‌ను లెక్కకట్టాలి. వరద తగ్గాక.. దిగువున సాగు, తాగునీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తూ ప్రధాన కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేయాలి. ►నాగార్జునసాగర్ నిర్వహణ విధి విధానాలపై(రూల్ కర్వ్స్) రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) తెలియజేసి ఖరారు చేసుకోవాలి. మిగులు జలాలను కోటాలో కలపొద్దు.. ►ప్రతి సంవత్సరం రెండు రాష్ట్రాలు వినియోగించిన నీటిని రెండు విభాగాలుగా లెక్కించాలి. 75 శాతం లభ్యత ఆధారంగా ఏ రాష్ట్రం ఎంత వాడుకుంది.. ఎంత వాడుకోలేదు అన్నది లెక్కట్టాలి. మిగులు జలాలను ఏమేరకు మళ్లించారు అన్నది లెక్కకట్టాలి. ►వరద రోజుల్లో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఏ మేరకు మళ్లించినా.. ఆ జలాలను మిగులు జలాలుగానే లెక్కకట్టాలి. ►జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను మూసివేసిన సమయంలో అంటే మిగు లు జలాలు లేని రోజుల్లో వాడుకున్న నీటిని ఆయా రాష్ట్రాల నికర జలాల కోటాలో కలపాలి. ►ఆర్ఎంసీ స్థానంలో జలాశయాల శాశ్వత నిర్వహణ కమిటీ(పీఆర్‌ఎంసీ) ఏర్పాటు చేసి.. ఉమ్మ డి జలాశయాల నిర్వహణను పర్యవేక్షించాలి. -
శ్రీశైలంపై తెగని పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) చివరి సమావేశం సోమవారం రెండోరోజు కొనసాగగా.. తెలంగాణ అధికారుల గైర్హాజరుతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. గత శనివారం జలసౌధలో జరిగిన మొదటిరోజు సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరై.. ఆర్ఎంసీ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికలోని పలు అంశాలపై ఏకాభిప్రాయం తెలపడంతో పాటు సమావేశాన్ని సోమవారం కూడా కొనసాగించి తుది నివేదికపై సంతకాలు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ (నిర్వహణ నిబంధనలు)లో స్వల్ప మార్పులకు రెండు రాష్ట్రాలు ఓకే అన్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నియంత్రించాలనే మరో నిబంధనకు కూడా అంగీకారం తెలిపాయి. తీరా సోమవారం నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్ బి.రవికుమార్ పిళ్లై నేతృత్వంలో సోమవారం కమిటీ సమావేశం కాగా, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో పాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌తో పాటు ఇతర అధికారుల రాకకోసం దాదాపు అర్ధగంటకు పైగా నిరీక్షించారు. ఈ విషయాన్ని పిళ్లై తెలంగాణ ఈఎన్సీకి ఎస్ఎంఎస్ ద్వారా తెలపగా, తాము రావడం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో ఏపీ ఈఎన్సీ, ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) నుంచి తుది నివేదికపై సంతకాలను సేకరించిన ఆర్ఎంసీ కన్వీనర్ ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. విఫలమైన ఆర్ఎంసీ ప్రయత్నాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఎంత మేరకు నిల్వలుంటే ఎంత మేర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీరు, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలి అన్న అంశం రూల్‌కర్వ్‌లో ఉంటుంది. రెండు జలాశయాల రూల్‌కర్వ్‌తో పాటు జలవిద్యుదుత్పత్తి, మిగులు జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదికను సిఫారసు చేసేందుకు ఆర్ఎంసీ కమిటీని..కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేసింది. ఆరుసార్లు సమావేశమైన ఆర్ఎంసీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరి సమావేశం రెండో రోజు భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో ఆర్ఎంసీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్ఎంసీ తన తుది నివేదికలో చేయనున్న సాంకేతిక సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్ఎంసీ తుది నివేదికపై ఏపీ తరఫున తాము సంతకాలు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. కనీస నిల్వ 830 అడుగులు చాలు శ్రీశైలంలో కనీస నిల్వ మట్టం 854 అడుగులుండాలని ప్రతిపాదించడాన్ని తాము అంగీకరించడం లేదని, 830 అడుగులుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకోవాలన్న నిబంధననను రూల్‌కర్వ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించుకోవడానికి ఏపీ అంగీకరిస్తేనే మిగులు జలాల వినియోగం విషయంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక బట్వాడా జరపాలని, వాడని కోటాను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని సూచించారు. ముసాయిదా నివేదికలో తెలంగాణకి ప్రయోజనం కలిగించే అంశాలేమీ లేవని, తమకు ఆమోదయోగ్యం కాని ఈ నివేదికను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ను కోరారు. పిళ్లై తప్పుడు వార్తలు రాయించారు మా వైఖరిలో మార్పు లేదు: తెలంగాణ ఆర్ఎంసీ నివేదికకు అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నట్టు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మీడియాలో తప్పుడు వార్తలు రాయించారంటూ తెలంగాణ తీవ్ర ఆరోపణలు చేసింది. సరైన వాస్తవాలను మీడియాకు తెలియజేయాలని ఆయన్ను ఆదేశించాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి వాటాలు, విద్యుత్ వాటాలు, క్యారీ ఓవర్ నిల్వలు, వరద జలాల లెక్కింపుపై తమ రాష్ట్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆర్ఎంసీ తుది సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. 50:50 నిష్పత్తిలో శ్రీశైలం విద్యుత్‌ను పంచుకోవాలంటూ తమకిచ్చిన ముసాయిదా నివేదికలో ఆర్ఎంసీ చేసిన సిఫారసును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి అవసరాలకే శ్రీశైలం జలాశయం ఉందని, జల విద్యుదుత్పత్తితో 240 టీఎంసీలను విడుదల చేయడం ద్వారా నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు. -
ఏకాభిప్రాయానికి చివరి యత్నం
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సిఫారసులపై ఏకాభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తుది ప్రయత్నం చేయనుంది. ఈ నెల 24వ తేదీ ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్ఎంసీ చివరి సమావేశాన్ని నిర్వ హించనుంది. ఈ మేరకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది. ఈ సమావే శానికి ఏ ఒక్క రాష్ట్రం ప్రతినిధులు గైర్హాజరైనా లేక కమిటీ సిఫారసులపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరక పోయినా.. తన కార్యాచరణలో ఆర్ఎంసీ విఫలమైనట్టు నివేదిస్తామని స్పష్టం చేసింది. గతంలో కొన్ని ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ, ఏపీలు గైర్హాజరైన నేపథ్యంలో ఈ నిబంధనను పొందుపర్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నిర్వ హణకు సంబంధించిన విధివిధానాలను (రూల్ కర్వ్) సిఫారసు చేసేందుకు గతంలో ఆర్ఎంసీని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ సిఫారసులకు తుది రూపమివ్వడంతో పాటు సంతకాల స్వీకరణ కోసం చివరిసారిగా 24న ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టింది. గత సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదిరిన పలు అంశాలపై సైతం ప్రస్తుత భేటీలో పునః సమీక్ష కోరవచ్చని తెలిపింది. ఏకాభిప్రాయం కష్టమేనా? శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎంతమేర నీటి నిల్వలున్నప్పుడు, ఎంత మేర నీళ్లను సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు విని యోగించాలి అన్న అంశంపై ఆర్ఎంసీ సిఫారసు లు చేయాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో తాత్కాలికంగా కృష్ణాజలాల పంపిణీని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచేలా రూల్ కర్వ్‌లో పొందుపర్చాలని డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను తరలించుకోవడానికి ఉండాల్సిన కనీస నిల్వ మట్టం 834 అడుగులు మాత్రమేనని తెలంగాణ అంటుండగా, 854 అడుగులుండాలని ఏపీ వాదిస్తోంది. శ్రీశైలం జలాలు పూర్తిగా జలవిద్యుదుత్పత్తి కోసమేనని తెలంగాణ అంటుండగా, సాగు, తాగునీటి అవస రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ పేర్కొంటోంది. వరద జలాల వినియోగాన్ని సైతం లెక్కించి సంబంధిత రాష్ట్రం ఖాతాలో జమ చేయాలని తెలంగాణ కోరుతుండగా, ఏపీ వ్యతిరేకిస్తోంది. ఆయా అంశాలపై రెండు రాష్ట్రాల సమ్మతితో రూల్‌కర్వ్‌కు తుది రూపు ఇవ్వడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే చివరి సమావేశంలోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని, లక్ష్య సాధనలో ఆర్ఎంసీ విఫలమయ్యే సూచనలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
17న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధివిధానాలను రూపొందించేందుకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) అక్టోబర్ 17న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే అంశంపై నియమావళి (రూల్ కర్వ్), విద్యుత్ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది. ముసాయిదా నివేదికను ఖరారు చేసేందుకు ఆగస్టు 23న సమావేశం కావాలని ఆర్ఎంసీ చైర్మన్ ఆర్కే పిళ్లై తొలుత నిర్ణయించారు. కానీ, ఆ సమావేశం వాయిదా వేయాలని రెండు రాష్ట్రాలు కోరడంతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కార్ మళ్లీ వాయిదా వేయాలని కోరింది. దీంతో అక్టోబర్ 17వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి కృష్ణా బోర్డుకు పంపనుంది. బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డు నిర్వహించనుంది. -
‘ఆర్ఎంసీ’ నివేదికపై రాష్ట్రం అభ్యంతరం.. కృష్ణా బోర్డుకు లేఖ
సాక్షి, హైదరాబాద్: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) ముసాయిదా నివేదికలో తమ ప్రతిపాదనలేవీ చేర్చకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదనలను మాత్రమే నివేదికలో చేర్చడంపై తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ మంగళవారం కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్‌కు లేఖ రాశారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్‌ను తెలంగాణ, ఏపీ మధ్య 76:24 నిష్పత్తిలో పంపకాలు జరపాలని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు విడు దల చేయరాదని, శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో బట్వాడా చేయాలన్న నిబంధనలను రూల్‌కర్వ్‌లో పొందుపర్చాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆర్ఎంసీ సమావేశంలో తెలంగాణ చేసిన ఈ ప్రతిపాదనలను ముసాయిదా నివేదికలో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. -
23న కృష్ణాబోర్డు ఆర్ఎంసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధి విధానాలను రూపొందించడానికి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ (రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ) ఈనెల 23న ఉద యం 11 గంటలకు బోర్డు కార్యాలయంలో సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయడానికి సంబంధించిన నియమావళి (రూల్ కర్వ్), విద్యుదుత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి.. కృష్ణా బోర్డుకు పంపనుంది. బోర్డు ఆమోదముద్ర వేశాక, ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డు నిర్వహించనుంది. ఇక 2022–23 సంవత్సరంలో కృష్ణా జలాల లభ్యత, వాటాలు, వినియోగంపై చర్చించడానికి బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన ఈనెల 23న మధ్యాహ్నం 3.30కు త్రిసభ్య కమిటీ సమావేశమవుతోంది. ఈ సమావేశాలకు హాజరుకావాలని 2 రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు లేఖలు రాసింది. -
జూలై 1న ఆర్ఎంసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యు దుత్పత్తితో పాటు కృష్ణాలో మిగులు జలాల వినియోగంపై చర్చించడానికి జూలై 1న జలసౌధలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. ఇప్పటికే రెండుసార్లు ఆర్ఎంసీ సమావేశం జరగగా, తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. అయినా రిజర్వాయర్ల నిర్వహణకు సంబం ధించిన ముసాయిదా రూల్‌కర్వ్ (విధివిధానాలు)పై ఈ సమావేశాల్లో కృష్ణాబోర్డు అధికారులు చర్చించారు. 1న జరగనున్న సమావేశంలో రూల్‌కర్వ్‌కు తుదిరూపమిచ్చి తదుపరి నిర్వహించే భేటీలో ఆమో దించాలని కృష్ణాబోర్డు యోచిస్తోంది. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని విడుదల చేసే అంశంపై బోర్డు శుక్ర వారం నిర్ణయం తీసుకోనుంది. -
తెలంగాణ లేకుండానే ఆర్ఎంసీ తొలి భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఈఆర్ఎంబీ) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులతో కలసి ఏర్పాటు చేసిన ‘రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ)’తొలి సమావేశం శుక్రవారం ఇక్కడి జలసౌధలో జరిగింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్, రూల్ కర్వ్, కృష్ణాలో మిగులుజలాల అంశాలను తేల్చడానికి ఈ భేటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని బోర్డు తోసిపుచ్చింది. కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ పిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేఆర్ఎంబీ మెంబర్(పవర్) ఎల్.బి.ముత్తంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ సుజయకుమార్ హాజరయ్యారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తికి సాగు, నీటి అవసరాలే ప్రామాణికం కావాలని నారాయణరెడ్డి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవోలు, బచావత్ ట్రిబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకొని జలవిద్యుత్‌పై నిర్ణయం తీసుకోవాలన్నారు. నీటి కేటాయింపులు, నిబంధనలు పాటిస్తూ ఎవరికీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. తుంగభద్ర జలాశయంలోంచి నీటివిడుదలపై తుంగభద్ర బోర్డు అనుసరిస్తున్న ఆపరేషన్ ప్రొటోకాల్‌ను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోనూ అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విడుదల చేసిన రూల్ కర్వ్ ముసాయిదాపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తదుపరి సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులను పిలిపించి రూల్ కర్వ్‌పై చర్చించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. కృష్ణాలో మిగులు జలాలను లెక్కించరాదని కోరింది. కాగా, తదుపరి సమావేశంలో జలవిద్యుత్ ఉత్పాదనపై స్పష్టత వస్తుందని కేఆర్ఎంబీ మెంబర్ కన్వీనర్ రవికుమార్ పిళ్లై స్పష్టం తెలిపారు. -
క్రికెట్ టోర్నీ చాంపియన్ ఆర్ఎంసీ
కాకినాడ సిటీ : రంగరాయ మెడికల్ కళాశాల క్రికెట్ జట్టు ఆలిండియా మెడికల్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచింది. ఈనెల 17 నుంచి 25 వరకు తమిళనాడు లోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో జరిగిన టోర్నీ ఫైనల్లో ఆర్ఎంసీ జట్టు పుదుచ్చేరి జట్టుపై విజయం సాధించింది. ట్రోఫీతో కళాశాలకు చేరుకున్న జట్టు సభ్యులను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, ఆర్ఎంసీ జట్టు పీడీ స్పర్జన్‌రాజు అభినందించారు. ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు ప్రాధాన్యతనిస్తూనే క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఆలిండియా స్థాయిలో 2010లో విజేతగా, 2012లో ద్వితీయస్థానంలో నిలిచిందని, ఇప్పుడు మళ్లీ విజ యం సాధించడం అభినందనీయమని అన్నారు.