సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరో మారు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తుండటం, రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలు పరిష్కరించకపోవడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదివారం కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులను తనిఖీ చేయకుండా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలిస్తామనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని, వర్కింగ్ మాన్యువల్ నోటిఫై కాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రాజెక్టు పరిశీలన బృందంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన తటస్థులు ఉండాలని, ప్రస్తుత సభ్యులపై మాకు కొన్ని అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టుల పరిశీలన కంటే ట్రిబ్యునళ్ల తీర్పులు, విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను పరిశీలించాలన్న విషయాన్ని ముందుగా కృష్ణా బోర్డులో చర్చించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా కరోనా...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోన్న విషయాన్ని కృష్ణా బోర్డు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. శనివారం ఏపీలో 7,000కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 5,000 కేసులు నమోదయ్యాయని, కొత్త కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. సీమ ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కరోనా బారిన పడ్డారని, ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పరిశీలన సూచించదగ్గ నిర్ణయం కాదన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించే వరకు పర్యటన రద్దు చేసుకోవాలని లేఖలో శ్యామలరావు కోరారు.
పరిశీలన రద్దు చేసుకోండి
Published Mon, Apr 19 2021 3:48 AM | Last Updated on Mon, Apr 19 2021 3:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment