ఈసారైనా కొలిక్కివచ్చేనా!?  | 16th Plenary Meeting of Krishna Board | Sakshi
Sakshi News home page

ఈసారైనా కొలిక్కివచ్చేనా!? 

Published Mon, Jun 5 2023 4:07 AM | Last Updated on Mon, Jun 5 2023 4:07 AM

16th Plenary Meeting of Krishna Board - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణాజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి దారితీస్తున్న మూడు అంశాలను ఈసారైనా రిజర్వాయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) కొలిక్కి తెస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కృష్ణాబోర్డు 16వ సర్వసభ్య సమావేశంలో తీర్మానించిన మేరకు మూడు అంశాలపై ఆర్‌ఎంసీ చర్చించి, పరిష్కారానికి రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడానికి తొలుత అంగీకరించిన తెలంగాణ అధికారులు తర్వాత అడ్డంతిరిగారు.

దీంతో కృష్ణాబోర్డు సభ్యులు, ఏపీ అధికారులు సంతకాలు చేసిన నివేదికనే బోర్డుకు ఆర్‌ఎంసీ అందజేసింది. ఆ తర్వాత కృష్ణాబోర్డు ఆర్‌ఎంసీని రద్దుచేసింది. గత నెల 10న నిర్వహించిన 17వ సర్వసభ్య సమావేశంలో ఇదే అంశంపై చర్చించిన కృష్ణాబోర్డు.. రెండు రాష్ట్రాల అధికారుల సమ్మతి మేరకు ఆర్‌ఎంసీని పునర్ధురించింది. ఆ మూడు అంశాలపై నెల రోజుల్లోగా మళ్లీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని కృష్ణాబోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌కుమార్‌ ఆదేశించారు.

దిగువ కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఉమ్మడి ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోను, నాగార్జునసాగర్‌ తెలంగాణ సర్కార్‌ ఆధీనంలోను ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల నిర్వహణలో.. అంటే వాటి ద్వారా ఆయ­కట్టుకు నీటిని విడుదల చేయడంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు వివాదాలు తలెత్తుతు­న్నాయి. ప్రధా­నంగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్‌ యథే­చ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం కూడా వివా­దాలకు కారణమవుతోంది.

కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ నిండి.. జలాలు కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన జలాలను కోటాలో కలపకూడదని ఏపీ సర్కార్‌ ప్రతిపాదిస్తుండగా.. తెలంగాణ సర్కార్‌ వ్యతిరేకిస్తోంది. ఈ మూడు అంశాలపై అధ్యయనం చేయడానికి బోర్డు సభ్యుడు అనిల్‌కుమార్‌ గుప్తా అధ్యక్షతన బోర్డు సభ్యుడు ఎల్‌.బి.ముయన్‌తంగ్, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, జెన్‌కో డైరెక్టర్లు సభ్యు­లుగా ఆర్‌ఎంసీని కృష్ణాబోర్డు పునరుద్ధరించింది. 

ఏకాభిప్రాయం సాధ్యమేనా?
బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రూల్‌ కర్వ్స్‌పై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన ముసా­యి­దాపై చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు వాటిలో మార్పులు చేయాలని ఆర్‌ఎంసీకి బోర్డు నిర్దేశించింది.

కృష్ణాబోర్డు అనుమతి లేకుండానే.. దిగువన నీటి అవసరాలు లేకున్నా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్‌ యథేచ్ఛగా విద్యుదు­త్పత్తి చేస్తుండటం  వల్ల జలాలు వృథా అవుతున్న నేపథ్యంలో.. దానిపై చర్చించి విద్యుదుత్పత్తికి నియమావళిని రూపొందించాలి. వరద రోజుల్లో మళ్లించిన జలాలను కోటాలో కలపాలా? వద్దా? అనే అంశంపైన కూడా చర్చించాలి. ఈ అంశాలపై ఆర్‌ఎంసీలో సభ్యులైన కృష్ణాబోర్డు సభ్యులిద్దరు, ఏపీ అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ అధికారులు విభేదిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement