సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడేస్తుండటం వల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిని అధిగమించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేడబ్ల్యూడీటీ–1, విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు 111 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, ఆ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్ (చెన్నై) ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేశామని వెల్లడించారు.
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నేతృత్వంలోని ఎన్విరాన్‌మెంటల్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) గత నెల 17న నిర్వహించిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి అడిగిన అదనపు సమాచారాన్ని గత నెల 30న అందజేశామని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి జారీ చేయడానికి సంబంధించి ఈనెల 7న ఈఏసీ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు సీమ ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను గత నెల 30న సమర్పించామన్నారు. సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి జారీ చేయాలని గత నెల 10న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శికి లేఖ రాశామని తెలియచేశారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని సీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా పర్యావరణ అనుమతి ఇచ్చేలా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయాలని అభ్యర్థించారు. అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తే రాష్ట్ర ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు ప్రకాశ్ జవదేకర్‌కు సీఎం జగన్ సోమవారం లేఖ రాశారు.
లేఖలో ప్రధానాంశాలు ఇవీ..
► కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ప్రాజెక్టుల నిర్వహణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటూ హక్కుగా మాకు దక్కిన వాటా నీళ్లను మాకు అందకుండా చేస్తోంది.
► శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గ్రావిటీపై సాగు, తాగునీరు అందించవచ్చు. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయవచ్చు. శ్రీశైలంలో 796 అడుగుల నీటి మట్టం నుంచే విద్యుదుత్పత్తి చేస్తూ జూన్ 1 నుంచి ఇప్పటిదాకా ప్రాజెక్టులోకి వచ్చిన 26 టీఎంసీల్లో 19 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. దీంతో నీటి మట్టం 854 అడుగులకు చేరుకోలేకపోయింది. దీనివల్ల దుర్భిక్ష ప్రాంతాలకు, చెన్నైకి నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది.
► శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తరలించేలా ఎలాంటి అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టింది. ఈ అక్రమ ప్రాజెక్టులు కూడా పూర్తయితే శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం దుర్లభం.
► ఈ నేపథ్యంలో గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించేందుకు తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడం మినహా మాకు మరో మార్గం లేదు. ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాం.
► ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ఎత్తిపోతల పథకం కోసం కొత్తగా భూ సేకరణ చేయడం లేదు. అటవీ భూమి, అభయారణ్యంలో ఎత్తిపోతల పనులు చేయడం లేదు. ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్) నుంచి 10 కి.మీ. అవతల ఈ ఎత్తిపోతల పథకం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment