Krishna Water Dispute: శ్రీశైలం, సాగర్, పులిచింతలలోకి వచ్చిన నీటిని వచ్చినట్టు తోడేస్తున్న తెలంగాణ - Sakshi
Sakshi News home page

Krishna Water Dispute: జలాశయాలు విలవిల

Published Fri, Jul 2 2021 4:22 AM | Last Updated on Sat, Jul 3 2021 5:15 PM

Telangana is draining water as it came from Srisailam, Pulichinthala - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ జలవిధానం, కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి(వర్కింగ్‌ ప్రొటోకాల్‌)లను తుంగలో తొక్కుతూ.. శ్రీశైలం, సాగర్, పులిచింత ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండడాన్ని రెండు రాష్ట్రాల్లోని విద్యుత్, నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. సాగునీటి అవసరాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేయడం వల్ల ఏపీకే కాదు.. తెలంగాణకూ నష్టమేనని తేల్చిచెబుతున్నారు. అయినా సరే.. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కల్పించడం లక్ష్యంగా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుండటం బరితెగింపునకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలల్లో విద్యుదుత్పత్తిని చేయకుండా తెలంగాణను నిలుపుదల చేసి.. తమ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం పదే పదే లేఖలు రాస్తోంది.

వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు.. విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు సరి కదా శ్రీశైలం, సాగర్, పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద పోలీసులను మోహరించి మరీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ యథేచ్ఛగా దిగువకు నీటిని విడుదల చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో.. గేట్లు ఎత్తి జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఇరు రా ష్ట్రాల్లోని ప్రాజెక్టులనూ బోర్డు అధీనంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తున్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం:  885 అడుగులు  

తెలంగాణ  ఏం చేస్తోంది?

► జూన్‌ 1 నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంది. కనీస నీటి మట్టం కంటే దిగువన ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి, కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది.  
► శ్రీశైలంలో 854 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు, రాయలసీమ, నెల్లూరు కోసం రోజుకు ఏడు వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. 848 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే.. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా చుక్క నీటిని తరలించడానికి అవకాశం ఉండదు. 

శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి(ప్రోటోకాల్‌) ప్రకారం విద్యుదుత్పత్తిని ఎప్పుడు చేయవచ్చు:  
► 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉండి, వరద ప్రవాహం వస్తున్న సమయంలో స్వచ్ఛందంగా విద్యుదుత్పత్తి చేయవచ్చు. 
► సాగర్‌ ఆయకట్టు కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినప్పుడు.. బోర్డు కేటాయించిన మేరకు ఏపీ, తెలంగాణలు రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ సమానస్థాయిలో నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. 

ఎవరికి ఎంత నష్టం
► శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం 823.33 అడుగుల్లో 43.35 టీఎంసీలు నిల్వ ఉండగా.. ప్రాజెక్టులోకి 13,340 క్యూసెక్కులు వస్తుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 30,610 క్యూసెక్కులను తెలంగాణ సాగర్‌కు విడుదల చేస్తోంది. 

► జలాశయంలో ఎక్కువ ఎత్తులో నీటి నిల్వ ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌.. తక్కువ ఎత్తు నీటి నిల్వ ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌కు సమానం. ఎందుకంటే ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ నీటిని విడుదల చేసినా.. టర్బైన్‌లు వేగంగా తిరుగుతాయి. తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ నీటిని విడుదల చేసినా టర్బైన్‌లు వేగంగా తిరగవు. తక్కువ ఎత్తు నుంచే నీటిని తరలించడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం పెరగదు. దీని వల్ల తెలంగాణకూ నష్టమే. ఇది తెలంగాణ జెన్‌కో అధికారులకు తెలియంది కాదు. 

► కేవలం.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు.. చెన్నైకి తాగునీటి అవసరాలకు నీటిని దక్కకుండా చేయాలన్న కారణంతోనే ఏకపక్షంగా తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తి చేస్తోంది. 

నాగార్జునసాగర్‌ పూర్తి నీటి మట్టం:  590 అడుగులు 

తెలంగాణ  ఏం చేస్తోంది?
కృష్ణా డెల్టాలో ఇప్పటిదాకా ఖరీఫ్‌ పంటలకు నీటిని విడుదల చేయలేదు. డెల్టాకు నీటిని కృష్ణా బోర్డు కేటాయించలేదు. నీటిని విడుదల చేయాలని కృష్ణా డెల్టా ఎస్‌ఈ ప్రతిపాదనలు పంపలేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ 32,190 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది.. ఆ జలాలు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి.  

సాగర్‌ నిర్వహణ నియమావళి ఏం చెబుతోంది?
► నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుని.. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పుడు తెలంగాణ, ఏపీ జెన్‌కోలు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక విద్యుదుత్పత్తిని నిలిపేయాలి. 
► కృష్ణా బోర్డు కృష్ణా డెల్టాకు కేటాయించిన జలాలను.. రోజుకు నిర్ధిష్ట పరిమాణంలో విడుదల చేయాలని ఎస్‌ఈ ప్రతిపాదనలు పంపినప్పుడు.. ఆ జలాలను విద్యుదుత్పత్తి కేంద్రాల్లో రెండు రాష్ట్రాలు చెరి సగం వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. 

ఎవరికి ఎంత నష్టం 
వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయడం వల్ల సాగర్‌లో నీటి మట్టం పెరగదు. దీని వల్ల ఏపీలో సాగర్‌ కుడి కాలువ కింద.. తెలంగాణ, ఏపీలోని సాగర్‌ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేయలేని పరిస్థితి.

పులిచింతల ప్రాజెక్టు 

తెలంగాణ  ఏం చేస్తోంది?
కృష్ణా డెల్టా ఎస్‌ఈ ప్రతిపాదనలతో నిమిత్తం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ 4,600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ఆ జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. 

‘పులిచింతల’ ప్రోటోకాల్‌ ఏం చెబుతోంది? 
కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం నిర్మించిన బ్యాలెనింగ్స్‌ రిజర్వాయర్‌ ఇది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. సముద్రంలోకి వరద జలాలు కలుస్తున్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక.. కృష్ణా డెల్టా అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డెల్టా ఎస్‌ఈ ప్రతిపాదనలు పంపినప్పుడే.. ఆ నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. 

ఎవరికి ఎంత నష్టం
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటలకు ఇప్పటిదాకా నీటిని విడుదల చేయలేదు. అవసరం లేకపోయినా దిగువకు విడుదల చేయడం వల్ల పులిచింతల ప్రాజెక్టు ఖాళీ అవుతుంది. కృష్ణా డెల్టా ప్రయోజనాలకు ఇది విఘాతం కల్పిస్తుంది. 

ప్రకాశం బ్యారేజీ

జాతీయ జలవిధానం ఏం చెబుతోంది? 
► ప్రాజెక్టులలో నిల్వ చేసిన జలాలను వినియోగించడానికి కేంద్రం జాతీయ జలవిధానాన్ని (నేషనల్‌ వాటర్‌ పాలసీ) ప్రకటించింది. ఆ విధానం ప్రకారం
► మొదటి ప్రాధాన్యం: తాగునీటి అవసరాలు
► రెండో ప్రాధాన్యం: సాగునీరు
► మూడో ప్రాధాన్యం: సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే సమయంలోనే విద్యుదుదుత్పత్తి చేయవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement