
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శ్రీశైలానికి ఎగువన ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను అడ్డుకుని ఆంధ్ర రైతుల ప్రయోజనాలు కాపాడాలని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీకి లేఖ రాసినట్లు సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ తెలిపారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల వలన ఆంధ్ర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
తెలంగాణ ప్రాజెక్టుల వలన జరిగే నష్టాలను వివరిస్తూ కేఆర్‌ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్‌కు ఈ–మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా విద్యుదుత్పత్తి పేరుతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి నీటిని వృథాగా దిగువకు వదులుతోందని, దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీనీ కోరారు.